Jubleehills | బంజారాహిల్స్, మే 15 : జూబ్లీహిల్స్ డివిజన్ పద్మాలయ అంబేద్కర్‌నగర్ బస్తీని అనుకుని ప్రభుత్వ స్థలంలో వెలిసిన అక్రమ నిర్మాణాలను షేక్‌పేట మండల రెవెన్యూ సిబ్బంది కూల్చివేశారు. షేక్‌పేట మండల పరిధిలోని సర్వే నెంబర్ 403లోకి వచ్చే జూబ్లీహిల్స్ రోడ్ నెం 78లోని పద్మాలయ అంబేద్కర్‌నగర్‌లో ప్రభుత్వ పాఠశాల కింది భాగంలో ఖాళీ ప్రభుత్వ స్థలంలో బస్తీకి చెందిన ఉమ, నాగమణి అనే మహిళలు సుమారు వంద గజాల చొప్పున స్థలాలు ఆక్రమించుకుని షెడ్లు, గుడిసెలు వేసుకున్నారు. గతంలోనే పలుమార్లు రెవెన్యూ సిబ్బంది వీటిని తొలగించారు. తాజాగా మరోసారి గుడిసెలు వేసిన విషయంపై సమాచారం అందుకున్న షేక్‌పేట మండల ఆర్ఐలు అనిరుధ్, భానుతో పాటు వీఆర్వో శ్రీనివాస్ తదితరులు గురువారం సిబ్బందితో వచ్చి ఆక్రమణలను నేలమట్టం చేశారు. ఎన్నిసార్లు చెప్పినా వినకుండా గుడిసెలు వేస్తుంటే క్రిమనల్ కేసు నమోదు చేయాల్సి ఉంటుందని అధికారులు హెచ్చరించారు.