సిటీబ్యూరో: భూముల వేలంతోనే ఖజానా నింపుకోవాలని చూస్తున్న సర్కారు ఆశయాలకు అనుగుణంగా హెచ్ఎండీఏ అడుగులు వేస్తోంది. నగరంలో విలువైన భూములను అంగట్లో పెట్టి విక్రయించేందుకు సన్నాహాలు చేస్తోంది. ఇటీవల కోకాపేట భూముల వేలంతో ఏకంగా రూ. 3900 కోట్లను ఆర్జించి ఖజానాకు అందించగా… తాజాగా అదే తరహాలో 70 ఎకరాలను ఆర్థిక వనరులుగా మలిచేందుకు కసరత్తు చేస్తోంది. ఈ క్రమంలో బంజారాహిల్స్, కొండాపూర్, కోకాపేట నియోపోలిస్‌లో ఉన్న మొత్తం 70 ఎకరాల ల్యాండ్ పార్సిల్‌ను ఈ దఫా వేలానికి ఎంపిక చేసుకుంది.
దీని ద్వారా రూ. 7వేల కోట్లు లక్ష్యంగా పెట్టుకున్నట్లు సమాచారం. వీటితోపాటు ఇప్పటివరకు హెచ్ఎండీఏ చేసిన వెంచర్లలో మిగిలిన భూములను కూడా గంపగుత్తగా విక్రయించి సొమ్ము చేసుకోవాలని చూస్తోంది. మొత్తంగా భూముల వేలం ద్వారా రూ. 10వేల కోట్ల వరకు నింపుకొనే యోచనలో ఉన్నట్లుగా హెచ్ఎండీఏ వర్గాల్లో ఉన్నట్లుగా తెలిసింది. వేల కోట్ల ప్రాజెక్టులను సునాయాసంగా చేపట్టిన హెచ్ఎండీఏ ఇప్పుడు కేవలం భూముల వేలానికే పరిమితమవుతున్నది.