సిటీబ్యూరో, జూలై 20 (నమస్తే తెలంగాణ) : విశ్వనగరంగా విరాజిల్లుతున్న హైదరాబాద్‌లో ప్రజా రవాణా వ్యవస్థలో మెట్రో రైలు ప్రయాణికులకు మెరుగైన సేవలే అందిస్తుంది. కానీ పెరుగుతున్న రద్దీకి అనుగుణంగా మెట్రో సేవలు విస్తరించడంలో ప్రభుత్వం విఫలమైంది. దీంతోనే గడిచిన రెండేండ్లుగా భారీగా పెరిగిన రద్దీకి అనుగుణంగా జనాలకు నిలబడే చోటే లేకుండా పోయిందనే విమర్శలు వస్తున్నాయి. కానీ సర్కార్ మాత్రం కొత్త బోగీలను తీసుకువస్తామంటూ రెండేండ్లుగా ఊరిస్తూనే ఉంది. ముఖ్యంగా నాగోల్-రాయదుర్గం- మియాపూర్-ఎల్బీనగర్ కారిడార్లలో పీక్ అవర్స్‌లో మెట్రో రైలు ఎక్కడమే సాహసకృత్యంగా మారిందనే అభిప్రాయం మెట్రో ప్రయాణికుల్లో వ్యక్తమవుతున్నది.
ఈ తీవ్రమైన రద్దీకి చెక్ పెట్టే అదనపు బోగీల విషయంలోనే సర్కార్ వేస్తున్న మీనమేషాలు ప్రయాణికుల పాలిట శాపంగా మారుతోంది. ఈ క్రమంలో కొత్తగా మెట్రోలో బాధ్యతలు స్వీకరించిన ఓ అధికారి కొత్త బోగీలను తీసుకు వస్తామంటూ మరోసారి ఊరిస్తూ, ఇన్నాళ్లు వృథా చేసిన సమయాన్ని విస్మరిస్తున్నారు. రద్దీని తక్షణమే నియంత్రిస్తామని ప్రకటనలు గుప్పించిన ప్రభుత్వ యంత్రాంగమే ఆ అంశాన్ని మరుగనపడేలా చేసింది. కానీ అధికారులు మాత్రం ప్రతిపాదనలపై సమీక్షలు నిర్వహిస్తూ కాగితాల్లోనే అదనపు బోగీలను పరుగులు పెట్టిస్తున్నారే విమర్శలు వస్తున్నాయి.
రెండున్నరేండ్లుగా గడిచిన హైదరాబాద్ మెట్రోకు అదనపు బోగీలకు సంబంధించిన డీపీఆర్ సిద్ధం కాలేదు. కనీసం ఆ బోగీలను అందించే సంస్థలతో కూడా అధికారికంగా మెట్రో నిర్వహణ సంస్థ చర్చలు జరపలేదు. బోగీలకు ఆర్డర్లకు ఇచ్చే ప్రక్రియను నిర్మాణాత్మకమైన ప్రణాళికలే మెట్రో సంస్థ ఇప్పటివరకు చేయలేదంటేనే పరిస్థితి ఏ తీరుగా ఉందనేది స్పష్టం అవుతున్ని. కోచ్‌లను తీజుకు తీసుకువస్తామంటూ, డిజైన్లు మారుస్తున్నామంటూ ప్రతి సమావేశంలోనూ బోగీలపై చర్చలు జరిపి మెట్రో భవన్‌కే ప్రణాళికలను పరిమితం చేస్తున్నారు.
నరకం చూస్తున్న ప్రయాణికులు..
