సిటీబ్యూరో, నవంబర్ 24 (నమస్తే తెలంగాణ): : సియేట్ మారుతీ హిల్స్ కాలనీ.. ప్రస్తుతం సున్నంచెరువు వద్ద ఏ ఘటన జరిగిన ముందుగా తెరపైకి వస్తున్నది ఈ కాలనీయే. నాలుగు దశాబ్దాల క్రితం కొందరు ఉద్యోగులు సొసైటీ ఏర్పాటు చేసుకుని తద్వారా పట్టాభూములను కొనుగోలు చేయగా ఈ భూములు ప్రస్తుతం హైడ్రా కబ్జాలో అనధికారికంగా ఉన్నాయంటూ కాలనీ వాసులు ఆరోపిస్తున్నారు. 1980వ దశకంలో తాము కొనుగోలు చేసిన భూమి విషయంలో అన్ని రకాల హక్కుల కలిగి ఎక్కడా ప్రభుత్వ వ్యతిరేక వ్యవహారాలకు పాల్పడకుండా పూర్తిగా చట్టబద్ధతతో ఉంటే తమ భూములనే హైడ్రా దౌర్జన్యంగా లాక్కుంటున్నదంటున్నారు.
హైడ్రా చేపట్టిన ఆరు చెరువుల అభివృద్ధిలో సున్నం చెరువు కూడా ఒకటి. అయితే ఈ చెరువుకు సంబంధించిన ఎఫ్టీఎల్, బఫర్ నిర్ణయం జరగకపోయినా హైడ్రా అభివృద్ధి పనులు చేపట్టింది. హైకోర్టుకు చెరువునే అభివృద్ధి చేస్తున్నామంటూ చెప్పి సియేట్కాలనీ వాసుల భూములు, ఇళ్లపై బుల్డోజర్ దింపింది. దీంతో ఆ ప్రాంతమంతా తవ్వకాలు, ఫెన్సింగ్‌లతో కనిపిస్తుంది. హైడ్రా చేస్తున్న ఈ పనులపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. నలభై ఏళ్లుగా తాము ఇక్కడ భూమి కొనుగోలు చేసి తమ భూములను కాపాడుకుంటున్న తరుణంలో తమకు రక్షణ కల్పించాల్సిన ప్రభుత్వమే భూములను కబ్జా చేయాలని చూస్తున్నదని సియేట్ కాలనీ వాసులు ఆరోపిస్తున్నారు.
గత సంవత్సరం కాలంగా తాము కంటికి కునుకు లేకుండా ఎప్పుడేం జరుగుతుందో తెలియకుండా తమ భూములను కాపాడుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నామని, తమ సొంత భూములను కబ్జా చేసేందుకు వస్తున్న ప్రభుత్వ సంస్థలతో పోరాటానికి న్యాయస్థానాలను ఆశ్రయించామని సియేట్కాలనీ వాసులు చెబుతున్నారు. తాము ఈ ప్రాంతవాసులమేనని ఇన్నేళ్లుగా ఇక్కడ ఉంటున్నా హైడ్రా కమిషనర్ రంగనాథ్ మాత్రం తమను సున్నంచెరువు నివాసితులుగా గుర్తించలేదని ఇందులో రెండురకాలుగా వ్యవహరించారని వారు చెప్పారు.
గతంలో హైడ్రా బుల్డోజర్లు తమ భూముల్లోకి వచ్చి ఇళ్లు కూలగొట్టినప్పుడు తాము హైడ్రాపై కోర్టుకు వెళ్లామని, ఆ సమయంలో తమను కార్యాలయానికి పిలిచిన రంగనాథ్ తమను మాట్లాడనీయకుండా స్థలానికి స్థలమిస్తామని, టీడీఆర్‌లు తీసుకోవాలని చెప్పి తమ బాధ వినకుండానే పంపించారని, ఒకవేళ ఎవరైనా మాట్లాడుతామంటే వారి వెనుక సిబ్బందిని పెట్టి భుజాలు పట్టుకుని కూర్చోబెట్టారని వారు వాపోయారు. తమ భూములు వదిలే ప్రసక్తే లేదని చెప్పినప్పటినుంచి తమపై దౌర్జన్యంగా వ్యవహరించడం, తమ భూముల్లోకి రావడం చేస్తున్నారనేది వారి వాదన. అసలు సున్నంచెరువు విస్తీర్ణం తెలియకుండా, హద్దులు తెలియకుండా హైడ్రా సిబ్బంది చేస్తున్న దౌర్జన్యాలపై సియేట్ కాలనీవాసులు విమర్శిస్తున్నారు.
