సిటీబ్యూరో, జూన్ 2 (నమస్తే తెలంగాణ): మల్కాజిగిరి పోలీస్ కమిషనరేట్ పరిధి ఉప్పల్ ఠాణాలో గిరిజన కుటంబంపై దాడి చేసిన ఓ కాంగ్రెస్ నాయకుడు బాధితులతో కాళ్లు మొక్కించుకున్న అమానుష ఘటన మరువకముందే.. అదే ఠాణాలో ఖాకీల అండతో జరిగిన మరో దారుణ ఉదంతం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఎలాంటి తప్పు చేయకపోయినా, కనీసం గొడవతో సంబంధం లేనటువంటి ఒక దివ్యాంగుడు, అతడి భార్యను పోలీసులు ఓ సివిల్ తగాదాలో ఉప్పల్ పోలీస్ స్టేషన్లో ఉదయం నుంచి రాత్రి వరకు అక్రమంగా నిర్బంధించారు.
కమిషనరేట్ పరిధిలో రాజకీయ, వ్యక్తిగత ఒత్తిళ్లకు తలొగ్గుతున్న పోలీసులు అమాయకులను స్టేషన్‌ను చుట్టూ తిప్పడం, గంటల తరబడి వేధించడం నిత్యకృత్యంగా మారడం ఇప్పుడు తీవ్ర ఆందోళన కల్గిస్తోంది. తాజా ఘటనకు సంబంధించి బాధితుల కథనం ప్రకారం వివరాలు.. రామంతాపూర్‌లో నివాసం ఉండే ఓ దివ్యాంగుడు శారీరక వైకల్యం ఉన్నప్పటికీ అధైర్యపడకుండా ప్రైవేట్ సంస్థలో ఉద్యోగం చేస్తున్నాడు. అతడి భార్య కుట్టు మిషన్ కుడుతూ కుటుంబానికి చేదోడు వాదోడుగా ఉంటోంది.
గౌరవంగా జీవిస్తున్న ఆ దంపతులు తమ ఇంట్లోని ఒక పోర్షన్‌ను ఓ మహిళ న్యాయవాదికి కిరాయికి ఇచ్చారు. అయితే ఆమె అద్దెకు దిగిన కొన్ని నెలల్లోనే ఇంటి యజమానులతో విభేదాలు వచ్చాయి. దీంతో ఇంటిని ఖాళీ చేయాలంటూ ఇంటి యజమానులు ఆమెను కోరారు. దీంతో ఆమె తనకు తెలిసినవారిని పిలిపించి యజమానులపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేసింది. ఆమెకు మద్దతుగా వచ్చిన వారు సైతం ఇంటి యజమానుల వైపే న్యాయం ఉందని ఆమెకు నచ్చజెప్పి కొంత సమయం తీసుకొని ఇంటిని ఖాళీ చేసి వెళ్లిపోవాలని సూచన చేశారు. దీంతో మరింత కోపోద్రిక్తురాలైన సదరు న్యాయవాది ఎలాగైనా ఇంటి యజమానులను ఇబ్బంది పెట్టాలని నిర్ణయించుకుంది.
