HYDRA | ఇప్పటి వరకు నగరంతో పాటు శివారు ప్రాంతాల్లో కూల్చివేతల వ్యవహారంపై ప్రభుత్వానికి హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ మానిటరింగ్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (HYDRA) ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. శనివారం నాటికి 18 ప్రాంతాల్లో కూల్చివేతలు నిర్వహించినట్లు నివేదికలో పేర్కొన్నది. ఈ క్రమంలో 43.94 ఎకరాల ఆక్రమిత భూమిని తిరిగి స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొంది. టాలీవుడ్ నటుడు నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్‌ను సైతం కూల్చివేసినట్లు తెలిపింది.
కూల్చివేతల జాబితాలో ప్రొ కబడ్డీ లీగ్ ఓనర్ అనుపమ భవనం, కావేరి సీడ్స్ యజమాని భాస్కర్‌రావు నిర్మాణాలు ఉన్నాయని చెప్పింది. అలాగే, మంథనికి చెందిన బీజేపీ నేత సునీల్‌రెడ్డి నిర్మాణాన్ని కూల్చివేశామని చెప్పింది. ఎంఐఎం ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు ఆక్రమించిన 12 ఎకరాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపింది. బహదూర్‌పురా ఎమ్మెల్యే మహ్మద్ ముబీన్‌కు చెందిన ఐదంతస్తుల భవనం, ఎంఐఎం మహ్మద్ మీర్జా భవనాన్ని కూల్చివేసినట్లు హైడ్రా తన నివేదికలో వెల్లడించింది. నందగిరి హిల్స్‌లోని ఎమ్మెల్యే దానం మద్దతుదారుడి భవనం, చింతల్ బీఆర్ఎస్ నేత రత్నాకరం సాయిరాజు షెడ్డు, కాంగ్రెస్ నేత పళ్లంరాజు సోదరుడి నిర్మాణం కూల్చివేసినట్లు చెప్పింది.