“మొన్నటివరకు చెరువులు, కుంటల పరిరక్షణకే పరిమితమైన హైడ్రా నేడు క్రమంగా ఫైర్ సేఫ్టీని సైతం తన ఆధీనంలోకి తెచ్చుకునే ప్రయత్నం చేస్తుంది. గ్రేటర్ పరిధిలో 15 మీటర్ల ఎత్తులోపు ఉన్న కమర్షియల్ భవనాలు, ప్రైవేట్ ఆసుపత్రులకు ఫైర్ సేఫ్టీ అనుమతులు జారీ చేసేందుకు సిద్ధమైంది. ఫైర్ సేఫ్టీలో భాగంగా నో ఆబ్జెక్షన్ సర్టిఫికెట్(ఎన్ఓసీ)కావాలంటే ఇకనుంచి హైడ్రానే సంప్రదించాలి. ఇప్పటివరకు ఫైర్ సేఫ్టీ అధికారులు, వైద్యాధికారుల పర్యవేక్షణలో సాగిన ప్రైవేట్ ఆసుపత్రుల కార్యకలాపాలు నెమ్మదిగా హైడ్రా చేతిలోకి వెళుతున్నాయి. గ్రేటర్‌కు గుండెకాయ లాంటి వైద్యవిభాగంలో హైడ్రా జోక్యం మూలంగా వైద్యశాఖ తన అస్థిత్వాన్ని కోల్పోయే ప్రమాదం ఉంది”.
సిటీబ్యూరో, జూన్17, (నమస్తే తెలంగాణ): ఇప్పటివరకు గ్రేటర్ వ్యాప్తంగా ఉన్న ప్రైవేట్ ఆసుపత్రుల వాళ్లు అనుమతులు కావాలంటే జీహెచ్ఎంసీ, జిల్లా వైద్యాధికారులను కలిసి అనుమతి కోసం కావాల్సిన పత్రాలు సమర్పించేవారు. బిల్డింగ్, ఫైర్ సేఫ్టీ, క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ ప్రకారం అందించాల్సిన వైద్యసేవల పై జిల్లా వైద్యాధికారులు పర్యవేక్షించి అనుమతులను అందించేవారు.
అనుమతులు లేకుండా వైద్యంచేసినా, ఆ దవాఖానల్లో కనీస వైద్యసదుపాయాలు కరువైనా కూడా డీఎంహెచ్ఓకు చర్యలు తీసుకుని జరిమానా, ఆసుపత్రి సీజ్ చేసేందుకు పూర్తిస్థాయి అధికారాలు ఉండేవి. ప్రస్తుతం హైడ్రా రావడం మూలంగా ఏ విధమైన చర్యలు తీసుకుంటారనేది అస్పష్టంగా ఉంది. ఎన్ఓసీ అనుమతులిచ్చిన హైడ్రానే చర్యలు తీసుకుంటే ఆరోగ్యశాఖ అధికారులు డమ్మీగా మారాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.
ఇప్పటికే గ్రేటర్ వ్యాప్తంగా 478పైగా ప్రైవేట్ ఆసుపత్రులు 15 మీటర్లలోపు ఎత్తు ఉన్నట్లు వైద్యాధికారులు గుర్తించారు. అవన్నీ కూడా ఫైర్ సేఫ్టీ ఎన్ఓసీ కోసం హైడ్రాను సంప్రదించాలని ఇప్పటికే నోటీసులు సైతం జారీ చేశారు. ఎన్ఓసీ అనుమతులకోసం హైడ్రాకు దరఖాస్తు చేసుకుంటే హైడ్రా సిబ్బంది ఎన్ఓసీ ఇచ్చేందుకు క్షేత్రస్థాయిలో పరిశీలించి అనుమతులివ్వనున్నారు. ఆసుపత్రుల అనుమతుల విషయంలో ఎలాంటి అనుభవం లేని హైడ్రా ఏవిధంగా ఎన్ఓసీ ఇస్తుందనే విషయం అంతుచిక్కడం లేదు.
ప్రైవేట్ ఆసుపత్రుల్లో రోగుల భద్రత, ఇన్ఫెక్షన్ కంట్రోల్, ఔషద నిర్వహణ, ఆక్సిజన్ సరఫరా,సిబ్బంది అర్హతలను పర్యవేక్షించే పూర్తి బాధ్యత జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారులకుంటుంది. హైడ్రా వైద్యశాఖలో జోక్యం చేసుకోవడం మూలంగా ఔషద నిర్వహణ, బయోమెడికల్ వ్యర్థాలు, సిబ్బంది పర్యవేక్షణ నీరుగారిపోతుంది. కేవలం హైడ్రా ఎన్ఓసీ ఒక్కటుంటే చాలు మిగతా అనుమతులు అవసరం లేదన్న పరిస్థితికి ఆసుపత్రులు చేరుతాయి.
బస్తీ దవాఖానలు కూడానా…?
హైడ్రా అనాలోచిత నిర్ణయం వల్ల వైద్యశాఖ పూర్తిస్థాయిలో నిర్వీర్యమవుతుంది. భవిష్యత్తులో 15మీటర్లలోపు ఉన్నవాటిలో బస్తీ దవాఖానలు సైతం ఎన్ఓసీలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేస్తే సగానికిపైగా దవాఖానలు మూసేయాల్సి ఉంటుంది. గ్రేటర్‌లోని ఏ ఒక్క బస్తీ దవాఖానలో ఫైర్ సేఫ్టీ ఉన్న దాఖలాలు లేవు. హైడ్రా జారీ చేసే హుకుం మాలంగా ప్రభుత్వ వైద్యాధికారులు ఇరకాటంలో పడే అవకాశం నెలకొంటుంది. హైడ్రా జారీ చేసే ఎన్ఓసీలు సకాలంలో ఇవ్వకపోతే మిగతా అనుమతులు ఇచ్చేందుకు జిల్లా వైద్యశాఖ కూడా ముందుకురాదు.