వరద ముప్పు తీర్చడానికి హైడ్రా వచ్చింది. వర్షం ఎక్కడ పడుతుందో ఒకరోజు ముందే తెలుసుకుని అక్కడికి వెళ్లి రోడ్లపై నీళ్లు నిలవకుండా, ట్రాఫిక్ అంతరాయం కలగకుండా చూసుకుంటుంది. వరదల్లో చిక్కుకున్న వారిని రక్షించేందుకు ప్రణాళికలు చేస్తుంది. నగరంలో వరద ముప్పు తప్పిస్తుంది. హైడ్రా పోలీస్ స్టేషన్ ప్రారంభోత్సవంలో హైడ్రాను సీఎం రేవంత్‌రెడ్డి ఆకాశానికెత్తిన తీరిది. దీనికి తోడు జీహెచ్ఎంసీ అధికారాలను కుదించి మరీ హైడ్రాకు ప్రత్యేక పనులు కట్టబెట్టింది రాష్ట్ర సర్కార్.
కట్ చేస్తే.. వానాకాలం ప్రారంభమైన రెండు, మూడు వారాలకే వర్షాలకు రోడ్లపై చేరిన నీరు, గంటల తరబడి ట్రాఫిక్ జామ్‌తో వాహనదారుల అవస్థలు, లోతట్టు ప్రాంతాల్లో వరద విలయతాండవం, వరదలో చిక్కుకున్నవారి ఆర్తనాదాలతో నగరం అల్లాడిపోయింది. ఇలాంటి క్షిష్ట పరిస్థితులలో అండగా ఉండాల్సిన హైడ్రా చేతులెత్తేయడంతో.. హైడ్రా నీవెక్కడ? అని నగర ప్రజలు ప్రశ్నిస్తున్నారు.
నగరంలో వరద నీటి నిర్వహణ, నియంత్రణ అత్యంత దారుణంగా ఉందనడానికి బల్దియా, సైబరాబాద్ పోలీసులు చేపట్టిన చర్యలే నిదర్శనంలా మారుతున్నాయి. ఇటీవల కురిసిన భారీ వానలతో ఫ్లైఓవర్లపై వరద నీరు నిలిచి రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో నగరంలోని హైటెక్‌సిటీ ప్రాంతంలో ఫ్లైఓవర్‌కు బల్దియా, పోలీసు సిబ్బంది యంత్రాలతో రంధ్రాలు వేస్తున్న దృశ్యం
HYDRAA | సిటీబ్యూరో, ఆగస్ట్ 9 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్‌ను కాపాడడానికి హైడ్రాను తీసుకొచ్చామంటూ అవకాశం దొరికినప్పుడల్లా హైడ్రా గురించి సీఎం రేవంత్‌రెడ్డి ఎంతో గొప్పగా చెప్పారు. హైడ్రా లేకపోతే హైదరాబాదే లేదన్న బిల్డప్ ఇచ్చారు. కానీ ఆ మాటలన్నీ వర్షాకాలం మధ్యలోనే నీటిమూటలయ్యాయి. హైడ్రాను నమ్ముకుని ఇతర శాఖలను నిర్లక్ష్యం చేసిన పాలకులకు నిరాశే మిగిలింది. అసలు వరద నివారణకు సంబంధించి హైడ్రాకు ముందుచూపే లేదనడానికి తాజాగా హైడ్రా పిలిచిన డీవాటరింగ్ పంపుల టెండర్ల వ్యవహారమే నిదర్శనం. భారీ వర్షాలతో రెండు నెలల నుంచి నగరం అతలాకుతలం అవుతుంటే ఇప్పుడు హైడ్రా నిద్రలేచి తన సామగ్రిని సమకూర్చుకుంటోంది. తాజాగా డీవాటరింగ్ పంపులకు టెండర్లు పిలిచింది.
డీవాటరింగ్ పంపులకు టెండర్లు..!
