సిటీబ్యూరో, నవంబర్ 18(నమస్తే తెలంగాణ) : హైదరాబాద్ నగరంలో మంగళవారం ఆదాయపు పన్నుశాఖ సోదాలు చేపట్టింది. ఏకకాలంలో 30 చోట్ల తనిఖీలు చేపట్టారు. ప్రముఖ హోటళ్ల చైర్మన్లు, డైరెక్టర్ల నివాసాల్లో సోదాలు చేసి పలు పత్రాలను పరిశీలించారు. పిస్తాహౌస్, షాగౌస్, మెహఫిల్ హోటళ్లలో అధికారుల తనిఖీలు జరిగాయి. ఈ హోటళ్లు ఏటా వందల కోట్ల వ్యాపారం చేస్తున్నాయని, భారీగా పన్ను ఎగవేత ఆరోపణల నేపథ్యంలో 50కి పైగా బృందాలతో ఐటీ అధికారులు రంగంలోకి దిగారు. హవాలా, నకిలీ లావాదేవీలు, అనుమానాస్పద ట్రాంజక్షన్స్ ఉన్నట్లు ఆరోపణలు రావడంతో అధికారులు ప్రతి రికార్డును నిశితంగా పరిశీలించారు. పిస్తాహౌస్‌కు హైదరాబాద్‌లో 44బ్రాంచ్‌లు ఉండగా, మెహఫిల్ రెస్టారెంట్‌కు 15బ్రాంచ్‌లు ఉన్నాయి. అంతేకాకుండా పిస్తాహౌస్, షాగౌస్ హోటళ్లు దేశంలోని వివిధ నగరాల్లోనూ ఉండగా దుబాయ్‌లోను వాటికి బ్రాంచ్‌లు ఉన్నట్లు అధికారులు తెలిపారు.
రాజేంద్రనగర్‌లోని పిస్తాహౌస్ యజమాని మాజిద్ ఇంట్లో, శాలిబండలోని పిస్తాహౌస్ ప్రధాన బ్రాంచ్‌ల్లో సోదాలు చేశారు. రికార్డుల్లో చూపిన ఆదాయం, నిజమైన ఆదాయం మధ్య వ్యత్యాసం, ట్యాక్స్ చెల్లింపులో తేడాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. పిస్తా హౌస్‌లో పనిచేసే వర్కర్ల ఇళ్లల్లోనూ, వర్కర్లకు కల్పించిన వసతి గృహాల్లోనూ సోదాలు జరిగాయి. వారికి సంబంధించిన ఫోన్లు, కంప్యూటర్లను ఐటీ అధికారులు చెక్ చేశారు. ఫోన్లలో, కంప్యూటర్లలో ఉన్న డేటాను ఐటీ శాఖకు సంబంధించిన హ్యాకర్లు విశ్లేషిస్తున్నారు. పిస్తా హౌస్ అకౌంటెంట్ మాత్రం ఇప్పటివరకు అందుబాటులోకి రాలేదని అధికారులు అనధికారికంగా చెప్పారు. కీలక డాక్యుమెంట్లను, హార్డ్‌డిస్క్‌లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.