Banjarahills | బంజారాహిల్స్, మే 11 : కొన్నాళ్లపాటు ఉండేందుకు ఫ్లాట్‌ను ఇస్తే దాన్ని కబ్జాచేసేందుకు యత్నించిన ఘటన బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. దుబాయిలో వైద్యురాలిగా పనిచేస్తున్న డా. సౌమ్యా మజహర్కు బంజారాహిల్స్ రోడ్ నెం 9లో మహమూద్ హబీబ్ అపార్ట్‌మెంట్స్‌లో ఫ్లాట్ ఉంది. గత కొన్నేళ్లుగా తన సోదరి లుబ్నా మజహర్, అమె కొడుకు(15) ఉండేందుకు ఫ్లాట్ అప్పగించింది.
కాగా ఇటీవల లుబ్నా మృతి చెందడంతో ఆమె కొడుకు అమ్మమ్మ వద్ద ఉంటున్నాడు. అప్పటినుంచి ఈ ఫ్లాట్ రక్షణ బాధ్యతలను డా.సౌమ్యా మజహర్ తన సోదరుడు మహ్మద్ యాసీన్ షరీఫ్‌కు అప్పగించడంతో పాటు జీపీఏ చేసింది. కాగా లుబ్నా మజహర్ భర్త షకీబ్ మహమూద్ గత ఏడాది జూలైలో దౌర్జన్యంగా ఫ్లాట్ వద్దకు వచ్చి తాళాలు పగలగొట్టి లోనికి ప్రవేశించాడు. అప్పటినుంచి ఫ్లాట్‌లో ఉంటూ ఎవరినీ రానివ్వడం లేదు. ఈ మేరకు సమాచారం అందుకున్న మహ్మద్ యాసీన్ షరీఫ్ ఆదివారం బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.