సిటీబ్యూరో, మే 3 (నమస్తే తెలంగాణ) : జలమండలి కార్యాలయంపై మంగళవారం జరిగిన ఘటన బాధాకరమని జలమండలి ఎండీ దానకిశోర్ విచారం వ్యక్తం చేశారు. ప్రజ లు, ప్రజాప్రతినిధులు పార్టీలకతీతంగా అందరూ జలమండలి అధికారులు, సిబ్బందికి సహకరించాలని కోరారు. వారికి తగిన సహకారమందిస్తే.. ఇంకా మంచి సేవలు అందించడానికి అవకాశం ఉంటుందన్నారు. బుధవారం ఖైరతాబాద్ సంస్థ ప్రధాన కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. హైదరాబాద్ నగర ప్రజల అవసరాలు తీర్చడానికి తమ ఉద్యోగులు, సిబ్బంది కష్టపడి పనిచేస్తున్నారని ఎండీ వివరించారు. దేశంలో మన కంటే పెద్ద నగరాలు ఉన్నప్పటికీ తాగునీటి సరఫరా, మురుగు నీటి నిర్వహణ ఇతర అంశాల్లో హైదరాబాద్ నగరానికి కేంద్రం, ఇతర రాష్ట్రాల నుంచి అవార్డులు, ప్రశంసలూ దకాయన్నారు. తాగునీటి సరఫరాలో జలమండలికి ఐఎస్వో ధ్రువపత్రం వచ్చిందని ఎండీ పేర్కొన్నారు. ఇప్పటికే ఆయా నగరాల అధికారులు జలమండలిని సందర్శించిన విషయం గుర్తు చేశారు.
రికార్డు సమయంలో ప్రాజెక్టులు చేపట్టాం
గడిచిన కొన్నేళ్లలో అనేక ప్రాజెక్టులను చేట్టామని ఎండీ దానకిశోర్ తెలిపారు. ఇప్పటికే శివారు మున్సిపాలిటీల్లో తాగునీటి కోసం 52 రిజర్వాయర్లు రికార్డు స్థాయిలో పూర్తి చేశామని చెప్పారు. నగరంతో పాటు ఓఆర్ఆర్ ఫేజ్ -1 ద్వారా పలు గ్రామాల ప్రజలకూ తాగునీరు అందిస్తున్నామన్నారు. ప్రస్తుతం ఓఆర్ఆర్ పరిధిలోని కాలనీలు, గేటెడ్ కమ్యూనిటీలకు నీరందించడానికి ఫేజ్-2 ప్రాజెక్టు చేపట్టామని, ఇది తుది దశలో ఉందని తెలిపారు. జీహెచ్ఎంసీ పరిధిలో 60 శాతం మందికి పైగా నెలకు 20 వేల లీటర్ల వరకు ఉచితంగా తాగునీరు అందిస్తున్నామన్నారు. నగరంలో 100 శాతం మురుగు నీటి శుద్ధి కోసం కొత్తగా 31 ఎస్టీపీలు నిర్మిస్తున్నామని, ఇవి త్వరలో అందుబాటులోకి వస్తాయని పేరొన్నారు. నీటి లీకేజీ, కలుషిత నీటిని గుర్తించేందుకు ఇప్పటికే కొత్త పరికరాలు కొనుగోలు చేశామన్నారు. దీంతో సమస్యను సాధ్యమైనంత త్వరగా పరిష్కరించడానికి వీలవుతుందని ఎండీ తెలిపారు.
ప్రధాన మంత్రి కార్యాలయ ప్రశంసలు
సిల్ట్‌కు సంబంధించి నగరంలో 150 డివిజన్లు ఉన్నాయని, ప్రస్తుతం రెండు డివిజన్లకొక సిల్ట్ తొలగించే వాహనం ఉందని ఎండీ దానకిశోర్ చెప్పారు. త్వరలో డివిజన్‌కు ఒక అధునాతన వాహనాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని తెలిపారు. ప్రస్తుతం టెండర్ల ప్రక్రియ జరుగుతుందని వివరించారు.గత ఐదారేళ్లలో నగరంలో మ్యాన్‌హోల్‌లో పడి కార్మికుడు మృతి చెందిన ఘటన ఒక్కటి కూడా జరగలేదన్నారు. దీనికి తాము చేపడుతున్న మానవ రహిత పారిశుద్ధ్య పనులు కారణమని ఎండీ అన్నారు. ఇందుకు ప్రధాన మంత్రి కార్యాలయం నుంచి ప్రశంసలు వచ్చిందని ఎండీ దానకిశోర్ స్పష్టం చేశారు.
నిరసనలు తెలపండి.. దాడులు కాదు ;సెక్యూరిటీని పెంచాలని ఎండీ దానకిశోర్‌కు వినతి
జలమండలి ప్రధాన కార్యాలయంపై బీజేపీ కార్పొరేటర్లు మంగళవారం చేసిన దాడిపై జలమండలికి సంబందించిన వివిధ సంఘాల నాయకులు నిరసన తెలిపారు. ఖైరతాబాద్‌లోని ప్రధాన కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ దాడిని తాము తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. సంస్థలో 30 శాతం మంది మహిళలు పనిచేస్తున్నారని, ఇలాంటి ఘటనలతో ఉద్యోగులు భయాందోళనలకు గురవుతున్నారని తెలిపారు. సిల్ట్‌ని బయటకు తీసిన తర్వాత తడిగా ఉండటం వల్ల తొలగించలేమని, పూర్తిగా ఎండిపోయిన తర్వాత వాహనం వచ్చి తీసుకెళుతుందన్నారు. సిల్ట్‌ని కార్యాలయం ఆవరణలో పారబోయడం, సంస్థ ఆస్తిని ధ్వంసం చేయడం దారుణమన్నారు. కార్యాలయాల్లో సెక్యూరిటీ సిబ్బందిని నియమించాలని ఎండీ దానకిశోర్‌కు వినతి పత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో జలమండలి ఇంజినీర్స్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు రాజశేఖర్, హరిశంకర్, వాటర్‌వర్క్స్ ఎంప్లాయీస్ యూనియన్ తెలంగాణ అధ్యక్షుడు రాంబాబు యాదవ్, జనరల్ సెక్రటరీ జయరాజ్, వర్కింగ్ ప్రెసిడెంట్ లక్ష్మీనారాయణ, జలమండలి ఇంజినీర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు రాజశేఖర్, జనరల్ సెక్రటరీ హరిశంకర్, జలమండలి టీజీవో శాఖ అధ్యక్షుడు మహ్మద్ అబ్దుల్ ఖాదర్, జనరల్ సెక్రటరీ చంద్రజ్యోతి, తదితరులు పాల్గొన్నారు.