హయత్‌నగర్ : ప్రభుత్వం ముంపు బాధితులకు ( Flood Victims ) తక్షణ సాయం, భోజన వసతిని కల్పించాలని ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి (MLA Devireddy Sudheer Reddy ) డిమాండ్ చేశారు. సోమవారం హయత్‌నగర్ డివిజన్లో ముంపునకు గురైన బంజారాకాలనీలో ఎల్బీనగర్ జోనల్ కమిషనర్ హేమంత్ కేశవ్ పాటిల్, హయత్‌నగర్ డివిజన్ కార్పొరేటర్ కళ్లెం నవజీవన్‌రెడ్డి, మాజీ కార్పొరేటర్ సామ తిరుమలరెడ్డి, వివిధ శాఖల అధికారులతో కలిసి ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి పర్యటించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని విభాగాల అధికారులను సమన్వయ పరుచుకుంటూ బాధితులకు తక్షణ సాయం కింద రూ.20 వేలు చెల్లించాలని, వారికి భోజన సౌకర్యం కల్పించాలని కోరారు. ఇంజాపూర్ నుంచి వచ్చే వరదనీటి ప్రవాహం వల్లే బంజారాబస్తీ మునిగిపోయిందన్నారు. నూతన ట్రంక్‌లైన్ అతి త్వరలోనే ప్రారంభమవుతుందని, పనులు సకాలంలో పూర్తయితే ఎలాంటి ఇబ్బందులు ఉండబోవని స్పష్టంచేశారు.
ముంపు బాధితులకు తనవంతు సహాయసహకారాలు అందిస్తానని, ఎవరూ అధైర్యపడవద్దని భరోసానిచ్చారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ డివిజన్ మాజీ అధ్యక్షుడు గుడాల మల్లేష్ ముదిరాజ్, సీనియర్ నాయకులు భాస్కర్ సాగర్, గంగని నాగేష్ తదితరులు పాల్గొన్నారు.