సిటీబ్యూరో, డిసెంబర్ 27 (నమస్తే తెలంగాణ)/ బంజారాహిల్స్ : జలగం వెంగళరావు పార్కులో హార్ట్ ఫుల్ నెస్ ఇనిస్టిట్యూట్ సంస్థ సీఎస్ఆర్ కింద ఏర్పాటు చేసిన యోగా, మెడిటేషన్ సెంటర్ను బుధవారం ఉదయం జీహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్రాస్తో కలిసి మేయర్ గద్వాల్ విజయలక్ష్మి ప్రారంభించారు. ఈ సందర్భంగా యోగా, మెడిటేషన్లో పాల్గొన్నారు. అనంతరం మేయర్ మాట్లాడుతూ.. మనస్సు ప్రశాంతంగా, చురుగ్గా ఉండేందుకు ప్రతి రోజు యోగా, మెడిటేషన్ తప్పనిసరిగా ఆచరించాలన్నారు. హార్ట్ఫుల్ నెస్ ఇనిస్టిట్యూట్ సంస్థ జలగం వెంగళ్రావు పార్కును సీఎస్ఆర్ కింద అభివృద్ధి చేయడంతో పాటు బ్యూటిఫికేషన్ కోసం హెర్బల్, మెడిసిన్ గార్డెన్స్ , బయో డైవర్సిటీ మొక్కలు , పరాగసంపర్క ఉద్యానవనం, సుగంధ మొక్కలు పెంచడంలో జీహెచ్ఎంసీతో సమన్వయం చేసుకుంది. ఈ కార్యక్రమంలో జోనల్ కమిషనర్ వెంకటేశ్ దొత్రే, ఈఈ శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు. అనంతరం కమిషనర్ ఎనాన్స్ సెంటర్ వద్ద గల పార్కు అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. కమిషనర్ వెంట చీఫ్ వెటర్నరీ ఆఫీసర్ అబ్దుల్ వకిల్, ఇంజినీరింగ్ అధికారులు పాల్గొన్నారు.