చెరువులు.. కుంటలు.. కబ్జాకు కావేవీ అనర్హం..అన్నట్లుగా సాగుతున్నది రంగారెడ్డి జిల్లాలో ఆక్రమణల పర్వం. కొందరు చెరపట్టి నీటి వనరులను మాయం చేస్తున్నా రు. హైదరాబాద్-సాగర్ ప్రధాన రహదారిని ఆనుకుని ఉన్న మాసబ్ చెరువు సైతం ఆక్రమణల్లో చిక్కుకుని విలవిల్లాడుతున్నది. రియల్టర్ల కన్ను ఈ చెరువుపై పడటంతో దీని విస్తీర్ణం క్రమక్రమంగా హారతి కర్పూరంలా కరిగిపోతున్నది. చెరువు పరి రక్షణ సమితి పేరిట స్థానికులు పోరాటం చేస్తున్నా..ఆక్రమణల తంతుకు మాత్రం అడ్డుకట్ట పడటం లేదు.
– రంగారెడ్డి, సెప్టెంబర్ 14 (నమస్తే తెలంగాణ)
తుర్కయాంజాల్ మున్సిపాలిటీ పరిధి మాసబ్ చెరువు స్థలంలో జరుగుతున్న అక్రమ నిర్మాణాలతో చెరువు ఉనికే ప్రశ్నార్థకంగా మారింది. మాసబ్ చెరువు 490 ఎకరాల్లో విస్తరించి ఉన్నది. ఇందులో కొంతమేర పట్టా భూములుండగా.. అవి ఎఫ్టీఎల్, బఫర్ జోన్ పరిధిలోనే ఉన్నా యి. భూముల ధరలు పెరగడంతో చాలామంది రైతులు తమ భూములను అమ్ముకున్నారు.
ఇదే అదనుగా రియల్టర్ల కన్ను ఈ చెరువుపై పడింది. ఇష్టానుసారంగా వెంచర్లు చేసి ప్లాట్లను విక్రయించారు. చెరువు చుట్టూ ఉన్న తుర్కయాంజాల్, ఇంజాపూర్, గుర్రంగూడ, ఆదిత్యనగర్, ఏవీనగర్ వాసులు ప్లాట్లను కొనుగోలు చేసి చెరువు ప్రాంతాన్ని మట్టి పోసి పూడ్చివేస్తున్నారు. ఈ క్రమంలో ఎఫ్టీఎల్, బఫర్ జోన్ పరిధిలోనూ పెద్ద పెద్ద భవనాలు వెలిశాయి. ఒకప్పుడు మాసబ్ చెరువు 30 గ్రామాలకు సాగునీటిని అందించేందని స్థానికులు చెబుతున్నారు.
మాసబ్ చెరువును ఆక్రమణల చెర నుంచి విముక్తి కల్పించాలని ఈ ప్రాంతవాసులు ఫిర్యాదులు చేస్తున్నా.. అధికారులు పట్టించుకోవడం లేదు. గతంలో సర్వేనం. 205లో సుమారు 5 ఎకరాల భూమిని కబ్జా చేసేందుకు కొందరు యత్నించారు. 60 ఫీట్ల మేర రోడ్డునూ నిర్మించారు. స్థానికులు అడ్డుకోవడంతో ఆ ప్రక్రియ ఆగిపోయింది. పోలీసులకు ఫిర్యాదు చేశామని చెప్పి.. అధికారులు చేతులు దులుపుకొన్నారు. ఆ తర్వాత కూడా చెరువు భూముల్లో ఆక్రమణలు కొనసాగుతున్నా..నిర్లక్ష్యం చేస్తున్నారు. ఫేక్ ఎన్వోసీలతో అక్రమంగా అనుమతులు పొంది నిర్మాణాలు చేపడుతున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నా..అధికారులు చర్యలు తీసుకున్న సందర్భాలు లేవు.
గత బీఆర్ఎస్ ప్రభుత్వం మాసబ్ చెరువును ఆధునీకరించేందుకు చర్యలు చేపట్టింది. రూ. 2 కోట్లతో హెచ్ఎండీఏ అధికారులు సుందరీకరించి.. అన్ని రకాలుగా అభివృద్ధి చేశారు. చెరువుకట్టపై పూల మొక్కలను ఏర్పాటు చేసి అందంగా తీర్చిదిద్దారు. వాకింగ్ ట్రాక్నూ ఏర్పాటు చేశారు. దీంతో చెరువు అందాలను ఆస్వాదించేందుకు పిల్లలు మొదలుకుని వృద్ధుల వరకు అందరూ సందర్శిస్తున్నారు.
అయితే చెరువు ఎగువన ఉన్న బడంగ్పేటతో పాటు ఇతర ఆవాసాల నుంచి వచ్చే మురుగు నీరంతా చెరువులోకే వెళ్తుండటంతో నీరంతా దుర్గంధంగా మారుతున్నది. పరిసరాలు కంపు కొడుతుండటంతో చెరువు సందర్శనకు వచ్చేవారు ఇబ్బంది పడుతున్నారు. స్వచ్ఛతకు మారుపేరుగా ఉన్న చెరువు నేడు దుర్గంధంగా మారడం.. స్థానికులను సైతం కలిచి వేస్తున్నది.
ప్రస్తుతం హైదరాబాద్లో హైడ్రా చెరువుల ఆక్రమణలపై ఉక్కుపాదం మోపుతున్నది. ఈ నేపథ్యంలో ఎఫ్టీఎల్ పరిధిలో వెంచర్లు చేసిన వ్యాపారులతోపాటు ప్లాట్లు కొని నిర్మాణాలు చేపట్టిన వారి గుండెల్లోనూ గుబులు మొదలైంది. ఇదే తరహాలో మాసబ్ చెరువుపై హైడ్రా దృష్టి సారించి.. చెరువుకు సంబంధించిన భూముల్లో ఆక్రమణలను గుర్తించి, అక్రమార్కులపై కొరడా ఝుళిపించాలని పలువురు కోరుతున్నారు. ఇప్పటికే స్థానికుల నుంచి పెద్ద ఎత్తున హైడ్రాకు ఫిర్యాదులు అందినట్లు సమాచారం.