ప్రతీ ఏడాది సిటీలో వర్షాలు పడినప్పుడు వర్షం వలన నిలువ ఉండే నీళ్లను తొలగించడానికి డీవాటరింగ్ పంపులను వాడుతారు. దీనికోసం ప్రభుత్వం ముందస్తుగానే అంటే.. మే, జూన్ మాసాల్లోనే ఏర్పాట్లు చేసుకుంటుంది. కానీ గత రెండునెలలుగా హైదరాబాద్‌ను వర్షాలు అతలాకుతలం చేస్తున్నా.. వారం రోజులుగా నగరంలో వరద బీభత్సం సృష్టిస్తుంటే హైడ్రా ఇప్పుడే నిద్ర లేచింది. వర్షాకాలం మొదలైన రెండునెలలకు అంటే ఇప్పుడు తాజాగా 25 హెచ్‌పీ, 12 హెచ్‌పీ డీవాటరింగ్ పంపులకు టెండర్లు పిలిచింది. ఈనెల 8న టెండర్లు పిలిచి ఈనెల 13తో చివరితేదీగా నిర్ణయించారు.
అదేరోజు టెక్నికల్ ఎవాల్యూయేషన్, ఫైనాన్షియల్ బిడ్ ఓపెనింగ్ కూడా నిర్వహించనుంది. జూన్‌లో పిలవాల్సిన టెండర్లను వర్షాకాలం మధ్యకు వచ్చిన తర్వాత పిలవడం, అవికూడా పూర్తయి చేతికి రావడానికి మరో నెలరోజులు పట్టే అవకాశమున్నందున ఈ టెండర్లతో ఈ సీజన్లో ఉపయోగముంటుందా అనే అనుమానం హైడ్రా అధికారులనుంచే వ్యక్తమవుతోంది. వర్షాలను, వరదలను ఎలా హ్యాండిల్ చేయాలో తెలియని హైడ్రా చేతిలో నగరాన్ని పెట్టడం వల్లే ఈ సమస్య ఉత్పన్నమైందని మెజార్టీ అధికారుల వాదన.
హైడ్రాపై నీవెక్కడ? అంటున్న నగరవాసులు
జూన్ రెండవ వారంలో మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్‌ల బాధ్యత తమదే అంటూ హైడ్రా కమిషనర్ ప్రకటించారు. తమ దగ్గరున్న 51 డీఆర్ఎఫ్ బృందాలతో వరద ముప్పు లేకుండా చేస్తామని ప్రకటించింది. వర్షాకాలంలో వరద లేకుండా చేస్తామంటూ బీరాలు పలికిన హైడ్రా కమిషనర్ రంగనాథ్.. నగరాన్ని నీటముంచారంటూ నగరవాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదివరకు నగరంలో ప్రతి గంటకు వరదలపై బల్దియా, ప్రభుత్వ స్పందన కనిపించేది.. కానీ ఈసారి హైడ్రాకు వరద నివారణ అధికారాలు అప్పగించగా.. వరద ముంపును నివారించలేక హైడ్రా పూర్తిగా చేతులెత్తేసింది.
ప్రధానంగా వరద ముప్పునుంచి భాగ్యనగరాన్ని తప్పించడానికి ముందస్తు ప్రణాళికలు చేయడంలో పూర్తిగా విఫలమైంది. దీంతో హైడ్రాపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. వరద నివారణ చర్యలు, రెయిన్ అలర్ట్స్ విషయంలో ఐఎండీ, మున్సిపల్, ఇరిగేషన్, ట్రాఫిక్ విభాగాలతో సమావేశాల మీద సమావేశాలు పెట్టి హైడ్రా కార్యాలయంలో గంటల తరబడి చర్చలు జరిపి మీడియాలో ప్రచారం చేసుకున్న హైడ్రాకు వరద ముంపు నుంచి నగరాన్ని కాపాడే విషయంలో ప్రణాళికే లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు నగరప్రజలు. ముఖ్యంగా గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు సిటీ మొత్తం వరదలో చిక్కుకుపోవడంపై నెటిజన్లు, నగరవాసులు హైడ్రాపై మండిపడుతున్నారు. హైడ్రా నీవెక్కడ? అని ప్రశ్నిస్తున్నారు.