అసలు మూసీతో తమకేం సంబంధమని, మూసీ పరీవాహక ప్రాంతాల్లోని కాలనీల్లో సర్వే, మార్కింగ్ జరుగుతున్న సమయంలో స్థానికులు వ్యతిరేకిస్తుంటే.., అది తమది కాదని, హైడ్రాకు సర్వేకు సంబంధం లేదని ఒక్క ప్రకటన కూడా కమిషనర్ చేయకపోవడంపై ఆసక్తికరమైన ఉద్యోగుల్లో చర్చ జరుగుతోంది. మొన్న ప్రెస్మీట్లో కూడామూసీ వ్యవహారంపై తామే అంతా అన్నట్లుగా వ్యవహరించిన కమిషనర్.. ఇప్పటికైనా దూకుడు తగ్గిస్తారా? అంటూ మాట్లాడుకుంటున్నారు.
HYDRAA | సిటీబ్యూరో, సెప్టెంబర్ 30(నమస్తే తెలంగాణ): గ్రేటర్లో కలకలం సృష్టిస్తున్న హైడ్రా కూల్చివేతల వ్యవహారంలో కమిషనర్ రంగనాథ్ దూకుడు ధోరణి పట్ల హైడ్రా టీమ్‌లోనే అంతర్గతంగా చర్చ జరుగుతోంది. హైడ్రా కూల్చివేతలపై న్యాయస్థానం ప్రశ్నలకు రంగనాథ్‌తో పాటు ఇతర అధికారులిచ్చిన సమాధానాల పట్ల హైడ్రా బృందంలో చర్చ మొదలైంది. అసలు ఎఫ్టీఎల్ పరిధి విషయంలో స్పష్టమైన వైఖరి లేకపోవడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందని ఉద్యోగులు మాట్లాడుకుంటున్నారు.
సామాన్యుడి ఇల్లు కూల్చివేసే సమయంలో జాగ్రత్తలు తీసుకోకపోవడంతో పాటు హడావిడిగా వ్యవహరించడం వల్లే ప్రజల్లో వ్యతిరేకత మూటగట్టుకున్నామని హైడ్రా సిబ్బంది అనుకుంటున్నారు. చెరువుల ఎఫ్టీఎల్ను నిర్ధారించే పద్ధతిలో తేడాలున్నాయనే చర్చ కూడా జరిగింది. ప్రధానంగా కోర్టులో హైడ్రాకు చుక్కెదురైన నేపథ్యంలో అమీన్పూర్ తహసీల్దార్, కలెక్టర్, హైడ్రా కమిషనర్, ఇలా అందరు ప్రభుత్వ ఉద్యోగులే టార్గెట్ అవుతున్నారని, అసలు ఈ వ్యవహారాన్ని తెరపైకి తెచ్చి హైడ్రాను ఇంతగా ప్రోత్సహించిన సీఎం, మంత్రులు మాత్రం స్టేట్మెంట్స్ తప్ప ఎక్కడా చిక్కడం లేదని వారు చర్చించుకుంటున్నారు. మొదట్లో హైడ్రా టీమ్‌లో పనంటే ఉత్సాహంగా వచ్చినా ఇప్పుడు మాత్రం కొంచెం భయమవుతున్నదని ఓ కానిస్టేబుల్ మరొకరితో చెప్పుకుంటూ బాధపడుతున్నారు.
అన్ని చెరువులకు ఫుల్ట్యాంక్ లెవల్ నిర్ధారణ అయ్యిందా? లేక ఏదో ఒక అంచనా.. ప్రకారం, ఇళ్లను తొలగిస్తున్నారా? ఇంత ఉధృతిగా పోతే తమకు నష్టం జరగదా? తమ ఉద్యోగాలకు ఎక్కడ ముప్పు వాటిల్లుతుందోనని హైడ్రా అధికారులు భయపడుతున్నారు. ఒకవైపు తహసీల్దార్లు, ఇరిగేషన్, మున్సిపల్ శాఖ ఉద్యోగులు తమ పై అధికారులతో మాట్లాడలేక ఇవే ప్రశ్నలు వేసుకుంటున్నారట. ఎక్కడైనా వరదలకు కారణమైన ఇళ్లను తొలగించాలి.
కానీ, నోటీసులు ఇచ్చి ఇళ్లను ఖాళీ చేయించాల్సింది పోయి ఇళ్లను కూలగొట్టి.., అవి కమర్షియల్ అని సమర్ధించుకునే ప్రయత్నం చేయడం సరికాదని హైడ్రా సిబ్బందే అభిప్రాయపడుతున్నారు. కొందరు తహసీల్దార్లైతే తామేం చేయాలో తెలియక కమిషనర్ అడిగినదానికి తమ అభిప్రాయం కాకుండా ఆయన కోరుకున్నదే చెబుతున్నారని మాట్లాడుకుంటున్నారు. జీహెచ్ఎంసీ పరిధిలోని చెరువులు, కుంటలకు సంబంధించి రికార్డులను ఒకసారి పునః పరిశీలించుకొని నిర్ణయించుకుందామని చెప్పినా కూడా పెద్దగా రెస్పాన్స్ లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి.