వికారాబాద్, డిసెంబర్ 26, (నమస్తే తెలంగాణ): వికారాబాద్ జిల్లాలో ఇసుక మాఫియా రెచ్చిపోతున్నది. ప్రధానమైన కాగ్నాను ఇసుక మాఫియా అక్రమంగా ఇసుకను తోడేస్తున్నది. రాత్రికి రాత్రే ఇసుక డంపులను మాయం చేస్తున్నారు. ప్రధానంగా ఇసుక లభ్యమయ్యే యాలాల, తాండూరు, బషీరాబాద్ మండలాల్లోనే అక్రమంగా ఇసుకను తరలిస్తున్నారు. ఒక్క యాలాల మండలంలోనే లక్షల క్యూబిక్ మీటర్లలో కాగ్నా నుంచి ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారు. ఖంజాపూర్, పాత తాండూరు ప్రాంతాల నుంచి పగలు,రాత్రి తేడా లేకుండా అక్రమంగా ఇసుక రవాణాకు పాల్పడుతున్నా.. అధికారులు పట్టించుకోకపోవడం గమనార్హం. అంతేకాకుండా ఏకంగా పోలీసులే ఈ అక్రమ ఇసుక రవాణాకు దగ్గరుండి చూసుకుంటున్నారనే ఆరోపణలు వస్తున్నాయి.
యాలాల, తాండూరు, బషీరాబాద్ మండలంలోని కాగ్నా పరివాహక ప్రాంతంతో పాటు శివసాగర్‌లో అధిక మొత్తంలో ఇసుక వనరులు ఉన్నాయి. సంబంధిత ప్రాంతాల నుంచి ప్రతీ ఏటా రూ. కోట్ల విలువైన ఇసుక లభ్యమవుతున్నది. అదేవిధంగా జిల్లాలోని కొడంగల్, బొంరాసుపేట్ మండలాల్లో ఫిల్టర్ ఇసుక అక్రమ వ్యాపారం కూడా జోరుగా జరుగుతున్నా.. మైనింగ్, రెవెన్యూ, పోలీస్ అధికారులు నెలనెలా మామూళ్లు తీసుకుంటూ..పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. అదేవిధంగా బషీరాబాద్ మండలం కాగ్నా పరివాహాక ప్రాంతంలోని మంతటి, రెడ్డి ఘనాపూర్, ఎక్మయి, మైల్వార్ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున అక్రమంగా ఇసుక రవాణా జరుగుతున్నది.
అయితే ప్రభుత్వ నిబంధనల మేర ఉదయం నుంచి 6 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు ఇసుక తరలించేందుకు అనుమతులు పొంది, నిబంధనలకు విరుద్ధంగా ఇసుక దందాకు పాల్పడుతున్నారు. రాత్రి వేళ్లలో యథేచ్ఛగా అక్రమంగా ఇసుకను తరలిస్తూ ప్రభుత్వ ఆదాయానికి గండికొడుతున్నారు. అయితే డబ్బులకు కక్కుర్తి పడి సంబంధిత అధికారులు ఇసుక మాఫియాకు అండగా ఉంటూ, ఇసుకను తరలించడంలో ఎలాంటి అడ్డంకులు లేకుండా చేస్తున్నట్లు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఆరోపిస్తున్నారు. అయితే ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాల పేరిట గుట్టుచప్పుడు కాకుండా ఇసుకను తరలిస్తూ అక్రమంగా సంపాదిస్తున్నారు. తాండూరు ఎమ్మెల్యే అనుచరుల అండతోనే ఇసుక మాఫియా అక్రమంగా ఇసుకను తరలిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.