మేడ్చల్, అక్టోబర్ 5(నమస్తే తెలంగాణ): ఖాళీ స్థలం కనిపిస్తే ఆక్రమణలే…ప్రభుత్వ భూములు ఖాళీగా ఉంటే రేకుల షెడ్లు, ప్రీకాస్ట్వాల్స్ వేసి అక్రమ నిర్మాణాలు చేయడం యథేచ్ఛగా జరుగుతున్నది. అంతేకాక ప్రభుత్వ భూముల్లో సర్కారు అనుమతులు లేకుండా రోడ్ల నిర్మాణం జరుగుతున్నా చూసీ చూడనట్లు అధికారులు వ్యవహరిస్తున్న తీరుతో అనేక అనుమనాలకు తావిస్తున్నది. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలోని శివారు మున్సిపాలిటీలతో పాటు సర్కిళ్ల పరిధిలో ఇలాంటి పరిస్థితి ఉంది.
అనేక ప్రభుత్వ భూములు కబ్జాలకు గురువుతున్నాయి. ప్రభుత్వ స్థలాలను పర్యవేక్షించాల్సిన అధికారులు అధికార పార్టీకి చెందిన నాయకులు కబ్జాదారులకు సహకరం అందిస్తూ అందినంత దోచుకుంటున్నట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వ ఖాళీ స్థలంలో రేకుల షెడ్లు, ఫ్రీ కాస్ట్వాల్స్ ఏర్పాటు చేసుకుని అధికారులను కబ్జాదారులు మచ్చిక చేసుకుని ఇంటి నెంబర్లు పొంది అమాయకులకు విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. జిల్లాలో 11,384 ఎకరాల అసైన్డ్ భూములు, 5,195 ఎకరాల ప్రభుత్వ భూములు ఉన్నాయి.
జిల్లాలో అన్ని ఆక్రమణలే..
పోచారం మున్సిపాలిటీ పరిధిలోని అన్నోజిగూడలోని 14 ప్రభుత్వ సర్వే నంబర్లో రెండు ఎకరాల ప్రభుత్వ భూమిని ఆక్రమించి నిర్మాణాలు చేస్తున్నారు. 18, 19 సర్వే నంబర్లలో పార్క్‌కు కేటాయించిన ఎకరంలో భూమిలో ప్లాట్లుగా మార్చి కబ్జాదారులు విక్రయాలు చేస్తున్నారు. ముత్వేల్లిగూడలో 66 సర్వే నంబర్లో రెండు ఎకరాల ప్రభుత్వ భూమి కబ్జాకు గురైనట్లు అధికారులకు ఫిర్యాదు చేసినా స్పందించడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. కొర్రెముల్లోని 739 సర్వే నంబర్లలో ఉన్న భూమిని రియల్ ఎస్టేట్ సంస్థలు ప్రహరీలు నిర్మించి కబ్జాకు పాల్పడ్డట్లు ఫిర్యాదులు చేశారు.
మల్కాజిగిరి నియోజకవర్గంలోని 844 ప్రభుత్వ సర్వే నెంబర్లో 55 ఎకరాల స్థలం కబ్జాకు గురువుతున్నట్లు ఎకంగా మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌రెడ్డి చేసిన ఫిర్యాదుకు అధికారులు స్పందించడం లేదు. యాప్రాల్‌లో 171 సర్వే నెంబర్లో రెండు ఎకరాల ప్రభుత్వ భూమి ఆక్రమణలకు గురైంది. అల్వాల్‌లోని జొన్నబండ వద్ద రెండు వేల గజాల పార్క్ స్థలం కబ్జాకు గురైంది. ఉప్పల్ నియోజకవర్గంలోని సర్వేనెంబర్ 199బై1 ప్రభుత్వ భూమిని ఆక్రమించి ఇళ్లు నిర్మిస్తున్నారు. మల్లాపూర్‌లోని 24 సర్వే నెంబర్లో రెండు ఎకరాల ప్రభుత్వ భూమిని కబ్జాదారులు ఆక్రమించినా ఇటు రెవెన్యూ అధికారులుగాని అటు హైడ్రా అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
అనుమతి లేకుండానే రోడ్లు..
ప్రభుత్వ భూములలో ప్రభుత్వం అనుమతి లేకుండానే ప్రైవేట్ వ్యక్తులు యథేచ్ఛగా రోడ్లు వేసుకుంటున్నారు. తాజాగా కీసర మండలం రాంపల్లి దయారాలో సర్వే నెంబర్ 618 ప్రభుత్వ భూమిలో ఎకంగా ప్రైవేట్ వ్యక్తులు తమ దారిని ఏర్పాటు చేసుకునేందుకు ప్రభుత్వ అనుమతి లేకుండానే అర కిలోమీటర్ వరకు రోడ్డును ఏర్పాటు చేసుకున్నారు. 2009లో అప్పటి ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్లకు కేటాయించిన కాలనీల రోడ్లను ప్రైవేట్ వక్తులు దారి కోసం సీసీరోడ్డును నిర్మించుకున్నారు.
ఇంత జరుగుతున్నా.. ప్రభుత్వ అధికారులు మాత్రం స్పందించకపోవడంతో జిల్లాలో అనేక అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయి. కబ్జాలపై ఫిర్యాదులు వస్తే ఏదో నామా మాత్రంగా నోటీసులు ఇచ్చి అధికారులు చేతులు దులుపుకొంటున్నారే తప్ప ప్రభుత్వ భూములను రక్షించాలన్న సంకల్పం అధికారులకు ఉండటం లేదన్న విమర్శలు వస్తున్నాయి.