సిటీబ్యూరో, సెప్టెంబర్ 17(నమస్తే తెలంగాణ): కేసీఆర్ ప్రభుత్వ హయాంలో మాకు నెలవారీ జీతాలు కరెక్ట్‌గా వచ్చేవి. ఒకవేళ సరైన సమయానికి రాకపోతే అధికారులు కాంట్రాక్టర్లతో మాట్లాడి మాకు జీతాలు వేయించేవారు. కానీ ఇప్పుడు అసలు జీతాలే లేదంటూ హైడ్రా డిజాస్టర్ మేనేజ్మెంట్ టీమ్ ఆవేదన వ్యక్తం చేసింది. బుధవారం హైడ్రా డిజాస్టర్ మేనేజ్మెంట్ టీమ్ ఒక్కసారిగా మెరుపు సమ్మెకు దిగింది. తమకు జీతాలు తగ్గించి పొట్టకొడుతున్నారంటూ సుమారు 1100 మంది ఉద్యోగులు బుధవారం ఉదయం నెక్లస్‌రోడ్డు బుద్ధభవన్ వద్ద హైడ్రా కార్యాలయం ముందు విధులు బహిష్కరించి ఆందోళనకు దిగారు. జీతంలో ఐదువేలు కట్చేశారంటూ ఆందోళనకు దిగారు.
తమకు న్యాయం జరగకపోతే విదులకు హాజరుకామని హెచ్చరికలు జారీ చేశారు. దీంతో హైడ్రా అత్యవసర సేవలు ఎక్కడికక్కడ స్తంభించిపోయాయి. గత ప్రభుత్వ హయాంలో సరైన సమయానికే జీతాలు వచ్చేవని హైడ్రా సిబ్బంది చెప్పారు. కరోనా సమయంలో, వరదలు వచ్చినప్పుడు తాము చేసిన పనులకు ప్రభుత్వం మాకు సరైన గుర్తింపునిచ్చేదని సిబ్బంది చెప్పారు. ఐపీఎస్ అధికారి విశ్వజిత్ కంపాటి తమను సరిగా చూసుకునే వారని, కేటీఆర్ మా జీతాల విషయంలో సరిగ్గా ఇవ్వాలని చెప్పేవారని చెప్పారు. కానీ హైడ్రాపేరు మార్చుకుని ఈ ప్రభుత్వం హయాంలోకి వచ్చిన తర్వాత మాకు గుర్తింపు లేదు, మా ప్రాణాలకు విలువలేదంటూ వారు ఆవేదన వ్యక్తం చేశారు.
గత ప్రభుత్వంలో మేము ఈవీడీఎంలో పనిచేసేవాళ్లం. ప్రతీనెలా 3వతేదీ ఏది ఏమైనా తమ జీతాలు తమకు వచ్చేవని, ఒకవేళ శాలరీలు క్రెడిట్ కాకపోతే వాళ్ల కాంట్రాక్టర్లతో మాట్లాడి జీతాలు ఇచ్చేవారు. కేటీఆర్ హయాంలో చాలా బాగుండేది. మా కుటుంబాలను వదిలేసి ఇక్కడకు వచ్చాం. కానీ ఇప్పుడు జీతాలు తగ్గించడమే కాకుండా, మా పిల్లలు ఆకలి ఆకలి అంటూ వీడియోలు చేసి పెట్టే పరిస్థితి తెచ్చారు.
హైడ్రాలో పనిచేస్తున్నప్పటికీ మా ప్రాణాలకు హామీ లేదు. ఎస్ఎల్బీసీ టన్నెల్ రెస్క్యూ ఆపరేషన్‌లో పాల్గొన్నాం. లోపలకు ఏ పెద్ద ఆఫీసర్ పోలేదు. మేం మాత్రమే పోయాం. పధ్నాలుగు కిలోమీటర్లు పోయినం. మాకు ఎలాంటి ఇన్సూరెన్స్ లేదు. ఒకానొక సందర్భంలో ఆక్సిజన్ కట్ అయింది. అప్పుడు ప్రాణాలు పోతే మాకు గ్యారెంటీ లేదు. హైడ్రాకుమంచిపేరు ఉంది. కానీ మాకు లేదు.