రద్దీ సమయాల్లో మెట్రో స్టేషన్ల ఫ్లాట్ఫారాలన్నీ జనాలతో నిండిపోతున్నాయి. ఇక వర్షాలు పడిన సందర్భంలోనైతే నిలబడే తావు కూడా మెట్రో స్టేషన్ ప్రాంగణాల్లో లేకుండా పోతున్నది. కానీ సర్కార్ మాత్రం వీటిని పట్టించుకోవడం లేదు. ఒక రైలు వచ్చిన అందులో నిలబడే చోటు లేక మరో ట్రైన్ కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి ఉంది. కనీసం అరగంట పాటు ఎదురుచూస్తే తప్ప.. గమ్యస్థానాలకు చేరుకునే వీల్లేకుండా పోయిందని వాపోతున్నారు. ముఖ్యంగా చంటి పిల్లలతో ప్రయాణించే మహిళలు, వయోవృద్ధులు, దివ్యాంగులు ఈ రద్దీలో పడుతున్న బాధలు వర్ణనాతీతమని, కిక్కిరిసిన 3 బోగీల్లో ప్రయాణమంటేనే భయంగా ఉందంటున్నారు.
ఇక మహిళ కోచ్‌ల్లోకి సహా జనరల్ బోగీలలో తోపులాటలు జరుగుతుండటంతో భద్రత కరువైందని ఆవేదన చెందుతున్నారు. ప్రయాణికుల నుంచి పెంచిన చార్జీల రూపంలో వసూలు చేస్తున్నా… కనీస సౌకర్యాలను కల్పించడంలో విఫలమవుతున్నారని, ఇప్పటికైనా కాలయాపన వీడి, చర్యలు చేపట్టాలని ప్రయాణికులు డిమాండ్ చేస్తున్నారు. లేదంటో ఎంతో మందికి చేరువ కావాల్సిన మెట్రో, రద్దీ జనాలతో ఆదరణ కోల్పోయే ప్రమాదం ఉందని, నూతన కోచ్‌లు వచ్చేంత వరకు పీక్ అవర్స్‌లో ఫ్రీక్వెన్సీ తగ్గించినా.. ప్రయాణికులకు తాత్కాలిక ఉపశమనం దొరుకుతుందంటున్నారు. నగర రవాణా వ్యవస్థను నిర్లక్ష్యం చేస్తూ నిత్యం లక్షలాది మంది ప్రయాణికులను పట్టించుకోవాలంటున్నారు.
ఆర్డర్ ఇచ్చినా.. రెండేండ్లు ఆగాల్సిందేనా?
మెట్రో కోచ్‌ల తయారీ విధానమే అత్యంత సంక్లిష్టమైన ప్రక్రియ. ముఖ్యంగా ప్రస్తుతం ఉన్న రైళ్లకు సరిపడే బోగీలు కూడా చాలా పరిమితంగా లభ్యం అవుతాయని తెలిసింది. వీటిని కొన్ని మ్యానుఫ్యాక్చరింగ్ సంస్థలు చేసే డిజైన్లు మాత్రమే ఇప్పుడున్న బోగీలకు సరిపోతాయి. ఇలాంటి సమయంలో మార్కెట్లో దొరికే అన్ని బోగీలతో అదనపు సేవలకు వీలు పడదు. కొత్త కోచ్‌ల డిజైన్ల ఖరారు, సాంకేతిక అనుమతులకు కనీసం 6 నెలల సమయం పడుతుంది. టెండర్లు పిలిచి, తయారీ సంస్థకు ఆర్డర్ ఇచ్చిన తర్వాత ఆ కోచ్‌లు తయారై, హైదరాబాద్‌కు చేరుకుని, పట్టాలెక్కించడం కంటే ముందు ట్రయల్ రన్ పూర్తి చేసుకునే సరికి కనీసం 12-18 నెలల పడుతుందని మెట్రో వర్గాలు చెబుతున్నాయి. అలాంటప్పుడు కొత్తగా వచ్చిన అధికారులు కూడా అదనపు మెట్రోలపై రాజకీయ నాయకుల తరహాలో వ్యాఖ్యలు చేస్తున్నారని నగరవాసులు మండిపడుతున్నారు.