సిటీబ్యూరో, జూన్ 1(నమస్తే తెలంగాణ): నేరస్తుల అక్రమాయుధాలు పొందేందుకు భిన్నరూట్లను ఎంచుకుంటున్నారు. దోపిడీలు, బెదిరింపులు, కిడ్నాప్, హత్యలు, సెటిల్మెంట్లు.. రౌడీయిజం చేయాలంటే చేతిలో ఒక గన్ ఉంటే.. ఈజీగా అవతలి వాళ్లను భయపెట్టించి తమ పని పూర్తి చేసుకోవచ్చనే భావనతో నేరస్తులు కంట్రీమేడ్ పిస్టోల్స్‌ను వాడుతుంటారు. దీనిని ఆసరాగా చేసుకుంటున్న యూపీ, బీహార్ ప్రాంతాలకు చెందిన వారు తమ ప్రాంతంలో తయారైన కంట్రీమేడ్ పిస్టోల్స్ అక్కడ తక్కువ ధరకు కొని, హైదరాబాద్‌లో విక్రయిస్తున్నారు. ఇలాంటి వారిని నేరస్తులు సంప్రదిస్తూ అక్రమంగా గన్స్ కొంటున్నారని సమాచారం.
యూపీ, బీహార్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ తదితర ఉత్తరాదీ రాష్ర్టాల నుంచి వివిధ పనుల నిమిత్తం హైదరాబాద్‌కు వచ్చిన వాళ్లు, ఇక్కడ అక్రమ గన్స్కు ఉన్న మార్కెట్‌ను అంచనా వేస్తూ, అవసరాన్ని బట్టి గన్స్‌ను తెస్తున్నట్లు తెలుస్తున్నది. ఇటీవల రాచకొండ కమిషనరేట్‌లోని బాలాపూర్ ఠాణా పరిధిలో నివాసముంటున్న ఉత్తరప్రదేశ్, రాంపుర్ సిటీకి చెందిన మహ్మద్ జీషాన్ అలియాస్ జీఖాన్, మహ్మద్ అమీర్లను మహేశ్వరం ఎస్ఓటీ పోలీసులు అరెస్ట్ చేసి, వారి వద్ద నుంచి ఐదు కంట్రీమేడ్ తుపాకులను స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ తుపాకులు ఎవరికి ఇవ్వాలనుకున్నారు.. ఎక్కడి నుంచి తెచ్చారు.. వీళ్ల నెట్వర్క్ ఏంటీ అనేది ఇప్పుడు ప్రశ్నార్ధకంగా మారింది.
రౌడీషీటర్లు, రియల్ ఎస్టేట్ సెటిల్మెంట్లు, దోపిడీ దొంగతనాలు, కిడ్నాప్‌లు చేసే నేరస్తులు అక్రమ పద్ధతిలో ఆయుధాలను సమకూర్చుకుంటున్న ఘటనలున్నాయి. వివిధ ప్రాంతాల నుంచి గన్స్ తెచ్చి ఇక్కడ విక్రయించాలనుకునే వారికి ఆయా ముఠాలతో ఏదో విధంగా లింక్లుండే అవకాశాలున్నాయి. ఈ నేపథ్యంలోనే గన్స్‌కి గిరాకీ ఉందని తెలుసుకుంటూ యూపీ, బీహార్ నుంచి అక్రమ మార్గంలో హైదరాబాద్‌కు గన్స్‌ను తెస్తున్నారు. రోడ్డు మార్గంలో రైళ్లు, బస్సుల్లో అంతగా తనిఖీలు ఉండకపోవడంతో ఈజీగా ఆయుధాలు యూపీ, బీహార్ నుంచి హైదరాబాద్‌కు తెస్తున్నారు. ఇలా అక్రమాయుధాలు తెచ్చిన వారు వాటిని కొన్నాళ్లపాటు దాచిపెట్టి తమ నెట్వర్క్ ద్వారా నేరస్తులకు విక్రయించే అవకాశాలున్నాయి.
అయితే పోలీసులకు దొరుకుతున్న వాళ్లు మాత్రం మొదటి సారి గన్స్ విక్రయానికి ప్రయత్నిస్తూ పట్టుబడుతున్నారని తెలుస్తున్నది. ఈ అక్రమ వ్యాపారంలో అనుభవం ఉన్న వాళ్లు పోలీసులకు దొరకకుండా జాగ్రత్త పడే అవకాశాలున్నాయి. దీనిపై మరింత పటిష్ట నిఘా ఉండాల్సిన అవసరం ఉన్నది. పట్టుబడుతున్న ముఠాలు ఎవరికి విక్రయించారు.. ఎవరికి విక్రయించాలనుకున్నారనే విషయాలు లోతుగా ఆరా తీయాల్సిన అవసరం ఉన్నది. అక్రమ ఆయుధాలు సంఘ విద్రోహ శక్తుల చేతికి అందకుండా అడ్డుకుంటూ పోలీసులు నేరగాళ్లను పట్టుకుంటున్నా, వారి వెనుకాముందు ఎవరున్నారనే విషయాలపై లోతైన దర్యాప్తు జరిపితే మరిన్ని లింక్‌లు బయటపడే అవకాశాలున్నాయి.
ఉత్తరప్రదేశ్, రాంపుర్ సిటీకి చెందిన మహ్మద్ జీషాన్ అలియాస్ జీఖాన్, మహ్మద్ అమీర్ బాలాపూర్‌తోపాటు సంతోష్‌నగర్, గోల్కొండ ప్రాంతంలో హెయిర్ సెలూన్ నిర్వహిస్తూ చాలా మందితో పరిచయాలు పెంచుకున్నారు. విలాసవంతమైన జీవితానికి అలవాటుపడి గన్స్‌ను విక్రయించాలని ప్లాన్ చేశారు. ఇందులో భాగంగా తమ స్వస్థలం నుంచి ఐదు కంట్రీమేడ్ పిస్టోల్స్‌ను హైదరాబాద్‌కు తెచ్చి విక్రయించాలనే ప్రయత్నంలో గత గురువారం మహేశ్వరం ఎస్ఓటీ పోలీసులకు పట్టుబడ్డారు. నిందితులకు ఎవరితో పరిచయాలు ఉన్నాయి.. ఎవరికి విక్రయించాలనుకున్నారనే విషయాన్ని పోలీసులు తేల్చాల్సి ఉన్నది.
ఎస్ఓటీ పోలీసులు ఛేదించిన కేసులను పూర్తి స్థాయిలో లా అండ్ ఆర్డర్ పోలీసులు విచారణ చేయరనే విమర్శలున్నాయి. ఇప్పుడు అక్రమ గన్స్ కేసును ఎస్ఓటీ పోలీసుల సహకారంతో బాలాపూర్ పోలీసులు పట్టుకున్నారు. ఇది అంత వరకే ఉంటుందా? ఈ కేసులో మరిన్ని అరెస్ట్లుంటాయా? అనేది వేచి చూడాల్సిందే. అలాగే ఈ ఏడాది జనవరిలో జవహర్‌నగర్ పోలీసులు, మల్కాజిగిరి ఎస్ఓటీ పోలీసులు సంయుక్తంగా ఆయుధాలను విక్రయించేందుకు ప్రయత్నిస్తున్న ఉత్తరప్రదేశ్‌కు చెందిన హరేకృష్ణయాదవ్ను అరెస్ట్ చేసి మూడు కంట్రీ మేడ్ పిస్టోల్స్, 10 బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నారు.