సిటీబ్యూరో/ఖైరతాబాద్, ఏప్రిల్ 25(నమస్తే తెలంగాణ) : పేదల సొంతిటి కలలను రాత్రికి రాత్రికి కూల్చివేసిన హైడ్రా బుల్డోజర్లు, కాంగ్రెస్ నేతల అక్రమ నిర్మాణాలకు కాపలా కాస్తున్నాయి. బ్యాంకు లోన్లతో సామాన్యులు కట్టుకున్న ఇండ్లను నేలమట్టం చేయడంలో చూసి అత్యుత్సాహం, అధికార పార్టీ నేతల కబ్జాలను అడ్డుకోవడానికి వెనుకడుగు వేస్తోంది. బోడుప్పల్ ప్రాంతంలో కాంగ్రెస్ నేత తోటకూర జంగయ్య యాదవ్, ఆయన అనుచరులతో చేస్తున్న భూ దౌర్జన్యాలపై వికాస్ నగర్ కాలనీ బాధితులు వెల్లడించారు. శనివారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్ వేదికగా, తమ ప్లాట్లను ఆక్రమిస్తున్న కాంగ్రెస్ నేతలపై ఎందుకు ప్రతాపం చూపడంలేదని బాధితులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
మేడిపల్లి మండలం బోడుప్పల్ సర్వే నంబర్ 85లోని ఆరు ఎకరాల భూమిలో 1981లోనే యాజమాని లిం గమ్మ లే అవుట్ చేసి 69 ప్లాట్లను విక్రయించనప్పుడు కొనుగోలు చేసి రిజిస్టర్ చేసుకున్నారు. అప్పటి నుంచి మోఖాలో ఉన్నారు. 14ఏళ్ల తర్వాత లిం గమ్మ భర్త, రాంరెడ్డి మొదటి భార్య కొడుకులం అంటూ జనార్దన్‌రెడ్డి, బుచ్చిరెడ్డి అనే వ్యక్తులు వచ్చిన ఈ ప్లాట్లలో 3.20 ఎకరాలకు యజమానులమంటూ పేర్కొన్నారు. దీంతో తమ ప్లాట్లను విడిచిపెట్టాలని ప్రతి ప్లాట్ ఓనర్ నుంచి రూ. 5వేల చొప్పున ఇవ్వగా… ఇప్పటివరకు రాలేదు. మళ్లీ పదేళ్ల తర్వాత స్థానికంగా ఉండే కాంగ్రెస్ నేత తోటకూర జంగయ్య అనే వ్యక్తి వచ్చి మరోసారి ప్లాట్లపై వివాదాన్నితెరపైకి తీసుకువచ్చారు.
జనార్దన్‌రెడ్డితో కుమ్మ క్కై 2007లో పూర్వపు తేదీతో భాగస్వామ్య డీడ్ ద్వారా ఈ ప్లాట్లను పంచుకున్నట్లుగా తప్పుడు పత్రాలను సృష్టించాడన్నారు. జనార్దన్‌రెడ్డికి ఈ ప్లాట్లను అమ్ముకునే హక్కు లేకున్నా, జంగయ్య యాదవ్ తనకున్న పలుకుబడితో 30 ప్లాట్లను తన పేరిట రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని బాధితులు వివరించారు. 2008లో మిగిలిన ప్లాట్లను సైతం సొంతం చేసుకునేందుకు కోర్టులో కేసు వేశారని, అంతేకాకుండా ఈ భూమిని వ్యవసాయ భూమిగా చూపిస్తూ తన కుటుంబ సభ్యుల పేర్లపై బదిలీ చేసి మోసపూరిత రిజిస్ట్రేషన్ చేశారని ఆరోపించారు. ఈ కేసులను కోర్టు కొట్టివేసిందన్నారు.
ప్లాట్లకు గోడ… బౌన్సర్లతో కాపలా
తాజాగా ఆరు ఎకరాల భూమిలో ప్లాంటేషన్‌తో పాటు ప్రీ కాస్ట్ గోడలను నిర్మించాడని, ప్లాట్ల యజమానులు తమ భూముల వద్దకు రాకుండా ఉండేందుకు బౌనర్సర్లు, రౌడీలు, కుక్కలను కాపలాగా పెట్టాడన్నారు. అక్రమ నిర్మాణాలపై హైడ్రాకు ఫిర్యాదు చేస్తే వచ్చిన అధికారులు వచ్చి చూసి వెళ్లిపోయారే తప్ప.. రెండోసారి సమావేశం ఏర్పాటు చేస్తాన్నారు. నెలలు గడుస్తున్నా… ఇంతవరకు ఇటువైపు కన్నెత్తి చూడం లేదన్నారు. తోటకూర జంగయ్య యా దవ్, అతని కుటుంబ సభ్యులు, తమపై దాడులు చేస్తున్నారన్నారు.
హైడ్రా నీడలో అక్రమార్కులు
తోటకూర జంగయ్యపై గతంలోనూ అనేక భూ కబ్జా ఆరోపణలు ఉన్నా యి. కానీ కాంగ్రెస్ పార్టీలో ఆయన కీలక హోదాలో ఉండటంతోనే ఆయన కు హైడ్రా నీడనిస్తున్నదని బాధితులు ఆరోపించారు. పేదల ఇండ్లపైకి తెల్లవారక ముందే దూసుకువచ్చే బుల్డోజర్లు, కాంగ్రెస్ నేతలు బౌన్సర్లతో దౌర్జన్యం చేస్తున్నా ఎందుకు తమ భూములకు రక్షణ కల్పించడం లేదన్నారు. ప్రభు త్వం తన తప్పును సరిదిద్దుకోవాల్సింది పోయి, కబ్జాదారులకు అండగా నిలుస్తుందన్నారు. హైడ్రా ఆ అక్రమ నిర్మాణాలను కూల్చివేసి, తమకు న్యాయం చేయాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు. ఈ సమావేశంలో మల్లారెడ్డి, లక్ష్మినారాయణ, లాలయ్యతోపాటు పలువురు బాధితులు పాల్గొన్నారు.