Hydraa | ప్రజా వ్యతిరేకతతో ఎట్టకేలకు కాంగ్రెస్ ప్రభుత్వంలో కదలిక వచ్చింది. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ సమీపంలోని కొత్వాల్‌గూడలో అనుమతి లేకుండా నిర్వహిస్తున్న స్టోన్ క్రషర్లను హైడ్రా కూల్చివేసింది. రాఘవ క్రషర్స్‌తో పాటు పలు కంపెనీలకు చెందిన ఐదు క్రషర్ మెషిన్లతో పాటు 12 ఆర్ఎంసీ యూనిట్లను తొలగించింది. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, మైనింగ్ శాఖల సాయంతో హైడ్రా వీటిని కూల్చివేసింది.
మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డికి చెందిన రాఘవ కన్స్ట్రక్షన్స్ ఏకంగా జీవో 111ను ఉల్లంఘిస్తూ క్రషర్స్ నడుపుతున్నా.. రెండేండ్లుగా నిరాటంకంగా అక్రమ మైనింగ్ కొనసాగుతున్నా అధికారులు కన్నెత్తి చూడటం లేదని కొంతకాలంగా స్థానికులు విమర్శిస్తున్నారు. కాలుష్య నియంత్రణ మండలి సైతం ‘అనుమతిలేని ఆ క్రషర్‌ను మూసివేయండి’ అని క్లోజర్ ఉత్తర్వులు ఇచ్చి, ఆ కాగితాలను కోల్డ్ స్టోరేజీలో పడేసిందన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. కొత్వాల్‌గూడలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి చెందిన రాఘవ క్రషర్స్ అక్రమ మైనింగ్ చేస్తున్నదని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్‌రావు ఇప్పటికే పలుమార్లు ఆరోపించారు. అసెంబ్లీలో సైతం రాఘవ క్రషర్స్ అక్రమ మైనింగ్‌పై ప్రశ్నించారు. బీఆర్ఎస్ పోరాటంతో పాటు ప్రజల్లో వ్యతిరేకత రావడంతో చివరకు పొంగులేటిని ఒప్పించి రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూల్చివేతలు మొదలుపెట్టింది.
మంత్రి పొంగులేటికి చెందిన రాఘవ క్రషర్ మిషన్స్‌ను కూల్చేసిన హైడ్రా అధికారులు
కొత్వాల్ గూడలో మంత్రి పొంగులేటికి చెందిన రాఘవ క్రషర్స్ అక్రమ మైనింగ్ చేస్తున్నారని ఆరోపించిన మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు
అసెంబ్లీలో సైతం రాఘవ క్రషర్స్ అక్రమ మైనింగ్‌పై ప్రశ్నించిన హరీష్ రావు… https://t.co/QGAiVKHzFv pic.twitter.com/ukHpVIAbzA
— Telugu Scribe (@TeluguScribe) May 5, 2026
1996లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జంట జలాశయాలైన ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్ పరిరక్షణ కోసం జీవో 111ను తెచ్చిన సంగతి తెలిసిందే. జంట జలాశయాల చుట్టూ ఉన్న 84 గ్రామాల పరిధిలోని క్యాచ్మెంట్ ఏరియాలో ఎలాంటి కాలుష్య కారకాలు ఉత్పత్తి చేసే సంస్థలను ఏర్పాటు చేయొద్దని, విషపూరిత రసాయనాలు అమ్మే వ్యాపారాలకు అనుమతులు ఇవ్వరాదని స్పష్టమైన నిబంధనలు పొందుపరిచింది. అయినా వీటిని అతిక్రమిస్తూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డికి చెందిన రాఘవ కన్స్ట్రక్షన్స్ ఎలాంటి అనుమతులు తీసుకోకుండా క్రషర్ నిర్వహిస్తున్నదని, సహజ వనరులను కొల్లగొడుతున్నదని, రూ.వందల కోట్లు దోచుకుంటున్నదని ఆరోపణలు వినిపిస్తున్నాయి.
కొన్నిరోజుల కిందట మంత్రి పొంగులేటి కుమారుడు గండిపేట రెవెన్యూ మండల పరిధి వట్టినాగులపల్లిలో విలువైన భూమిని ఆక్రమించుకునేందుకు దాదాపు వందమంది బౌన్సర్లతో అర్ధరాత్రి ప్రయత్నించిన సంగతి తెలిసిందే. దీనిపై అధికారులు చర్యలు తీసుకోగా, తన కుమారుడిపై కేసు నమోదు చేసిన అధికారులను మంత్రి బదిలీచేయించారన్న వార్త అప్పట్లో పెనుసంచలనం రేపింది. తాజాగా శంషాబాద్ మండలం కొత్వాల్‌గూడలోని సర్వేనంబర్లు 62, 63లోని ఐదెకరాల అసైన్డ్ భూముల్లో రెండేండ్లుగా రాఘవ కన్స్ట్రక్షన్స్ భారీ క్రషర్లు నడుపుతున్నదని స్థానికులు చెప్తున్నారు.
గుట్టలను పిండి చేస్తున్నా, చర్యలు తీసుకోవాల్సిన పొల్యూషన్ బోర్డు, మైనింగ్, రెవెన్యూ, విద్యుత్, తదితర శాఖల అధికారులు పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. దీంతో భారీ క్రషర్ మెషీన్లను దింపి నగర నలుమూలల్లో ఆ సంస్థ చేపట్టిన ప్రాజెక్టులకు ఇక్కడి నుంచే రాతి ఇసుకను సరఫరా చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. దీంతో రెండేండ్లలో రూ.వందల కోట్ల లావాదేవీలు జరిగాయని, అటు ప్రకృతికి, ఇటు ప్రభుత్వ ఖజానాకు నష్టం కలిగిందని ఆరోపణలు వినిపిస్తున్నాయి.