అంబర్‌పేట బతుకమ్మకుంట ప్రాంతంలో బుధవారం హైటెన్షన్ వాతావరణం నెలకొంది. బతుకమ్మ కుంట ఆక్రమణకు గురైందన్న ఫిర్యాదులతో హైడ్రా బృందం పర్యటించడంతో స్థానికులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. పైగా చెరువు చుట్టుపక్కల ప్రాంతంలో భారీగా పోలీసులను మోహరించడంతో తమ ఇండ్లను కూల్చివేస్తారేమోనన్న భయంతో స్థానికులు తీవ్ర ఆందోళనలకు గురయ్యారు. తమ ఇండ్లను కూల్చవద్దంటూ నిరసన తెలిపారు. ఇండ్ల జోలికి రాకుండా చెరువును సుందరీకరించాలంటూ డిమాండ్ చేశారు. ఒక దశలో కమిషనర్ రంగనాథ్‌ను స్థానికులు చుట్టుముట్టి తమ ఇండ్ల విషయంలో నిలదీశారు. అయితే ‘చెరువును పునరుద్ధరిస్తాం తప్ప..ఇండ్లను కూల్చేదే లేదం’టూ కమిషనర్ చెప్పినా.. స్థానికుల్లో భయం మాత్రం పోలేదు.
-సిటీబ్యూరో/అంబర్‌పేట/ఉస్మానియా యూనివర్సిటీ, నవంబర్ 13(నమస్తే తెలంగాణ)
బతుకమ్మకుంట చెరువులో చెత్త, నిర్మాణ వ్యర్థాలు పోయడంతో చెరువు ఆనవాళ్లు కోల్పోయిందని, ముందు చెరువు పునరుద్ధరించడమే తమ లక్ష్యమని హైడ్రా కమిషనర్ రంగనాథ్ పేర్కొన్నారు. హైడ్రాకు నోటీసులు ఇచ్చే అధికారముందని, ఆక్రమణదారులకు హైడ్రా నోటీసులు వెళ్తూనే ఉంటాయన్నారు. బుధవారం అంబర్‌పేటలోని బతుకమ్మకుంటను జీహెచ్ఎంసీ , అంబర్‌పేట రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులతో కలిసి రంగనాథ్ సందర్శించారు. బతుకమ్మకుంట చెరువును పరిశీలించిన కమిషనర్..5.15 ఎకరాల స్థలాన్ని చదును చేసే పనులను క్షేత్రస్థాయిలో పర్యవేక్షించారు. అయితే బతుకమ్మకుంటకు హైడ్రా బృందం వస్తుందన్న సమాచారంతో స్థానికులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు.
తమ ఇండ్లు కూల్చేస్తారేమోనన్న భయంతో రెండు నెలలుగా కంటిమీద కునుకు లేకుండా ఉంటున్నామని వీకర్ సెక్షన్ కాలనీవాసులు, స్థానికులు కమిషనర్‌కు చెప్పారు. హైడ్రా బృందం వస్తుందంటేనే కూల్చివేతలు జరుగుతాయన్న భయంతో ఉన్న స్థానికులు కమిషనర్‌ను తమ ఇండ్ల విషయంపై ప్రశ్నించారు. ఒకవైపు స్థానికులకు నచ్చచెప్పే దిశగా తాము ఇప్పుడున్న ఇండ్ల జోలికే వెళ్లమని, ప్రస్తుతం ఉన్న ఖాళీ స్థలాన్ని చదును చేసి చెరువును పునరుద్ధరిస్తామని రంగనాథ్ వారికి చెప్పారు. బతుకమ్మకుంటలో కూల్చివేతలు ఉండవని, కూల్చివేతలు చేపడతామనే అపోహ తొలగించేందుకే తాను బతుకమ్మకుంటకు వచ్చానని రంగనాథ్ చెప్పారు. చెరువులోకి నీరు వచ్చే మార్గాలపై అధికారులతో చర్చిస్తామని, ప్రస్తుతం ఉన్న ఐదు ఎకరాల స్థలంలోనే చెరువును పునరుద్ధరిస్తామన్నారు. చెరువును మరో రెండు నెలల్లో సుందరీకరిస్తామన్నారు.
సర్వే నంబర్ 563లో..
