శేరిలింగంపల్లి, మే 6: గచ్చిబౌలిలోని సంధ్య కన్వెన్షన్ ప్రాంతంలోని ఫెర్టిలైజర్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎంప్లాయీస్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ లేఅవుట్లో వెలిసిన అక్రమ కట్టడాలపై హైడ్రా అధికారులు కొరడా ఝులిపించారు. లేఅవుట్ రోడ్స్, పార్క్‌ను కలుపుతూ వెలిసిన పలు ఆక్రమణలు, అనుమతులు లేని కట్టడాలను హైడ్రా అధికారులు నేలమట్టం చేశారు. కొంతమంది లేఅవుట్ రోడ్లను ఆక్రమించి నిర్మాణాలను చేపట్టారని..దీంతో లేఅవుట్లో తమ ప్లాట్లు కనిపించకుండా పోయాయని ఆయా ప్లాట్ల యజమానులు ఇటీవల హైడ్రాకు ఫిర్యాదు చేశారు.
దీంతో రంగంలోకి దిగిన హైడ్రా లేఅవుట్‌ను పరిశీలించి పలు అక్రమ నిర్మాణాలను గుర్తించింది. మంగళవారం లేవుట్‌లో అక్రమంగా నిర్మించిన సంధ్య కన్వెన్షన్ మినీహాల్తో పాటు వంటగదులు, రెస్ట్‌రూమ్‌లను హిటాచీ యంత్రాలతో హైడ్రా అధికారులు నేలమట్టం చేశారు. లేఅవుట్‌ను ఆక్రమించి నిర్మించిన రేకుల ఫెన్సింగ్‌ను కూడా పూర్తిగా తొలగించారు. జీప్లస్-2 గా నిర్మించిన 3 ఐరన్ షెడ్లను నేలమట్టం చేశారు.