HYDRAA | హైడ్రా అంటే కూల్చివేతలే కాదని కమిషనర్ ఏవీ రంగనాథ్ అన్నారు. హైడ్రా పరిధి ఔటర్ రింగు రోడ్డు వరకే అని ఆయన తెలిపారు. నగరంలోనే కాదు.. రాష్ట్రంలో.. ఆఖరకు ఇతర రాష్ట్రాల్లో కూల్చివేతలను కూడా హైడ్రాకు ఆపాదించి సామాజిక మాధ్యమాలు ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నాయని అన్నారు.
హైడ్రా పేదల నివాసాల జోలికి వెళ్లదని ఏవీ రంగనాథ్ తెలిపారు. అలాగే నివాసం ఉంటే ఆ ఇళ్లను కూల్చదని చెప్పారు. కూల్చివేతలన్నీ హైడ్రావి కాదని స్పష్టం చేశారు. ప్రజలు, సామాజిక మాధ్యమాలు ఈ విషయాన్ని గుర్తించాలని విజ్ఞప్తి చేశారు. ప్రకృతి వనరుల పరిరక్షణ, చెరువులు, కుంటలు, నాలాలను కాపాడటం, వర్షాలు, వరదల సమయంలో రహదారులు, నివాస ప్రాంతాలు మునిగిపోకుండా చర్యలు తీసుకోవడం తమ బాధ్యత అని పేర్కొన్నారు.
మూసీ నదికి ఇరువైపులా సర్వేలతో హైడ్రాకు సంబంధం లేదని కమిషనర్ ఏవీ రంగనాథ్ తెలిపారు. అక్కి నివాసితులను హైడ్రా తరలించడం లేదని చెప్పారు. అక్కడ ఎలాంటి కూల్చివేతలను హైడ్రా చేపట్టడం లేదని పేర్కొన్నారు. మూసీ పరివాహక ప్రాంతంలోని ఇళ్లపై హైడ్రా మార్కింగ్ చేయడం లేదని స్పష్టం చేశారు. మూసీ సుందరీకరణ ప్రత్యేక ప్రాజెక్టు అని.. దాన్ని మూసీ రివర్‌ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చేపడుతోందని తెలిపారు.