Hyderabad | వనస్థలిపురం, మార్చి 8 : తన ఇంటిపక్కన నిర్మాణమవుతున్న ఇల్లు పూర్తిగా నిబంధనలకు విరుద్ధంగా ఉందని, తన ఇంటికి సెట్ బ్యాక్‌లు లేకుండా నిర్మిస్తున్నారని, పార్కింగ్ స్థలంలో గోదాం నిర్వహిస్తున్నారని మూడేళ్లుగా జీహెచ్ఎంసీ అధికారులకు పిర్యాదు చేస్తున్నాడు. కానీ అధికారులు మాత్రం తమకేమీ పట్టనట్టు నోటీసులిచ్చి చేతులు దులుపుకున్నారు. నిర్మాణ దారుడు సెలవు దినాల్లో పనులు చేసుకుంటూ భవనం చివరి దశకు తీసుకువచ్చారు. ఇది ఎల్బీనగర్ సర్కిల్ జీహెచ్ఎంసీ, టౌన్ ప్లానింగ్ అధికారుల పనితీరుకు నిదర్శనం.
హస్తినాపురం డివిజన్ జెడ్పీరోడ్లోని వెంకటేశ్వర కాలనీ రోడ్ నెం.3లో ఈ నిర్మాణం జరుగుతోంది. ఫిర్యాదుదారుడి పేరు కే.వేణుగోపాల్. తన ఇంటి పక్కనే ప్రమాదకరంగా, నిబంధనలకు విరుద్ధంగా భవన నిర్మాణం జరుగుతోందని 2020లోనే స్థానిక జీహెచ్ఎంసీ, టౌన్ ప్లానింగ్ అధికారులకు ఫిర్యాదులు చేశాడు. కానీ ఎలాంటి చర్యలు లేకపోవడంతో జీహెచ్ఎంసీ హెడ్ ఆఫీస్ ప్రజావాణిలో రెండు సార్లు పిర్యాదు చేశారు. జీహెచ్ఎంసీ కమిషనర్, డిప్యూటీ మేయర్, ఎల్బీనగర్ జోనల్ కమిషనర్, డిప్యూటీ కమిషనర్, టౌన్ ప్లానింగ్ అధికారులకు ఫిర్యాదులు చేశాడు. దీంతో టౌన్ ప్లానింగ్ అధికారులు సదరు నిర్మాణదారుడికి నోటీసులు ఇచ్చారు. నోటీసులు అందుకున్న వ్యక్తి వాటిని భేఖాతరు చేసి సెలవు దినాలు, రాత్రి వేళల్లో పనులు నిర్వహిస్తున్నాడు. దీంతో అప్పుడు కొంత, అప్పుడు కొంత అన్నట్లుగా భవనం చివరి దశకు వచ్చింది.
ఎల్బీనగర్ టౌన్‌ప్లానింగ్ ఏసీపీ ప్రతాప్‌ను కలిసిన బాధితుడు సమస్యను పూర్తిగా వివరించినా ప్రయోజనం లేకుండా పోతోంది. ప్రస్తుతం శని, ఆదివారులు రెండు రోజులు సెలవు దినాలు కావడంతో పనులు చేపట్టి స్పీడ్ పెంచినట్లు బాధితుడు పేర్కొంటున్నారు. టౌన్ ప్లానింగ్ అధికారుల సహకారంతోనే అక్రమ నిర్మాణదారులు రెచ్చిపోతున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
హస్తినాపురం డివిజన్లో జెడ్పీ రోడ్ ప్రధాన వాణిజ్య కేంద్రంగా మారింది. దీంతో రహదారికి ఇరువైపుల అక్రమ నిర్మాణాలు కోకొల్లలుగా పుట్టుకొస్తున్నాయి. పైన చెప్పిన నిర్మాణంలో గ్రౌండ్, రెండు ఫ్లోర్లు నిర్మిస్తున్న సదరు వ్యక్తి గ్రౌండ్ ఫ్లోర్‌ను పార్కింగ్‌కు వదిలేయాల్సి ఉండగా కమర్షియల్ గోదాంగా వినియోగిస్తున్నాడు. దాంతోపాటు జెడ్పీ రోడ్లో అక్రమ వాణిజ్య షెడ్లు, నిబంధనలు పట్టని నిర్మాణాలు సాగుతూనే ఉన్నాయి. టౌన్ ప్లానింగ్ అధికారులకు తెలిసే ఇదంతా జరుగుతోంది. కాగా అధికారులు ఎందుకు పట్టించుకోవడంలేదన్న విషయంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అక్రమార్కులతో అధికారులు, సిబ్బంది కుమ్మక్కై వీటిని వదిలేస్తున్నారన్న వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. ఫిర్యాదులు వచ్చినా కనీసం పట్టించుకోని దారుణమైన పరిస్థితులు ఎల్బీనగర్ సర్కిల్లో చోటు చేసుకుంటున్నాయి.
హస్తినాపురం డివిజన్లో టౌన్‌ప్లానింగ్ శాఖ తీరు వివాదాస్పదంగా ఉంటోంది. ఫోన్, వాట్సాప్, యాప్ ద్వారా ఫిర్యాదులు వస్తే కనీసం స్పందించరు. లిఖిత పూర్వక పిర్యాదులకు కూడా స్పందన ఉండదు. వెంకటేశ్వర కాలనీలో రెండేళ్లుగా, ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేదు, ఇది వారి పనితీరుకు నిదర్శనంగా నిలుస్తోంది. జెడ్పీ రోడ్లో అక్రమ నిర్మాణాలపై నేను కూడా ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదు. ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని సిబ్బంది పనితీరుపై విచారణ జరిపించాలి, వెంకటేశ్వర కాలనీలోని అక్రమ నిర్మాణాన్ని వెంటనే కూల్చి వేయాలి.
జాల శివయాదవ్, హస్తినాపురం