స్థలం కబ్జాకు గురవుతున్నదని.. కాలనీ వాసులు హైడ్రాకు మొరపెట్టుకుంటే అది ఎంత విలువ ఉంటుందంటూ ప్రశ్నించారో అధికారి. కోటి రూపాయల వరకు ఉండొచ్చు అని కాలనీవాసులు చెబితే అంతేనా.. చూద్దాంలే.. టైం ఉన్నప్పుడు వచ్చి చేద్దామని సమాధానం ఇచ్చారు. ఇలా రెండు నెలలుగా హైడ్రా అధికారి వారికి టైం ఇవ్వడం లేదు.. ఒకవేళ ఎప్పుడైనా మాట్లాడితే.. అదేమైనా కోట్ల విలువైన భూమా..వెంటనే వచ్చి చేయడానికి.. కొంచెం ఆగండి..అంటూ వాయిదాలు వేయడం కొసమెరుపు.
సిటీబ్యూరో, సెప్టెంబర్ 4 (నమస్తే తెలంగాణ): మా ప్రాంతంలో పార్కు స్థలం కబ్జాకు గురవుతున్నది సార్ పట్టించుకోండి.. అంటూ హైడ్రాకు మొరపెట్టుకుంటే అది ఎంత విలువ ఉంటుందంటూ అధికారి ప్రశ్న. కోటి రూపాయల వరకు ఉండొచ్చు అని కాలనీవాసులు చెబితే అంతేనా.. అయితే చూద్దాంలే.. టైం ఉన్నప్పుడు వచ్చి చేద్దాం. అని సమాధానం. ఇలా రెండునెలలుగా హైడ్రా అధికారి వారికి టైమ్ ఇవ్వడం లేదు సరికదా.. ఒకవేళ ఎప్పుడైనా మాట్లాడితే అదేమైనా కోట్లకోట్ల విలువైన భూమా..వెంటనే వచ్చి చేయడానికి.. కొంచెమాగండి.. ఇప్పుడే రావాలంటే ఎలా.. అలాకుదరదు. చూద్దాం. టైంను బట్టి వస్తాం.. రేపు కాల్ చేయండి. ఇలా ప్రతీరోజూ ఆ అధికారి చెప్పడం, కాలనీ వాసులు ఫోన్లు చేయడం, ఆ రోజు కాదు మరోరోజంటూ వాయిదాపెట్టడం.. ఎటూ తిరిగి ఇప్పటివరకు ఆసైట్కు రాలేదు. అక్కడ ఏం జరుగుతుందో కనీసం చూడని కూడా చూడలేదు. ఇది ప్రభుత్వభూములు, పార్కులు కాపాడుతున్నామంటూ గొప్పలు చెప్పుకొంటున్న హైడ్రా పనితీరు ఇది.
మేడ్చల్‌లోని శ్రీనివాసనగర్ కాలనీలో సర్వేనెంబర్ 74లో ఉన్న పార్క్ స్థలం కబ్జాకు గురవుతున్నదంటూ కాలనీ వాసులు జూలై 6న హైడ్రా కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. ఆ సమయంలో కమిషనర్ లేకపోవడంతో అడిషనల్ కమిషనర్ వీరి ఫిర్యాదును తీసుకుని తగిన చర్యలు తీసుకుంటామంటూ వారికి చెప్పి పంపించారు. ఆ తర్వాత ఒక ఇన్స్పెక్టర్కు ఈ పార్క్‌కు సంబంధించిన ఫిర్యాదును క్షేత్రస్థాయిలో పరిశీలించి చర్యలు తీసుకోమని ఉన్నతాధికారులు చెప్పారు. కానీ ఆ ఇన్స్పెక్టర్ మాత్రం ఆ ప్రాంతంలోకి రావడానికి ఎప్పటికప్పుడు వాయిదాలు వేస్తూ చివరకు ఆ ప్రాంతంలోకి రావాలంటే అది ఎంత విలువకలిగిన భూమి, అందులో ఏముందని ఆరా.. రెండు వందల గజాల భూమి కబ్జా చేయడానికి స్థానిక కాంగ్రెస్ నేత సహకారంతో ఒక వ్యక్తి ప్రయత్నించారు.
దీనిపై స్థానికులు మేడ్చల్ కమిషనర్‌కు గతంలో ఫిర్యాదు చేయగా, మున్సిపాలిటీ వారు బోర్డు పెట్టారు. కానీ ఆ వ్యక్తి ఆ బోర్డు తొలగించి మున్సిపాలిటీలో మేనేజ్ చేసుకునే ప్రయత్నం చేశారు. జీహెచ్ఎంసీలో విలీనం తర్వాత మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటుతో అక్కడి అధికారికి కూడా ఫిర్యాదు చేశారు. అయినప్పటికీ వాళ్లు పట్టించుకోకపోవడంతో ఆ స్థలాన్ని కాపాడుకోవడానికి కాలనీవాసులే సీరియస్‌గా అడుగులేస్తున్నారు. హైడ్రాకు ఫిర్యాదు చేసి వారి సహకారంతో కాలనీకి సంబంధించిన పార్కును కాపాడుకోవాలని ప్రయత్నించారు. కానీ హైడ్రా తీరు మాత్రం పైనపటారం లోనలొటారం అన్నట్లుగా ఉంది.
