సిటీబ్యూరో, జూన్ 10(నమస్తే తెలంగాణ): గ్రేటర్ హైదరాబాద్‌లో వర్షాకాలం ముంపు సమస్యను పరిష్కరించే కీలక బాధ్యతలను ప్రభుత్వం హైడ్రాకు కట్టబెట్టింది. ఇప్పటికే ఓఆర్ఆర్లోపల డిజాస్టర్ మేనేజ్మెంట్కు సంబంధించిన పనులను చేపట్టిన హైడ్రాకు తాజాగా వర్షాకాలం బాధ్యతలు అప్పగించినట్లుగా హైడ్రా చెబుతోంది. నగరంలో మొత్తం 300 ప్రాంతాల్లో వరదనీరు నిలుస్తున్నదని, నగరంలో వరద ముంపు పరిస్థితులు ఉంటాయి కాబట్టి వర్షాకాలంలో మాత్రమే పరిష్కారం బాధ్యతని హైడ్రా తీసుకుంటుందని హైడ్రా కమిషనర్ రంగనాథ్ చెప్పారు.
వర్షాకాలంలో చేయాల్సిన పనులను హైడ్రా చేస్తుందని, వర్షాకాలం ముందు చేయాల్సిన నాలాల పూడికతీత, చెత్తతొలగించడం వంటి పనులను జీహెచ్ఎంసీ చేస్తుందని ఆయన తెలిపారు. నగరంలోని నాలాల పూడికతీత, వరదముంపు సమస్యల పరిష్కార బాధ్యతలను హైడ్రాకు అప్పగిస్తూ ప్రభు త్వం జీఓ ఇచ్చిన నేపథ్యంలో బుల్కాపూర్ నాలాతో పాటు పలు నాలాల వద్ద ఆక్రమణలతోపాటు వరదనీటి ప్రవాహతీరును రంగనాథ్ పరిశీలించారు. ముఖ్యంగా నాలాల ఆక్రమణల తీరుపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రేటర్‌లోని ముఖ్యమైన నాలాలు ఒకవైపు పూర్తిగా ఆక్రమణలకు గురికావడంతో వరదనీరు సులువు గా ప్రవహించడానికి అవకాశం లేకపోవడాన్ని గ మనించారు.
హైడ్రా కంట్రోల్లో జీహెచ్ఎంసీ మాన్సూన్టీమ్స్..!
జీహెచ్ఎంసీలో ఉన్న మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్స్‌ను హైడ్రాకు అప్పగించారు. గతంలో ఈ టీమ్స్‌పై పర్యవేక్షణ ఉండేది కాదని, వరదనీరు చెరువులు, నాలాల్లోకి మళ్లించే వ్యవస్థ సరిగ్గా లేనందున వరదనీరు నిలిచే ప్రాంతాల్లో ప్రత్యేక కార్యాచరణ రూపొందించినట్లు హైడ్రా కమిషనర్ రంగనాథ్ తెలిపారు. హైడ్రా వద్ద 30 బృందాలు ఉండగా ప్రభుత్వం ఇచ్చిన జీఓ ప్రకారం జీహెచ్ఎంసీ 140 బృందాలు కూడా హైడ్రాతో కలిసి పనిచేయాలని, ట్రాఫిక్ నుంచి మరో 20 టీమ్స్ తమతో కలిసి పనిచేస్తాయని హైడ్రా అధికారులు చెప్పారు. నగరంలో ఎక్కడ వరదనీరు నిలిచినా.. ఎక్కడైనా విపత్తు ఏర్పడినా వెంటనే స్పందించేందుకు ఈ బృందాలను సిద్ధం చేస్తున్నారు. నాలా ల పూడికతీత పనులు వర్షాకాలానికి ముందే పూర్తిచేయాల్సి ఉండగా ఇప్పటివరకు పనులు పూర్తికాకపోగా ముఖ్యమైన నాలాల్లోనే చెత్త పేరుకుపో యి ఉండడం ఏంటని సిబ్బందిని ఆయన ప్రశ్నించారు.
ఈ నేపథ్యంలో నగరంలో ప్రధానమైన నాలాలను గుర్తించి వాటిలో వరదనీరు సాఫీగా పోయేందుకు కావలసిన పనులను వెంటనే పూర్తిచేసేలా జీహెచ్ఎంసీ ముఖ్య అధికారులతో చర్చిస్తారని హైడ్రా అధికారులు తెలిపారు. జూన్ చివరి వారంలోగా నాలాల పూడికతీత పనులు పూర్తి చేయాలని జీహెచ్ఎంసీ సిబ్బందిని హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఆదేశించారు.
నాలా విస్తరణ పనులు వేగంగా చేపట్టండి
సిటీబ్యూరో, జూన్ 10(నమస్తే తెలంగాణ): నాలా విస్తరణ పనులు వేగంగా జరగాలని, ఈ నెలాఖరులోగా సాధ్యమైనంతమేరకు పూర్తిచేయడంతోపాటు నాలాల్లో పేరుకుపోయిన చెత్తను తొలగిస్తే కొంతమేర వరదముప్పు నుంచి బయటపడే అవకాశముంటుందని హైడ్రా కమిషనర్ రంగనాథ్ అన్నారు. బేగంపేటలోని ప్యాట్నీ, ప్రకాశ్‌నగర్ మెట్రో, చింతలబస్తీ వద్ద బుల్కాపూర్ నాలాల విస్తరణ పనులను మంగళవారం కంటోన్మెంట్ సీఈవో మధుకర్‌నాయక్, హైడ్రా, ఇరిగేషన్, ట్రాఫిక్ అధికారులతో కలిసి ఆయన పరిశీలించారు. అనంతరం శంకరపల్లిలోని బుల్కాపూర్, కొంపల్లి, పుప్పాలగూడ, మణికొండ, దర్గా, షేక్‌పేట, మెహదీపట్నం, బంజారాహిల్స్ రోడ్డు నంబర్ 12 మీదుగా చింతలబస్తీలోకి ప్రవేశించి.. హుస్సేన్‌సాగర్‌లో కలిసే బుల్కాపూర్ నాలాను పరిశీలించారు.