Hydraa | దుండిగల్, ఏప్రిల్4: మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కుత్బుల్లాపూర్ మండలం సూరారం గ్రామ పరిధి సర్వే నెంబర్ 16/28లోని ప్రైవేటు భూముల్లో నిర్మించుకున్న ప్రహరీ గోడను హైడ్రా అధికారులు శుక్రవారం కూల్చివేశారు. ఎస్ఎఫ్ఐ అధికారుల ఫిర్యాదుతో కూల్చివేతలు చేపట్టినట్లు హైడ్రా అధికారులు పేర్కొంటుండగా.. తమ ప్రైవేటు భూముల్లో నిర్మించుకున్న ప్రహారీని ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా హైడ్రా కూల్చివేసిందని భూ యజమానులు వారాల రాజేశ్వరరావు తదితరులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయమై తాము న్యాయపోరాటం చేస్తామని తెలిపారు.
తమకు కనీస సమాచారం ఇవ్వకుండా కూల్చే అధికారం వీరికి ఎవరిచ్చారు అంటూ వారు ప్రశ్నించారు.2009లోనే నిర్మించుకున్న కాంపౌండ్ వాల్‌ను ఇప్పుడు ఎలా కూలగొడతారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక్కడ లే అవుట్ లేదని, రోడ్డుకు అడ్డంగా తాము ఎలా నిర్మించామో స్పష్టం చేయాల్సిన అవసరం ఉందన్నారు. కూల్చివేతలను అడ్డుకునేందుకు వెళ్లిన తమను పోలీస్ స్టేషన్‌కు తరలించడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. హైడ్రా తమకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. కూల్చేముందు విచారణ చేయాల్సిన అవసరం లేదా అంటూ ప్రశ్నించారు. ఎవరో ఫిర్యాదు చేస్తే సరైన పరిశీలన జరపకుండా ఎలా కూల్చివేస్తారంటూ ప్రశ్నించారు. హైడ్రాకు కోర్టు ఎన్నిసార్లు మొట్టికాయలు వేసిన వారిలో మార్పు రాకపోవడం విడ్డూరంగా ఉందన్నారు.