సిటీబ్యూరో, సెప్టెంబరు 11 (నమస్తే తెలంగాణ) : గ్రేటర్ హైదరాబాద్‌లో ప్రభుత్వ ఆస్తులు అక్రమ ప్రకటనలకు అడ్డాగా మారాయి. బస్టాపులు, జంక్షన్లు , మెట్రో, ఇతర ఖాళీ స్థలాల్లో హోర్డింగ్‌లు ఏర్పాటు చేసుకుని అక్రమార్కులు దందా చేస్తున్నారు. ఈ చీకటి వ్యాపారంలోకి ప్రముఖ యాడ్ ఏజెన్సీలే కాక తాజాగా బల్దియా పెద్ద రంగ ప్రవేశం చేశారు..అధికార హోదాలో అడ్డదార్లు తొక్కుతూ బినామీ ముసుగులో అక్రమంగా హోర్డింగ్‌లు ఏర్పాటు చేశారు. హైటెక్ సిటీ సాక్షిగా ఈ అక్రమ హోర్డింగ్ దందా చేస్తున్నారు. సైబర్ సిటీ ఎదురుగా ఉన్న ఫ్లై ఓవర్, బయో డైవర్సిటీ వద్ద ఫ్లై ఓవర్‌ను అడ్డాగా చేసుకుని అనధికారిక హోర్డింగ్‌లు ఏర్పాటు చేశారు.
సదరు బల్దియా పెద్ద తమకున్న అధికారాలను విచ్చలవిడిగా వినియోగిస్తూ బినామీ వ్యక్తులతో నెలకు రూ.లక్షలాది రూపాయలు ఖజానాకు గండి కొడుతుండడం గమనార్హం. ఈ రెండు చోట్ల హోర్డింగ్‌లకు సంబంధించి ఎలాంటి ఆన్లైన్ విధానం లేకుండా క్యాష్ అండ్ క్యారీ విధానంలో విచ్చలవిడిగా ప్రకటనల దందా జరుగుతున్నది. ఈ కోవలోనే మరిన్ని చోట్ల మంత్రుల తాలుకా కొన్ని , ప్రముఖ ఏజెన్సీలు కలిసి మరీ ఫ్లై ఓవర్లను విచ్చలవిడిగా పంచుకుంటూ బల్దియా ఖజానాకు భారీగా కుచ్చుటోపి పెడుతుండడం గమనార్హం.
మొత్తంగా ఆదర్శవంతంగా ఉండాల్సిన బల్దియా పెద్ద..మరో ఐదు నెలల్లో పదవీ కాలం ముగుస్తున్న తరుణంలో దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలన్న చందంగా అక్రమాలకు పాల్పడుతుండడంపై ఉద్యోగుల్లో తీవ్ర చర్చ జరుగుతున్నది. కాగా ప్రతి సంవత్సరం జీహెచ్ఎంసీకి ప్రకటన రుసుం రూపంలో కోట్లాది రూపాయల ఆదాయం కోల్పోతున్నది. వాస్తవానికి హోర్డింగ్ ప్రచారానికి సంబంధించి ఏటా రూ.500కోట్లకు పైనే ఆదాయం రావాల్సిన చోట కేవలం రూ.40కోట్లు మించకపోవడం విశేషం. బహిరంగ ప్రదేశాల్లో అక్రమ హోర్డింగ్‌లు వెలుస్తున్న అటు హైడ్రా, ఇటు జీహెచ్ఎంసీ చర్యలు తీసుకోకపోవడంపై తీవ్ర విమర్శలు వెలువెత్తుతున్నాయి.
జీహెచ్ఎంసీ ప్రకటన విభాగంలో అధికారుల నిర్లక్ష్యం, అవినీతి అక్రమాలు ఏ స్థాయిలో జరుగుతున్నాయో అర్థమవుతుంది. గ్రేటర్ హైదరాబాద్‌లో ఎన్ని హోర్డింగులకు అనుమతులున్నాయో, వాటికి ఎంత గడువుందో తెలియదు. అక్రమంగా ఏర్పాటైన హోర్డింగులెన్నో..వాటి ద్వారా జీహెచ్ఎంసీ ఖజానాకు జరుగుతున్న నష్టానికి లెక్కేలేదు, యూనిపోల్స్, లాలీపాప్స్, హోర్డింగు ఇలా అనేక ఉన్న ప్రాంతాలు అధికారుల రికార్డులు లెక్కలకు , క్షేత్రస్థాయిలో ఉన్న వాటికి ఎక్కడ పొంతన ఉండడం లేదన్నది ఇటీవల వస్తున్న బలమైన ఆరోపణలు.
