సిటీబ్యూరో, జులై16 (నమస్తే తెలంగాణ): ‘ఒకే రోజు రెండు ఆర్టీఓ కార్యాలయాల్లో విధులు నిర్వర్తించడం చాలా కష్టంగా ఉంది. పొద్దున ఓ కార్యాలయం.. మధ్యాహ్నం మరో కార్యాలయం తిరగాల్సి వస్తుంది. నా వయసు రీత్యా అది సాధ్యం కావడం లేదు. దయచేసి నన్ను ఏదో ఒక కార్యాలయానికి కేటాయించండి.’ అంటూ ఓ అధికారి రెండు నెలల కిందట రవాణా శాఖ కమిషనర్‌కు ఓ లేఖ రాశారు. కానీ ఇప్పటికీ ఆ లేఖను కమిషనర్ పట్టించుకోకపోవడంతో ఆ అధికారి ప్రతీ రోజు రెండు కార్యాలయాలు తిరగాల్సిన దుస్థితి నెలకొంది. అంత కఠినంగా కమిషనర్ వ్యవహరిస్తుండంపై పలువురు అధికారుల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పనిభారంతో అనారోగ్యం పాలవుతున్న ఆ అధికారిని పట్టించుకోకపోవడం ఏంటని చర్చించుకుంటున్నారు.
ఇదిలా ఉండగా గ్రేటర్ ఆర్టీఏ కార్యాలయాల్లో ఇన్చార్జీల పాలనతోనే నెట్టుకొస్తున్నారు. పదోన్నతి లిస్టులో సీనియర్ ఎంవీఐలు ఉన్నప్పటికీ వారికి ఎలాంటి అవకాశం ఇవ్వకుండా ప్రభుత్వం చోద్యం చూస్తున్నది. ఇప్పటికే సీనియర్ ఎంవీఐలు తమకు పదోన్నతి కల్పించాలని ఉన్నతాధికారులకు, రవాణా శాఖ మంత్రికి విజ్ఞప్తులు చేశారు. నగరంలో సికింద్రాబాద్ ఆర్టీఏ కార్యాలయానికి ఎంవీఐ ఇన్చార్జీ ఆర్టీఓగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఉప్పల్ కార్యాలయానికి ఎంవీఐ అధికారి ఇన్‌చార్జీగా ఉన్నారు. మరోవైపు మలక్‌పేటకు మరో అధికారి అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఇలా అధికారులపై పనిభారం పెరుగుతుండటంతో వాహనదారులకు సకాలంలో సేవలు అందడంలోనూ జాప్యం ఏర్పడుతోంది.
ఆటోల కొనుగోలు కోసం ఆటో డ్రైవర్లు షోరూంల చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. ఇటీవల ప్రభుత్వం 65వేల ఆటో పర్మిట్లను విడుదల చేసింది. వీటిలో 20 వేల ఎలక్ట్రిక్ ఆటోలు, 10 వేల ఎల్పీజీ ఆటోలు, మరో 10వేల సీఎన్జీ ఆటో పర్మిట్లు ఉన్నాయి. ఇవి కాకుండా మరో 25 వేల ఎల్పీజీ, డీజిల్, పెట్రోల్ ఆటోలను రిట్రో ఫిట్మెంట్లు అమర్చుకొని ఎలక్ట్రిక్ ఆటోలుగా మార్చుకునేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. దీంతో కొత్తగా ఆటోలు కొనుగోలు చేయాలనుకున్న వారు నిబంధనల ప్రకారం షోరూం డీలర్ల వద్ద తమ దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. అయితే రోజుకు 100 దరఖాస్తులను మాత్రమే డీలర్లు తీసుకోవాల్సి ఉంటుందని ప్రభుత్వం నిబంధనలో ఉంది. దీంతో పాటు ఆటో లైసెన్స్, గతంలో ఆటో లేకుండా ఉండటం, ఓఆర్ఆర్ పరిధిలో చిరునామా కలిగిన వారికి మాత్రమే కొత్త ఆటో కొనుగోలుకు వీలవుతుంది. అయితే అర్హత ఉన్న చాలా మంది తమ దరఖాస్తులను దగ్గరలోని షోరూంల్లో సమర్పించినప్పటికీ సాంకేతిక సమస్యలతో తిరస్కరణకు గురవుతున్నాయి. రవి అనే ఆటో డ్రైవర్ తన ఆటోను గతంలో విక్రయించాడు. ఇప్పుడు అతడు మళ్లీ కొత్త ఆటో కొనుగోలుకు దరఖాస్తు చేసుకోగా ఇప్పటికీ తన పేరు మీద ఆటో ఉందని ఆర్టీఏ సర్వర్‌లో వివరాలు వెల్లడవుతున్నాయి. దీంతో ఆ డ్రైవర్ ఆందోళన చెంది సంబంధిత అధికారుల వద్ద గోడు వెల్లబోసుకున్నాడు. నగరంలో ఒక్కో షోరూం వద్ద వందలాది దరఖాస్తులు పేరుకుపోతున్నాయి. వాటిని ఆర్టీఏ అధికారులు పరిశీలించి అన్ని అర్హతలు ఉన్నవారిని ఎంపిక చేసి షోరూం డీలర్లకు పంపించాల్సి ఉంటుంది. అనంతరం షోరూం వాళ్లు వారికి ఆటోలను విక్రయిస్తారు. కానీ ఈ ప్రక్రియ చేపట్టడంలో ఆర్టీఏ అధికారులకు సాంకేతిక సమస్యలు ఎదురవుతున్నాయి. ఫస్ట్ కమ్ ఫస్ట్ అనే నిబంధన కూడా సాంకేతిక సమస్యతో సాధ్యం కాదని అధికారులు చెబుతున్నారు. ఈ సమస్యలన్నింటీపై సంబంధిత ఆర్టీఓలు శుక్ర, శని వారాల్లో ఉన్నతాధికారులను కలిసి వివరించనున్నారు.
ఉప్పల్ కార్యాలయంలో డ్రైవింగ్ టెస్ట్‌కు సంబంధించిన సారథి సేవలు అందుతాయని ఉన్నతాధికారులు తెలిపారు. సికింద్రాబాద్ సారథికి సంబంధించి డ్రైవింగ్ టెస్ట్ కోసం వచ్చే వాహనదారులు తమతమ స్లాట్ రోజున సారథి సేవలను ఉపయోగించుకోవచ్చని పేర్కొన్నారు. ‘ఏసీబీ చేతికి ఆర్టీఏ స్లాట్స్’ శీర్షికన నమస్తే తెలంగాణ బుధవారం కథనం ప్రచురించింది. సారథి పోర్టల్‌లో లాగిన్ అవ్వాలంటే ఓటీపీలు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అవి ఇటీవల ఏసీబీ సోదాలు జరగడం కారణంగా ఫోన్లను స్వాధీనం చేసుకోవడంతో ఓటీపీలు ఏసీబీ వారికి వెళుతున్నాయని కథనం ప్రచురించిన విషయం తెలిసిందే. దీనిపై రవాణా శాఖ ఉన్నతాధికారులు స్పందించారు. ఓటీపీలు మరో నంబర్‌కు వచ్చేలా ఏర్పాట్లు చేశామని.. సాంకేతిక సమస్యను పరిష్కరించినట్టు వివరించారు. వాహనదారులకు ఏదైనా సమస్య తలెత్తితో కార్యాలయంలోని హెల్ప్ డెస్క్‌ను సంప్రదించొచ్చని పేర్కొన్నారు. డ్రైవింగ్ టెస్ట్ కోసం తిరుమలగిరి ఆర్టీఓ పరిధిలోని వాళ్లు ఉప్పల్ కార్యాలయాన్ని ఎంపిక చేసుకుని ఉంటే మరో కార్యాలయానికి మార్పు చేసుకోవాల్సిన అవసరం లేదని తెలిపారు.