హైదరాబాద్: హైదరాబాద్ రాయదుర్గంలో ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. మల్కంచెరువు సమీపంలో వేగంగా దూసుకొచ్చిన కారు.. ఫ్లై ఓవర్ గోడను ఢీకొట్టింది. దీంతో కారు నుజ్జునుజ్జు అయింది. అందులో ప్రయాణిస్తున్న యువకుడు మరణించాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కారులోనుంచి మృతుడిని వెలికితీశారు. యువకుడిని ఐసీఎఫ్ఏఐ యూనివర్సిటీలో బీబీఏ చదువుతున్న చరణ్‌గా (19) గుర్తించారు.
బీఎన్ఆర్ హిల్స్ నుంచి మెహిదీపట్నంలోని తన నివాసానికి వెళ్తుండగా ప్రమాదం జరిగిందని చెప్పారు. చరణ్ స్పాట్లోనే చనిపోయాడని, మృతదేహాన్ని బయటకు తీయడానికి రెండు గంటలు శ్రమించాల్సి వచ్చిందన్నారు. అతివేగమే ప్రమాదానికి కారణమని తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.