Hyderabad | బంజారాహిల్స్, మే 9 : తన మీద పెట్టిన కేసులను వెనక్కి తీసుకోకపోతే సోషల్ మీడియాలో మార్ఫింగ్ ఫోటోలు పెట్టి పరువు తీస్తానంటూ బెదిరించిన వ్యక్తిపై బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళ్తే.. బంజారాహిల్స్ రోడ్ నెం 12లోని ఎమ్మెల్యే కాలనీలోని మేరీ సువర్ణభూమి రిసార్ట్స్ సంస్థలో గతంలో డైరెక్టర్గా పనిచేసిన మంచాల సాయిసుధాకర్ అనే వ్యక్తి పలు రకాలైన మోసాలకు పాల్పడడంతో సంస్థ నిర్వాహకులు అతడిపై చీటింగ్ కేసులు పెట్టారు. దీంతో అతడు అరెస్టయి జైలుకు వెళ్లి వచ్చాడు. దీంతో ఎలాగైనా సంస్థ ప్రతిష్టను దెబ్బతీయాలనే ఉద్దేశ్యంతో గతకొంతకాలంగా మార్ఫింగ్ ఫోటోలతో బ్లాక్మెయిల్ చేయడం ప్రారంభించాడు. తనమీద పెట్టిన కేసులను వెనక్కి తీసుకోకపోతే ఫోటోలను సోషల్ మీడియాలో పెట్టి పరువు తీస్తానంటూ బెదిరిస్తుండడంతో సంస్థ డైరెక్టర్ శుక్రవారం బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో నిందితుడు సాయి సుధాకర్ మీద బీఎన్ఎస్ 336(4), 79, 351(2), 49 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.