సర్వే నంబర్ 563లో 1962-63 లెక్కల ప్రకారం మొత్తం 14.06 ఎకరాల విస్తీర్ణంలో బతుకమ్మ చెరువు ఉండేదని, బఫర్‌జోన్‌తో కలిపి మొత్తం వైశాల్యం 16.13 ఎకరాల విస్తీర్ణంగా సర్వే అధికారులు తేల్చినట్లు రంగనాథ్ తెలిపారు. స్థానికులు కొందరు తమ వద్ద ఉన్న మ్యాపులు చూపించబోతే తాను ఆ మ్యాపులన్నీ పరిశీలించి, లీగల్, రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులతో మాట్లాడిన తర్వాతే బతుకమ్మకుంటకు వచ్చానని, చెరువును ప్రస్తుతం ఉన్న 5.15 ఎకరాల భూమిలోనే పునరుద్ధరిస్తామని చెప్పారు. ప్రస్తుతం అక్కడ నివాసముంటున్న వారికి ఎలాంటి ముప్పు లేకుండా చెరువు తవ్వాలంటూ అధికారులకు సూచించారు. ఒకప్పటి ఎర్రకుంటనే కాలక్రమంలో బతుకమ్మకుంటగా మారిందని స్థానికులు చెప్పడంతో పాటు రెవెన్యూ రికార్డులు కూడా ఇవే చెబుతున్నాయని రంగనాథ్ స్థానికులతో అన్నారు. బతుకమ్మకుంటలో జేసీబీతో వెంటనే పనులు మొదలు పెట్టాలని అధికారులకు చెప్పగా, వారు జేసీబీలను తెప్పించి ఖాళీ స్థలంలో పెరిగిన పిచ్చిమొక్కలు, నిర్మాణ వ్యర్థాలు, చెత్తాచెదారాన్ని తొలగించే పనులు ప్రారంభించారు. కమిషనర్ రంగనాథ్ వెంట డిప్యూటీ కమిషనర్ సుధ, డిప్యూటీ సిటీ ప్లానర్ రాంరెడ్డి, అంబర్‌పేట సర్కిల్ డీసీ మారుతీ దివాకర్, తహసీల్దార్ వీరాభాయి, టౌన్ ప్లానింగ్ ఏసీపీ సుమిత్రలతో పాటు ఇరిగేషన్ విభాగం అధికారులు ఉన్నారు.
ఉదయం నుంచే హైటెన్షన్..
ఉదయం నుంచి అంబర్‌పేట బతుకమ్మకుంట ప్రాంతంలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. బతుకమ్మ కుంట ఆక్రమణకు గురైందన్న ఫిర్యాదులతో హైడ్రా బృందం పర్యటించింది. ఈ నేపథ్యంలో చెరువు చుట్టుపక్కల ప్రాంతంలో భారీగా పోలీసులను మోహరించారు. తమ ఇండ్లను కూల్చివేస్తారేమోనన్న భయంతో స్థానికులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు. తమ ఇండ్లను కూల్చవద్దంటూ నిరసన వ్యక్తం చేశారు. ‘చెరువును పునరుద్ధరిస్తాం తప్ప..ఇండ్లను కూల్చేదే లేదం’టూ చెప్పిన కమిషనర్..కేవలం అరగంటలోపే అక్కడి నుంచి వెళ్లిపోయారు.
తార్నాకలో ఎర్రకుంట సందర్శన
తార్నాకలోని ఎర్రకుంట చెరువును హైడ్రాకమిషనర్ రంగనాథ్ సందర్శించారు. ఎలాంటి వివాదాలు లేని ఎర్రకుంట చెరువును పునరుద్ధరించాలంటూ నాగార్జున కాలనీ సంక్షేమ సంఘం హైడ్రాను కోరింది. 5.9 ఎకరాల్లో విస్తరించిన చెరువును పునరుద్ధరించి.. సుందరీకరిస్తే దుర్వాసన, దోమల బెడద తప్పుతుందని వారు రంగనాథ్‌కు చెప్పారు. స్థానికుల విజ్ఞప్తి మేరకు ఎర్రకుంట చెరువును పరిశీలించి.. పునరుద్ధరణకు చర్యలు తీసుకోవాలంటూ అధికారులను రంగనాథ్ ఆదేశించారు.