మారేడ్‌పల్లి, ఏప్రిల్ 12: ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం నుంచి సికింద్రాబాద్‌కు రైల్లో అక్రమంగా గంజాయి తరలిస్తున్న ఇద్దరు మహిళలను సికింద్రాబాద్ రైల్వే పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. నిందితుల వద్ద నుంచి రూ.3 లక్షల 93 వేల 300 విలువ చేసే 7.866 కిలోల గంజాయి, రెండు సెల్ ఫోన్లు, రైలు టిక్కెట్లను రైల్వే పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రైల్వే పోలీసు స్టేషన్ ఆవరణలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో రైల్వే డీఎస్పీ జావేద్ కేసు వివరాలు వెల్లడించారు.
అల్లూరి సీతారామరాజు జిల్లా, అరకు వాలీ మండలం, బొండం గ్రామానికి చెందిన పంచడి రుక్మిణి (56) రోజు వారి కూలీ. అదే ప్రాంతానికి చెందిన సెట్టి కసులమ్మ (44) కూలీ, వీరిద్దరూ ఒకే గ్రామానికి చెందిన వారు కావడంతో సులభంగా డబ్బులు సంపాదించాలనుకున్నారు. గతంలో వీరిద్దరూ గంజాయి రవాణాలో పాల్గొని ముంబై, విశాఖపట్నం, విజయనగరం పోలీసులకు పట్టుబడి జైలుకు వెళ్లారు. జైలు శిక్ష అనంతరం వీరికి ఈశ్వర్రావు అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది.
ఈ ఇద్దరు మహిళలకు ఈశ్వర్రావు ఒక్కొక్కరికి రూ.5 వేలు ఇచ్చి, సికింద్రాబాద్ వరకు గంజాయి తరలించాలని ఒప్పించాడు. ఈ నెల 10వ తేదీన సాయంత్రం విశాఖపట్నం రైల్వే స్టేషన్లో ఈశ్వర్రావు నాలుగు గంజాయి ఫ్యాకెట్లు ( ప్రతి ఒక్కరికి రెండు చొప్పున) అందించి, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు తీసుకెళ్లి జనరల్ వెయిటింగ్ హాల్లో ఉండమని.. అక్కడికి వచ్చే వ్యక్తులకు ఇవ్వాలని సూచించాడు. ఆయన సూచన మేరకు ఇద్దరు మహిళలు గోదావరి ఎక్స్‌ప్రెస్‌లో జనరల్ టిక్కెట్‌తో ప్రయాణించి, 11వ తేదీన ఉదయం 5:10 గంటలకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు చేరుకొని వెయిటింగ్ హాల్లో వేచి ఉన్నారు.
మధ్యాహ్నం 2:30 గంటలకు పోలీసులకు అనుమానం వచ్చి విచారించగా వారి బ్యాగుల్లో గంజాయిని గుర్తించారు. వెంటనే వారిని అదుపులోకి తీసుకొని విచారించగా చేసిన నేరాన్ని అంగీకరించారు. ప్రధాన నిందితుడు ఈశ్వర్రావు పరారీలో ఉన్నాడు. నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ సమావేశంలో రైల్వే ఎస్ఐలు, సిబ్బంది పాల్గొన్నారు.