మహేశ్వరం, సెప్టెంబర్ 30 : రైతు బంధు, రైతు భీమాతో సీఎం కేసీఆర్ అన్నదాతల గుండెల్లో గూడు కట్టుకున్నారని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ర్టానికి సీఎం కేసీఆర్ నాయకత్వమే శ్రీరామరక్ష అని చెప్పారు. అన్ని కులాలకు ఆత్మగౌరవ భవనాలను నిర్మిస్తున్నామన్నారు. శనివారం మహేశ్వరం మండల కేంద్రంలో స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్, ఎంపీ రంజిత్‌రెడ్డి, జడ్పీ చైర్పర్సన్ తీగల అనితా హరినాథ్‌రెడ్డితో కలిసి రూ. 69 లక్షలతో మార్కెట్ షెడ్డు , రూ. 4.20 లక్షలతో గిరిజన వసతి గృహం, రూ. 5 కోట్లతో నిర్మించిన సంక్షేమ బాలుర పాఠశాల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. అనంతరం సేవాలాల్ దేవాలయం, కుల సంఘాలకు ఆత్మ గౌరవ భవనాలకు శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధిలో దూసుకుపోతున్నదన్నారు. మహేశ్వరం నియోజక వర్గానికి మంత్రి సత్యవతి రాథోడ్ విద్యాలయాలకు రూ. 20 కోట్లు మంజూరు చేశారని చెప్పారు.
సీఎం కేసీఆర్ నాయకత్వంలో నియోజక వర్గానికి అభివృద్ధిలో బాటలు వేస్తున్నామన్నారు. కుల సంఘాలకు స్థలాలను ఎంపిక చేయడంలో స్థానికుల పాత్ర ఎంతో గొప్పదని అన్నారు. సీఎం కేసీఆర్ స్ఫూర్తితో నియోజక వర్గంలో 24 కులాలకు ఆత్మగౌరవ భవనాలను నిర్మించి ఇస్తున్నామని తెలిపారు. నియోజకవర్గంలో రూ. 15 కోట్లతో ఆత్మగౌరవ భవనాలను నిర్మిస్తున్నామని వెల్లడించారు. నియోజకవర్గంలో అర్హులైన పేదలకు 75 గజాల స్థలాలను కేటాయిస్తామన్నారు. మన్సాన్పల్లిలో 5 ఎకరాల్లో పేదలకు ఇండ్ల పట్టాలను అందజేస్తున్నామని వెల్లడించారు. సొంత ఇంటి జాగ ఉన్న వారికి గృహలక్ష్మి పథకం కింద రూ. 3 లక్షలను అందజేస్తున్నట్లు వెల్లడించారు. ఆడబిడ్డ వివాహాలకు రూ. 1 లక్షను అందజేసి ఇంటి పెద్ద దిక్కుగా వారి కుటుంబాలకు అండగా నిలుస్తున్నామన్నారు. అనంతరం ఉప్పుగడ్డతండా, కొత్తతండా, గంగారం తండా, దిలావర్గూడ, ఎన్డీతండాలకు చెందిన పేదలకు ఇండ్ల పట్టాలను మంత్రి సత్యవతి రాథోడ్‌తో కలిసి ఆమె పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ యువ నాయకుడు కార్తీక్‌రెడ్డి, ఎంపీపీ సునీతా ఆంధ్యానాయక్, సహకార బ్యాంక్ చైర్మన్ మంచె పాండు యాదవ్, వైస్ చైర్మన్ వెంకటేశ్వర్‌రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ సురసాని సురేందర్‌రెడ్డి, వైస్ చైర్మన్ ఆనందం, తహసీల్దార్ మహమూద్ అలీ, నియోజక వర్గం బీసీ సెల్ అధ్యక్షుడు మల్లేశ్‌యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
కుల వృత్తులకు ఆదరణ మంత్రి సత్యవతి రాథోడ్
ఒకే రోజు 9 కుల సంఘాలకు ఆత్మగౌరవ భవనాలకు శంకుస్థాపన చేయడం చాలా సంతోషంగా ఉన్నది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాతనే సేవాలాల్ జయంతి అధికారికంగా నిర్వహించడం చాలా గర్వకారణం. కాంగ్రెస్, బీజేపీ పార్టీలు ఏనాడూ గిరిజనులను పట్టించుకున్న పాపాన పోలేదు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో కుల వృత్తులకు ఆదరణ లభిస్తున్నది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వెయ్యికి పైగా గురుకులాల్లో 7 లక్షల మంది విద్యనభ్యస్తున్నారు. ఎరుకల కుల సంక్షేమానికి కృషి చేస్తాం. నగరం నడిబొడ్డున రూ. 5 కోట్లతో ఎరుకల భవనం నిర్మించబోతున్నాం. ఎరుకల సంక్షేమం కోసం రూ. 62 కోట్లతో ఎంపవర్మెంట్ పథకాన్ని ప్రవేశపెట్టాం.
కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలకు వారంటీ లేదు ; ఎంపీ రంజిత్‌రెడ్డి
తెలంగాణలో కాంగ్రెస్ చెప్పిన ఆరు గ్యారెంటీలకు వారంటీ లేదు. తెలంగాణను చూసి కేంద్రం మన రాష్ట్ర పథకాలను కాఫీ కొడుతున్నది. రాష్ట్రంలో రాబోయేది మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వమే. సీఎం కేసీఆర్ నాయకత్వంలో అన్ని కులాలకు సముచిత స్థానం లభిస్తుంది. మహిళా రిజర్వేషన్లతో పాటు, బీసీ రిజర్వేషన్లను అమలు చేయాలి. ఇతర రాష్ట్రాలు తెలంగాణ రాష్ర్టాన్ని ఆదర్శంగా తీసుకుంటున్నాయి. ప్రపంచమంతా తెలంగాణ వైపు చూస్తున్నది. సీఎం కేసీఆర్ మరోసారి ముఖ్యమంత్రి అయ్యే వరకు కాలికి చెప్పులు లేకుండా మంత్రి సత్యవతి రాథోడ్ తిరుగుతున్నారు. మహేశ్వరం నియోజక వర్గానికి ఎనలేని సేవలను అందిస్తున్న మంత్రి సబితా ఇంద్రారెడ్డిని భారీ మెజార్టీతో ప్రజలు గెలిపించాలి.