రాష్ట్రంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా హస్తం పార్టీ కుట్రలకు తెరలేపుతున్నదని బీఆర్ఎస్ పార్టీకి చెందిన సీనియర్ నేతలు మండిపడుతున్నారు. పాలన చేతకాక బీఆర్ఎస్ ముఖ్య నాయకులపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రైతు భరోసా మోసాన్ని కప్పిపుచ్చుకునేందుకే బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై అక్రమ కేసులు పెడుతున్నారని విమర్శించారు.
– కంటోన్మెంట్, జనవరి 7
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై ఏసీబీ కేసు పెట్టగానే ఈడీ వచ్చింది. కాంగ్రెస్, బీజేపీ కుమ్మక్కై ఎమ్మెల్సీ కవితను జైలుకు పంపారు. ప్రస్తుతం కేటీఆర్, కవిత, హరీశ్‌రావుపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారు. రేవంత్ అబద్ధాల అలవాటు మార్చుకోవడం లేదు. నిన్నటి వరకు కాళేశ్వరం సహా అనేక విషయాలపై అబద్ధాలు మాట్లాడారు. ఇప్పుడు ఫార్ములా ఈ రేస్ పేరుతో కొత్త నాటకానికి తెరలేపారు. దేశంలోనే ఫార్ములా ఈ కార్ రేస్ జరిగింది హైదరాబాద్‌లోనే. ఫార్ములా ఈ కార్ రేస్ వల్ల రాష్ట్రానికి రూ. 700 కోట్ల ఆదాయం సమకూరింది.
– జక్కుల మహేశ్వర్‌రెడ్డి, కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు
సర్కారు కక్ష పూరింతగా కేటీఆర్‌ను అరెస్ట్ చేస్తే మరో ఉద్యమం తప్పదు. ఈ రేస్‌ను కేంద్ర ప్రభుత్వం నుంచి అన్ని అనుమతులు తీసుకున్నాకే రాష్ట్రంలో నిర్వహించారు. కేటీఆర్‌ను అరెస్ట్ చేస్తే చూస్తూ ఊరుకోం. ఇప్పటికైనా ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు స్వస్తి పలికి పాలనపై దృష్టి కేంద్రీకరించాలి.
– గజ్జెల నాగేశ్, రాష్ట్ర బెవరేజెస్ కార్పొరేషన్ మాజీ చైర్మన్
ఫార్ములా ఈ కార్ రేస్ కేసు విషయంలో ప్రభుత్వం చేస్తున్న ఆరోపణలు నిరాధారం. కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న మోసాలను పక్కదారి పట్టించడానికి, వీటిపై రైతుల్లో, ప్రజల్లో చర్చకు రానివ్వకుండా.. కాంగ్రెస్ ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నది. డైవర్షన్ పాలిటిక్స్‌లో భాగంగా పెట్టిన చెత్త కేసు ఫార్ములా ఈ కార్ రేసింగ్ కేసు. కాంగ్రెస్ ప్రభుత్వ మోసాలను ఎండగడుతూ.. రైతాంగాన్ని మేల్కొపుతున్న కేటీఆర్‌పై రేవంత్‌రెడ్డి కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారు.
– మన్నె క్రిశాంక్, రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ, మాజీ చైర్మన్