కేపీహెచ్‌బీ కాలనీ, ఆగస్టు 27: విశ్వ విద్యాలయాలలో బోధిస్తున్న కాంట్రాక్ట్ అధ్యాపకులకు యూజీసీ పే స్కేల్ (బేసిక్ పే, డీఏ, హెచ్ఆర్తో కూడిన)ను వెంటనే అమలు చేయాలని జేఎన్టీయూహెచ్ వర్సిటీ కాంట్రాక్ట్ అధ్యాపకుల సంఘం నేతలు డిమాండ్ చేశారు. యూనివర్సిటీలో కాంట్రాక్ట్ అధ్యాపకుల సంఘం ఆధ్వర్యంలో యూనివర్సిటీ అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి యూనివర్సిటీలలో వీసీలను నియమిస్తామని, పలు యూనివర్సిటీలలో అనేక సంవత్సరాలుగా ఖాళీగా ఉన్న అధ్యాపక, అధ్యాపకేతర పోస్టులను భర్తీ చేస్తామని ప్రకటించడం సంతోషకరమన్నారు. కానీ, యూనివర్సిటీలలో ఏండ్ల తరబడి కాంట్రాక్ట్ అధ్యాపకుల సమస్యలను ప్రస్తావించకపోవడం బాధాకరమన్నారు. గత పాలకులు యూనివర్సిటీలను నిర్వీర్యం చేశారని ప్రకటించిన సీఎం, ప్రజా పాలనలో సమస్యలను వెంటనే పరిష్కరిస్తామని చెప్పారన్నారు.
కానీ, యూనివర్సిటీలలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అధ్యాపకులకు యూజీసీ పే స్కేల్‌ను అమలు చేయాలని కోరితే, ఇప్పటి వరకు స్పందించలేదన్నారు. విశ్వవిద్యాలయాలలో బోధనతో పాటు విభాగ అధిపతులుగా, హాస్టల్ వార్డెన్‌గా, ప్లేస్మెంట్ అధికారులుగా, ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్ పోగ్రాం ఆఫీసర్లుగా, కళాశాల ప్రిన్సిపాళ్లుగా పలు బాధ్యతలను సమర్ధవంతంగా నిర్వర్తిస్తున్న వారికి వెంటేనే న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
యూనివర్సిటీలలో కాంట్రాక్ట్ అధ్యాపకులు చాలీచాలని జీతాలతో పనిచేస్తున్నారని, ఉమ్మడి రాష్ట్రం నుంచి పనిచేస్తున్నా, నేటికీ సమస్యలకు పరిష్కారం కాలేదన్నారు. కాంట్రాక్ట్ అధ్యాపకులను గత ప్రభుత్వం రెగ్యూలరైజేషన్ చేస్తామని నమ్మించి మోసం చేసిందని, సీఎం రేవంత్‌రెడ్డి నాయకత్వంలోని ప్రభుత్వం న్యాయం చేస్తుందని భావిస్తున్నట్లు తెలిపారు. కాంట్రాక్ట్ అధ్యాపకులకు యూజీసీ పే స్కేల్‌ను అమలు చేసి, ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు. కాంట్రాక్ట్ అధ్యాపకులను రెగ్యూలరైజ్ చేసిన తర్వాత మిగిలిన పోస్టులను భర్తీ చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. కార్యక్రమంలో పలువురు వర్సిటీ కాంట్రాక్ట్ అధ్యాపకులు సురేశ్ నాయక్, శివారెడ్డి, వంశీకృష్ణారెడ్డి, శివకుమార్, దశరథం, నవీన్‌కుమార్, మాథ్యూస్, సిద్ధార్థ్ పాల్లొన్నారు.