ఎన్నిసార్లు తాము వారికి చెప్పినా అసలు స్పందనే లేదని, సంబంధిత డాక్యుమెంట్లు చూపిస్తే అవి తమకు పనికిరావంటూ ఏదో చెబుతున్నారని అంటున్నారు. తాము ఉద్యోగాల్లో ఉన్నప్పుడు కూడబెట్టుకున్న డబ్బులతో కొనుక్కున్న భూములను లాక్కోవాలని సర్కారే చూస్తుంటే భూములను రక్షించుకునే ప్రయత్నంలో అనారోగ్యంపాలయ్యామని, ఈ రకమైన నియంతృత్వ ధోరణి ఎంతవరకు కరెక్ట్ అని సియేట్కాలనీకి చెందిన రిటైర్డ్ ఉద్యోగి, ఎన్నారై శివశంకర్ ఆవేదన వ్యక్తం చేశారు. హైడ్రా రంగనాథ్ చెబుతున్న మాటలకు చేస్తున్న పనులకు ఎక్కడా పొంతనలేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి వ్యవహారం తన 85ఏళ్ల జీవితంలో ఎక్కడా చూడలేదంటూ ఆయన కన్నీటిపర్యంతమయ్యారు. కొద్దిరోజుల క్రితం హైడ్రాలో పనిచేసిన ఓ ఇరిగేషన్ ఇంజినీర్ సున్నంచెరువు విషయంలో హైడ్రా కమిషనర్‌ను తప్పుదోవ పట్టించారన్నారు.
సియేట్కాలనీలో తమ ప్లాట్లలో హైడ్రా సిబ్బంది ఎవరో కొందరు రావడం, తమను బెదిరించడం, తవ్వకాలు చేస్తూ తాము ఆపితే ఆగి మీ సంగతి చెబుతామంటూ బెదిరించిన తీరును సియేట్కాలనీ వాసులు కోర్టుకు సమర్పించారు. వారం రోజుల క్రితం తమ భూముల్లోకి తన సిబ్బందితో కలిసి వచ్చిన ఓ పోలీస్ అధికారి తాను హైడ్రా అధికారినని చెప్పి ఇక్కడ తవ్వకాలు జరుగుతాయి.. మీరు వెంటనే వెళ్లిపోవాలి.. లేకుంటే బలవంతంగా పంపిస్తామని చెప్పడంతో సియేట్ కాలనీ వాసులు అడ్డుకున్నారు. తమకు కోర్టు ఉత్తర్వులు ఉన్నాయని చెప్పినప్పుడు ఆ అధికారి అయితే మాపై కోర్టు ఉల్లంఘన కేసు వేసుకోండంటూ నిర్లక్ష్యంగా మాట్లాడిన వీడియో సాక్ష్యాలను సియేట్ ప్రతినిధులు కోర్టుకు సమర్పించారు.
దీనిపై న్యాయమూర్తి తీవ్ర ఆగ్రహంవ్యక్తం చేస్తూ అధికారి వ్యవహరించిన తీరు, మాట్లాడిన విధానాన్ని తప్పుబట్టారు. అంతేకాకుండా ఇరుపక్షాలు శాంతిభద్రతలకు భంగం కలిగించవద్దంటూ ఉత్తర్వులు ఇచ్చి ఈనెల 26కు కేసు వాయిదా వేశారు. అయితే తమ భూముల్లోకి వస్తున్నారంటూ హైడ్రా సిబ్బందిపై పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేయాలన్నా వారు కనీసం దరఖాస్తు తీసుకోవడానికి కూడా నిరాకరిస్తున్నారని, కోర్టు ఉత్తర్వులు చూపించినా స్పందించడం లేదని సియేట్ ప్రతినిధులు అంటున్నారు.