బడంగ్‌పేట: కాంగ్రెస్ ప్రభుత్వం లగచర్ల రైతులపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలని మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి డిమాండ్ చేశారు. లగచర్ల రైతులపై అక్రమ కేసులు పెట్టడమే కాకుండా థర్డ్ డిగ్రీ ఉపయోగించి.. జైలులో పెట్టడాన్ని నిరసిస్తూ.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు.. మహేశ్వరం నియోజకవర్గవ్యాప్తంగా మంగళవారం ఉదయం 11 గంటలకు అన్ని అంబేద్కర్ విగ్రహాలకు పూల మాలలు వేసి వినతిపత్రాలు సమర్పించాలని మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పిలుపునిచ్చారు. రైతుల చేతులకు బేడీలు వేసిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎక్కడికక్కడ నిలదీయాలన్నారు.
నిరంకుశ పాలనను నిరసిస్తూ.. ప్రజలంతా అన్నదాతలకు మద్దతు తెలుపాలన్నారు. కాంగ్రెస్ పార్టీ అమాననీయ, అణచివేత ధోరణిని నిరసిస్తూ.. ప్రజలు రైతులకు మద్దతు తెలుపాలన్నారు. రైతులపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేసి.. జైలులో నిర్బంధించిన రైతులను విడుదల చేసే వరకు పోరాటం చేయాలన్నారు. రైతులపై పెట్టిన కేసులు ఎత్తివేసేందుకు చేపట్టే ఉద్యమంలో ప్రజాస్వామిక వాదులు, వివిధ సంఘాలు, కుల సంఘాలు, ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాలు, మహిళా సంఘాలు, కవులు, కళాకారులు, రచయితలు అందరూ భాగస్వాములు కావాలన్నారు. రైతు లేనిది రాజ్యం లేదన్నారు. రైతులకు బేడీలు వేసిన కాంగ్రెస్ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు.