దుండిగల్, నవంబర్ 23 : వివాదాస్పద పార్కు స్థలంలో నిర్మించిన ప్రహరి నిర్మాణాలను జీహెచ్ఎంసీ అధికారులు కూల్చివేసిన గంటల వ్యవధిలోనే అక్రమార్కులు మందీమార్బలంతో మళ్లీ ఫెన్సింగ్ వేశారు. అడ్డుకోబోయిన సంక్షేమ సంఘం ప్రతినిధులపై సిబ్బందితో కలిసి దాడికి యత్నించడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. స్థానికుల కథనం ప్రకారం.. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, గాజులరామారం సర్కిల్, సూరారం డివిజన్ పరిధిలోని సర్వే నంబర్ 105లో ఉన్న సిద్ధివినాయకనగర్‌లో 1080 గజాల పార్కు స్థలం ఉన్నది. బాలానగర్-నర్సాపూర్ ప్రధాన రహదారికి అతి సమీపంలో ఉండటంతో రూ.6 నుంచి 8 కోట్ల వరకు దీని ధర పలుకుతుంది.
దీంతో ఈ స్థలాన్ని ఎలాగైనా కాజేయాలని పక్కనే ఉన్న ప్రైవేట్ టాన్స్‌ఫోర్ట్ సంస్థ ముమ్ముర ప్రయత్నం చేస్తున్నది. పార్కుస్థలంలో తమకు చెందిన బస్సులు, ఇతర వాహనాలను నిలుపుతూ చుట్టూ ప్రహరీని, రెండు గదులను నిర్మించింది. అయితే సదరు స్థలం తమ సిద్ధివినాయకనగర్ కాలనీకి చెందిన పార్కు స్థలమంటూ అసోసియేషన్ ప్రతినిధులు గతకొన్నేండ్లుగా సదరు ట్రాన్స్పోర్ట్ యాజమాన్యంతో న్యాయపోరాటం చేస్తున్నారు. ఇటీవల సిద్ధివినాయకనగర్ ఓనర్స్ అసోసియేషన్‌కు అనుకూలంగా కోర్టు తీర్పు వెలువరించింది.
దీంతో అసోసియేషన్ ప్రతినిధులు కోర్టు ఆర్డర్ ప్రతులను గాజులరామారం సర్కిల్ అధికారులకు అందజేసి చర్యలు తీసుకోవాలని కోరింది. దీంతో శనివారం ఉదయం గాజులరామారం సర్కిల్ టౌన్‌ప్లానింగ్ అధికారులు పార్కు స్థలం చుట్టూ నిర్మించిన ప్రహరీతోపాటు లోపల నిర్మించిన రెండు గదులను నేల మట్టం చేశారు. అయితే ఇది ఎంతమాత్రం జీర్ణించుకోలేని ట్రాన్స్పోర్ట్ సంస్థ యజమానులు జితేంద్ర, యుగేంద్ర తమ సిబ్బందితో కలిసి సదరు పార్కుస్థలం చుట్టూ కర్రలతో ఫెన్సింగ్ వేస్తుండటంతో కాలనీ అసోసియేషన్ ప్రతినిధులు అడ్డుకున్నారు.
దీంతో కాలనీ అసోసియేషన్ ప్రతినిధులపై వారు తమ సిబ్బందితో దౌర్జన్యానికి దిగడంతోపాటు దాడికి యత్నించడంతో అసోసియేషన్ ప్రతినిధులు సూరారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. పార్కు స్థలాన్ని కాపాడటంతోపాటు తమపై దాడికి యత్నించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇదే విషయమై సీఐ భరత్‌కుమార్‌ను వివరణ కోరగా.. సిద్ధివినాయకనగర్ ఓనర్స్ అసోసియేషన్ ప్రతినిధులు జరిగిన ఘటనపై ఫిర్యాదు చేశారని వివరణ ఇచ్చారు.