ఈ క్రమంలోనే ప్రకటన విభాగంలో భారీగా అవినీతి జరుగుతుందని , జీహెచ్ఎంసీకి రావాల్సిన అడ్వర్టయిజ్మెంట్ ట్యాక్స్ రూ. 500 కోట్లను కొందరు అధికారులు పక్కదారి పట్టిస్తున్నారని, అక్రమ హోర్డింగ్స్లు, మాల్స్‌లో డిజిటల్ బోర్డులు ఏర్పాటు చేసిన వారు ‘కార్తీక్’ ట్యాక్స్ చెల్లిస్తున్నారని కౌన్సిల్ వేదికగా కార్పొరేటర్లు నిలదీశారు..దీనిపై స్పందించిన మేయర్ అన్ని పార్టీల కార్పొరేటర్లతో కలిసి ప్రత్యేకంగా హౌస్ కమిటీ వేశారు. కొన్ని రోజులు హడావుడి చేసిన మేయర్..ప్రస్తుత కమిటీ ఉనికి ప్రశ్నార్థకం చేశారు.
వాణిజ్య ప్రకటనల కోసం ఏర్పాటు చేసే బోర్డులు 15ఫీట్లకు తగ్గకుండా ఉండాలి. కానీ ఇబ్బడిముబ్బడిగా ప్రకటనల బోర్డులు దర్శనమిస్తున్నాయి. లెక్కపత్రం లేని హోర్డింగ్‌ల నుంచి హోర్డింగ్స్ ఫ్రీ సిటీగా మార్చడమే లక్ష్యంగా కార్యాచరణ ప్రణాళికలతో ముందుకు వెళ్లాల్సిన చోట జరిమానాలు విధిస్తున్న దాఖలాలు కనబడడం లేదు. నగరంలో ఏర్పాటు చేసే హోర్డింగ్స్ ప్రజలకు ఎలాంటి ప్రమాదం కలిగించకుండా ఉండేందుకు నిరంతరం తనిఖీలు నిర్వహించాలి. నిబంధనల ప్రకారం వ్యాపార ప్రకటనతో పాటు హోర్డింగ్ సామర్థ్యం పరీక్షించి సర్టిఫికెట్‌ను జారీ చేయాలి. కానీ ఆ దిశగా తనిఖీలు జరగడం లేదన్న అభిప్రాయాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి.
తెలంగాణ ఔట్‌డోర్ మీడియా ఓనర్స్ అసోసియేషన్ (టోమో) ప్రతినిధులు గురువారం సీపీఐ రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీని కలిశారు. టోమో ప్రతినిధులు, ఎలక్ట్రిషన్ మౌంటర్స్ ప్లెక్సీ ప్రింటర్స్ ఏజెన్సీ ప్రతినిధులు జీవో నంబరు 68, ప్రకటనల అమలులో ప్రభుత్వ ఉల్లంఘనలపై జాన్వెస్లీకి వివరించారు. జీవో నంబరు 68ను రద్దు చేసే వరకు తమ పార్టీ అండగా ఉంటుందని జాన్‌వెస్లీ చెప్పారు.
టోమో రౌండ్‌టేబుల్ సమావేశం పెట్టిన, సభ పెట్టిన, సీఎం కార్యాలయ ముట్టడి కార్యక్రమం తలపెట్టిన సీపీఐ(ఎం) ముందుంటుందని చెప్పారు. గత జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ చేసిన వాగ్దానం జీవో నంబరు 68ను రద్దు చేస్తానని హామీ ఇచ్చిందని, హోర్డింగ్‌ల అధికార పార్టీ గుత్తాధిపత్యాన్ని తొలగించి వాటిపై ఆధారపడిన కుటుంబాలను రక్షిస్తామని తెలిపారు. పార్టీ అధికారంలోకి వచ్చి 21 నెలలు దాటినా వీరి సమస్యలపై ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. ఈ కార్యక్రమంలో టోమో ప్రతినిధులు సయ్యద్ ఇఫ్తేకర్ , తిరుపతిరావు, రమేశ్, మధు, విష్ణువర్ధన్ తదితరులు పాల్గొన్నారు.