ఉస్మానియా యూనివర్సిటీ, జూన్ 12: ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల భవనాన్ని(OU Arts College) వర్సిటీ ఇంచార్జి వీసీ, పురపాలక శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ, హెచ్ఎండీఏ కమిషనర్ దాన కిశోర్( Dana Kishore) బుధవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన కళాశాలలోని లైబ్రెరీతో పాటు తరగతి గదులు, సెమినార్ హాల్స్, వివిధ అంతస్తుల్లోని గదులను పరిశీలించారు. తరగతి గదుల్లో ఉన్న విద్యార్థులు, అధ్యాపకులతో ఆయన సంభాషించారు. కళాశాల భవనానికి రంగులు, పెయింటింగ్ వేయించేందుకు అవసరమైన నిధులను హెచ్ఎండీఏ నుంచి మంజూరు చేస్తామని తెలిపారు. దీనికి తగిన అంచనాలను తక్షణమే రూపొందించాలని ఆదేశించారు.
ఆర్ట్స్ కళాశాల చుట్టూ ఫెన్సింగ్ వేయడంతో పాటు ఎస్బీఐ బ్యాంకు ముందు భాగంలో నూతనంగా లాన్ డెవలప్మెంట్ చేయాలని అధికారుకు సూచించారు. మెయిన్ లైబ్రెరీ సమీపంలోనే 500 మంది విద్యార్థులు కూర్చునే సామర్థ్యంతో రీడింగ్ భవనాన్ని నిర్మించేందుకు ప్రణాళిక సిద్ధం చేయాలన్నారు. వీటన్నింటికీ అవసమైన నిధులను హెచ్ఎండీఏ నుంచి విడుదల చేయించేందుకు కృషి చేస్తానన్నారు.
స్టూడెంట్ ఎక్స్చేంజ్ కార్యక్రమంలో భాగంగా థాయిలాండ్‌లోని యూనివర్సిటీలలో పరిశోధక విద్యార్థులు పరిశోధన చేసేందుకు ఆరుగురు ఎంపికకాగా, వారికి హెచ్ఎండీఏ నుంచి ఫెలోషిప్తో సహకారం అందించనున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో రిజిస్ట్రార్ ప్రొఫెసర్ లక్ష్మీనారాయణ, ప్రిన్సిపల్ ప్రొఫెసర్ అర్జున్‌రావు, ఓఎస్డీ టు వీసీ ప్రొఫెసర్ రెడ్యానాయక్, వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ బీనవేణి రామ్ షెఫర్డ్, ఓయూ చీఫ్ ఇంజినీర్ ప్రొఫెసర్ రాధిక తదితరులు పాల్గొన్నారు.