ఏదైనా పెద్ద ల్యాండ్ ఉండే చెప్పండి కానీ ఈ చిన్న పార్కు గురించి చెప్పి మా టైమ్ వేస్ట్ చేయొద్దంటూ అధికారులు చెప్పడంతో కాలనీ ప్రతినిధులు కంగుతిన్నారు. తమ దగ్గర ఉన్న 200 గజాల పార్కుకు సంబంధించిన పూర్తి పత్రాలను హైడ్రాకు ఇచ్చినా వారు మాత్రం ఇంతే స్థలమా అంటూ రేపు వస్తాం.. మాపు వస్తాం.. అంటూ వాయిదాలు పెడుతూ కాలం వెళ్లదీస్తున్నారు. ఇంతకూ అసలు సంగతేంటని కాలనీవాసులు ఆరా తీస్తే అసలు నిజం బయటకు వచ్చింది. మీడియాలో, సోషల్‌మీడియాలో కబ్జాలు జరగనిచ్చేది లేదని బాకా కొడుతూ తమ కార్యక్రమాలను హైలైట్ చేస్తున్న హైడ్రాకు పేదలు కనిపించరనేది హైడ్రా ఏర్పడిన మొదటి రోజు నుంచి వారి కూల్చివేతలు, కబ్జాల అడ్డుకోలు వ్యవహారాలు చూస్తే తెలుస్తుంది.
ఇదే సమయంలో పైకి మాత్రం కబ్జాలు ఆపుతున్నామంటూ ప్రకటనలతో, ప్రాయోజిత కార్యక్రమాలతో హడావుడి చేస్తున్న కమిషనర్ రంగనాథ్ మాత్రం ఇటువంటి చిన్నచిన్న కబ్జాలను మాత్రం పెద్దగా పట్టించుకోకపోగా తన అధికారులకు కూడా అనధికారికంగా పెద్ద విలువ ఉన్న భూములే చూడండంటూ సంకేతాలిస్తున్నట్లు హైడ్రా అధికారి ఒకరు చెప్పారు. దీంతో వారు వందలు, వేల కోట్ల విలువ చేసే భూములే టార్గెట్‌గా నగరంలో తిరుగుతున్నారు తప్ప చిన్నచిన్న వాటిని పెద్దగా పట్టించుకోవడం లేదు. ఎప్పుడో ఒకసారి తాము ఏదో చేస్తున్నామని చెప్పడానికి ఒకట్రెండు చిన్న కబ్జాలు అడ్డుకుంటున్నారని, అసలు సమస్యలు ఉన్నవారి విషయంలో హైడ్రా తీరు చాలా దారుణంగా ఉందని కాలనీ అసోసియేషన్ ప్రతినిధులు చెప్పారు.
తాము ఎన్నిసార్లు వెంటపడ్డా ఆ ఇన్స్పెక్టర్ మాత్రం రావడం లేదని, రెండురోజుల క్రితం కూడా పండుగ వరకు పూర్తి చేస్తానని చెప్పి మళ్లీ ఫోన్లో చూద్దామంటూ వాయిదా వేస్తున్నారంటూ అసోసియేషన్ సభ్యులు మండిపడుతున్నారు. ఈ విషయంలో నమస్తే తెలంగాణ హైడ్రా ఇన్స్పెక్టర్ను వాట్సాప్‌లో సంప్రదించే ప్రయత్నం చేసింది. తనకు ఏం గుర్తుకు రావడం లేదని మెసేజ్ చేసిన ఆ ఇన్స్పెక్టర్ తీరా మళ్లీ డాక్యుమెంట్లన్నీ పంపిన తర్వాత ఉలుకూపలుకూ లేకుండానే ఉన్నారు. కనీసం అసోసియేషన్ ప్రతినిధుల దగ్గరకు వచ్చి క్షేత్రస్థాయిలో విచారణ చేసి పార్కు కబ్జా విషయం తేల్చాల్సిన అధికారులు బయటబయటనే ఏమైనా సెటిల్ చేసుకుంటున్నారా అంటూ హైడ్రా సిబ్బందిపై స్థానికంగా గుసగుసలు వినిపిస్తున్నాయి. అసలు ఈ పార్కు విషయంలో చిన్నది, పెద్దదనే తేడాలు చూపించే హైడ్రా బయటకు మాత్రం కబ్జాలను ఆపుతున్నామంటూ ఎందుకు ప్రగల్బాలు పలుకుతుందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.