వెయ్యికోసం రెండువేల కోసం అడుక్కతింటున్నాం. కమిషనర్ సార్ అంటే గౌరవం. జీతం తక్కువైందని రాత్రంతా ఏడ్చాం. నెలకు ఏడువేల రూపాయలు ఇంటి కిరాయి ఎలా కట్టాలి. జీతం తక్కువైందని మేం ఎట్ల తినాలని అడిగితే అధికారులు ఎవరూ ఏం మాట్లాడతలేరు. ఇద్దరు పిల్లలతో ఎలా బతకాలి. ఈఎంఐలు ఎలా కట్టాలి. నెలజీతం ఐదువేలు తగ్గితే ఏం చేయాలి.
హైడ్రా ఔట్సోర్సింగ్ సిబ్బంది తమ కార్యాలయం ముందు ఆందోళనకు దిగితే కవర్ చేస్తున్న మీడియా ప్రతినిధుల పట్ల అసభ్యంగా మాట్లాడిన హైడ్రా అధికారుల తీరును మీడియా ప్రతినిధులు తీవ్రంగా ఖండించారు. వాడు వీడు అంటూ తూలనాడిన ఆ అధికారి చాలా హేళనగా మాట్లాడడంపై హైడ్రా అధికారిక వాట్సాప్ గ్రూపులో జర్నలిస్టులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అవసరానికి ఒకలా.. అవసరం తీరాక మరోలా వ్యవహరించిన అధికారి విషయంలో హైడ్రా కమిషనర్ కనీసం స్పందించకపోవడంపై వారు మండిపడుతున్నారు. గ్రూపులో ఇంత పెద్దఎత్తున చర్చ జరుగుతుంటే కమిషనర్‌గానీ, ఆ అధికారి కానీ కనీసం స్పందించకపోవడం గమనార్హం. ఇదేమీడియా లేకపోతే హైడ్రా తన భావాలు వ్యక్తం చేసేదాఅంటూ వారు ప్రశ్నిస్తున్నారు.
హైడ్రాలో ఔట్సోర్సింగ్ ద్వారా పనిచేస్తున్న ఉద్యోగుల జీతాలు తగ్గడం లేదని హైడ్రా ఒక ప్రకటన విడుదల చేసింది. ఇటీవల ప్రభుత్వం విడుదల చేసిన జీవో 1272 ప్రకారం జీహెచ్ఎంసీని ఈవీడీఎం ద్వారా హైడ్రాకు సమకూరిన ఉద్యోగుల జీతాలు రాష్ట్రంలోని వేరే డిపార్ట్మెంట్స్లో పనిచేస్తున్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల వేతనాలకు సమానంగా సవరించడం జరిగిందని వారు పేర్కొన్నారు.
ఈ విషయాన్ని హైడ్రా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లిందని, ఆ వ్యత్యాసం మొత్తాన్ని జీహెచ్ఎంసీ నుంచి గ్రాంట్‌గా అందజేయాలని ప్రభుత్వం సూచించిందని తెలిపారు. ఆ మ్యాచింగ్ ఫండ్తోతో మొత్తం జీతం చెల్లించడానికిహైడ్రా ప్రయత్నం చేసిందని, కానీ మ్యాచింగ్ ఫండ్ రావడం ఆలస్యం కావడంతో జీతాల్లో వ్యత్యాసాన్ని సర్దుబాటు చేయలేకపోయారని పేర్కొన్నారు. స్టాండింగ్ కమిటీ ఆమోదం తర్వాత మ్యాచింగ్ ఫండ్ విడుదల చేస్తామని జీహెచ్ఎంసీ తెలిపిందని, మ్యాచింగ్ గ్రాంట్ రిలీజ్ కాగానే సర్దుబాటు చేస్తామని హైడ్రా ఆ ప్రకటనలో స్పష్టం చేసింది.