మే 13న ఉప్పల్ పోలీస్ స్టేషన్ నుంచి దివ్యాంగుడైన ఇంటి యజమానికి ఫోన్ వచ్చింది.. ‘మీ భార్యపై ఫిర్యాదు వచ్చింది, రేపు పొద్దునే మీరిద్దరూ స్టేషన్‌కు రావాలి’ అని పోలీసులు హుకూం జారీ చేశారు. చట్టాన్ని గౌరవించే పౌరులుగా మే 14వ తేదీన ఆ దంపతులు ఠాణాకు వెళ్లారు. ‘మీ భార్య, మీ ఇంట్లో అద్దెకున్న ఆవిడతో గొడవ పెట్టుకుందంట.. అందుకే పిలిపించాం’ అని చెప్పిన పోలీసులు వారి నుంచి ఎలాంటి వివరణ తీసుకోకుండానే స్టేషన్లో కూర్చొబెట్టారు. సార్ నేను రోజు ఆఫీస్‌కు వెళ్తాను.. గొడవ జరిగిన రోజు కూడా నేను ఇంటి వద్ద లేను.. నన్ను వదిలేయండంటూ బాధితుడు పోలీసులను ప్రాధేయపడ్డ్డా ఠాణాలో ఎవరూ కనికరించలేదు. ఆ దంపతులను ఠాణా నుంచి బయటకు వెళ్లనీయకుండా రాత్రి 8.30 గంటల వరకు స్టేషన్లోనే కూర్చొబెట్టారు. విషయం తెలుసుకున్న ఆ దంపతుల బంధువు ఒకరు తమకు తెలిసిన వారి ద్వారా ఠాణాకు ఫోన్ చేయించి వారిద్దరిని బయటకు తీసుకొచ్చారు.
సాధారణంగా ఎదైనా ఫిర్యాదు వస్తే ప్రాథమిక విచారణ చేసి అందులో నిజా నిజాలు తెలుసుకున్న తర్వాతే చర్యలు తీసుకోవాలి. కానీ ఉప్పల్ పోలీసులు మాత్రం ముందే అమాయకులను రోజంతా స్టేషన్లో కూర్బోబెట్టి శిక్ష విధించారు. మరుసటి రోజు అసలు గొడవ జరిగిందా? గొడవకు కారణాలేంటీ అనే విషయంపై బాధితుడైన దివ్యాంగుడి ఇంటి వద్ద విచారణ జరిపారు. ఇక్కడ ఎలాంటి గొడవ జరుగలేదని, ఆ దంపతులపై ఫిర్యాదు ఇవ్వడం అన్యాయమంటూ స్థానికులు తేల్చి చెప్పారు. దీంతో తమ తప్పు కప్పించుకోవడానికి ఇలాంటివి సమాజంలో జరుగుతుంటాయి, సర్దుకుపోవాలి అంటూ బాధితులకు ఉచిత సలహాలు ఇచ్చి పోలీసులు అక్కడి నుంచి జారుకున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు.
అక్రమ నిర్భంధం వ్యవహారం ఉప్పల్ సీఐకి తెలిసి జరిగిందా? అని బాధితులను ప్రశ్నించగా, వారు సంచలన వియాలు వెల్లడించారు, అంతా సీఐ కన్నుసన్నల్లోనే జరిగిందని, ఆయనకు ప్రతి విషయం తెలుసని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులపై రాజకీయ నాయకులు, ఇతరుల ఒత్తిళ్ల కారణంగానే అలా చేసి ఉ ంటారని అనుమానం వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంపై ‘నమస్తే తెలంగాణ’ ప్రతినిధి ఉప్పల్ సీఐ రామలింగారెడ్డిని వివరణ కోరగా… ఆయన ఈ ఘటనను పూర్తిగా ఖండించారు, మా స్టేషన్లో అలాంటిదేమి జరుగలేదని, అసలు ఎఫ్ఐఆర్ నమోదు కాకుండా మేము ఎవరిని స్టేషన్‌కు తీసుకురాము, కూర్చోబెట్టం అని చెప్పడం గమనార్హం. సాధారణంగా ఠాణాలో జరిగే చట్ట వ్యతిరేక వ్యవహారాలు, ఏ అధికారి ఒప్పుకోరనేది బహిరంగ రహస్యం. కానీ పోలీసులు చెప్తున్నది అబద్ధమని, మే 13, 14వ తేదీన ఉప్పల్ పోలీస్ స్టేషన్‌లోని సీసీ కెమెరా పుటేజీలను ఉన్నతాధికారులు పరిశీలిస్తే అసలు విషయాలు బయటపడుతాయని బాధితులు కోరుతున్నారు.