Hyderabad | హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 2(నమస్తే తెలంగాణ): దేశంలోనే తొలిసారిగా హైదరాబాద్ కేంద్రంగా తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించిన ‘ఫార్ములా-ఈ రేసు’ నగర ఆర్థిక వ్యవస్థపై గణనీయమైన ప్రభావాన్ని చూపినట్టు నీల్సన్ స్పోర్ట్స్ అనాలసిస్ అధ్యయనంలో వెల్లడైంది. ఫార్ములా- ఈ రేసు నిర్వహణతో నగర ఆర్థిక వ్యవస్థ రూ.700 కోట్ల మేర పుంజుకున్నదని, దేశంలో మరే ఇతర మెట్రో నగరానికి దక్కని ఘనతను హైదరాబాద్ సాధించిందని నివేదిక పేర్కొన్నది. ఒక్క హైదరాబాద్ నగరంలోనే కాకుండా ఇతర ప్రాంతాల్లోనూ ఎంతో ప్రభావాన్ని చూపిందని స్పష్టంచేసింది.
ఈ ఏడాది ఫిబ్రవరి 11న హుస్సేన్‌సాగర్ తీరాన నిర్వహించిన ‘ఫార్ములా-ఈ’ పోటీల్లో పలు దేశాల నుంచి 11 టీమ్‌లు పాల్గొన్నాయి. సుమారు 31 వేల మంది ప్రేక్షకులు ఈ పోటీలను ప్రత్యక్షంగా వీక్షించారు. వీరిలో 59% మంది ఇతర ప్రాంతాల నుంచి తరలివచ్చారు. వీరితోపాటు 150 దేశాలకు చెందిన ప్రేక్షకులు ఆన్లైన్లో వీక్షించారు. అంతర్జాతీయంగా ప్రాముఖ్యత పొందిన ‘మోటర్స్ పోర్ట్ ఈవెంట్’తో హైదరాబాద్‌కు మరోసారి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు దక్కడమే కాకుండా నగర ఆర్థికాభివృద్ధిపై గణనీయ ప్రభావం చూపించాయి. ఈ నేపథ్యంలో 2024లో కూడా ఫార్ములా-ఈ రేసును అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించేందుకు తెలంగాణ ప్రభుత్వం, గ్రీన్కో సంస్థలు సన్నాహాలు చేస్తున్నాయి. ఈ సందర్భంగా ఈ ఫార్ములా కో ఫౌండర్ అల్బర్ట్లాంగ్ మాట్లాడుతూ.. 2024లో హైదరాబాద్‌లో నిర్వహించనున్న రెండో విడత ఈవెంట్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని పేర్కొన్నారు.