సిటీబ్యూరో, ఫిబ్రవరి 8 (నమస్తే తెలంగాణ): రంగారెడ్డి జిల్లా తుక్కుగూడ మున్సిపాలిటీ పరిధిలోని సూరం చెరువులో శనివారం హైడ్రా కూల్చివేతలు చేపట్టింది. అక్రమంగా అనుమతులు లేకుండా చేపట్టిన నిర్మాణాలను కూల్చివేశారు. మాంఖల్ పరిధిలోని 139,140 సర్వే నెంబర్లలో అక్రమంగా నిర్మించారంటూ ప్రహారిని, రేకులషెడ్డును హైడ్రా అధికారులు మున్సిపల్ సిబ్బందితో కలిసి జెసిబితో తొలగించారు. సూరన్ చెరువు మొత్తం విస్తీర్ణం 60 ఎకరాలు కాగా దాదాపు 15 ఎకరాలు స్థానికంగా లేఔట్లు చేస్తున్నవారు కబ్జా చేశారని హైడ్రా తెలిపింది. చెరువులోకి జరిగి చుట్టూ ప్రహారీ నిర్మించారని, డ్రైనేజి పైప్లైన్లు కూడా వేశారని రంగనాథ్ తెలిపారు.
ఎఫ్టిఎల్ పరిధిలో ఫ్రీకాస్ట్‌తో నిర్మించిన కాంపౌండ్‌వాల్, చుట్టూ ఉన్న పరిస్థితులను స్థానికుల ఫిర్యాదు మేరకు శుక్రవారం రంగనాథ్ క్షేత్రస్తాయిలో పరిశీలించారు. దీంతో పాటు కొత్త కుంటకు వెళ్లే ఫీడర్చానల్ను మూసేయడంతో అక్కడ ఉన్న అడ్డంకిని తొలగించారు.ఇదిలా ఉంటే హైడ్రా ప్రజావాణికి చెరువు ఆక్రమణలపై వచ్చిన ఫిర్యాదు మేరకు హైడ్రా బృందం మూడురోజుల కిందట నోటీసులు ఇచ్చారు. దీనిపై వారిదగ్గరున్న డాక్యుమెంట్స్ తీసుకురావాలని, ఆక్రమణలపై క్లారిటీ ఇవ్వాలని కోరారు. కానీ ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వకపోగా.. వెంచర్ దగ్గర వర్టెక్స్ కెఎల్ఆర్ గిగా పేరుతో బోర్డ్ పెట్టి వెంచర్ చేసి ప్లాట్లు అమ్ముతున్నారు. హైడ్రా నోటీసులు ఇవ్వగానే ఆ బోర్డు తొలగించి ప్లాట్ల ఓనర్ల పేరుతో వాల్‌రైటింగ్స్ రాయించారు.
వాస్తవానికి ఈ లేఅవుట్ శ్రీశైలం రాష్ట్రరహదారిని అనుసరించి ఉంటుంది. ప్రచారం కోసం మొన్నటివరకు రహదారికి కనిపించేలా లేఅవుట్ ముందు వర్టెక్స్ కెఎల్ఆర్ గిగా అనే యూనిపోల్ ఉండేది. ఈ నేపథ్యంలో ఈ వెంచర్ వాళ్లే సూరం చెరువుతో పాటు దాని ఎగువన కొత్త కుంట వరకు ఉన్న ఫీడర్ చానల్‌ను కూడా కలుపుకుని ప్లాట్లు చేశారు. హైడ్రా ప్రజావాణిలో తుర్కగూడకు చెందిన స్థానికులు కమిషనర్‌కు చెరువు ఆక్రమణలపై ఫిర్యాదు చేశారు. దీంతో రంగనాథ్ క్షేత్రస్థాయి పర్యటన చేసి చెరువులో ఆక్రమణలు నిజమే అని తేల్చారు. గతంలో ఈ వెంచర్ ఉన్న స్థలం మహేశ్వరం కాంగ్రెస్ నియోజకవర్గ ఇంచార్జి కెఎల్ఆర్ది కావడం గమనార్హం.
హైడ్రా ఏర్పాటు తర్వాత పత్రికల్లో వచ్చిన కథనాల నేపథ్యంలో కెఎల్ఆర్ వివరణ ఇచ్చారు. తాను తొలుత చేసిన లేఅవుట్లో చెరువుకు సంబంధించిన భూమి లేదని, తాను వర్టెక్స్ వారికి విక్రయించిన తర్వాత విస్తరణలో భాగంగా సదరు వర్టెక్స్ కంపెనీ వాళ్లు చెరువు భూమిని ఆక్రమించి వెంచర్ చేపట్టారని అప్పట్లోనే మహేశ్వరం కాంగ్రెస్ నియోజకవర్గ ఇంచార్జి కెఎల్ఆర్ ప్రకటించారు. ఇప్పుడు హైడ్రా యాక్షన్‌కు దిగగానే సదరు ప్లాట్ల ఓనర్లు తమకు న్యాయం చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు హైడ్రా అధికారులు చెరువులలోకి చొచ్చుకొచ్చిన ఆక్రమణలను తొలగిస్తామని చెబుతున్నారు.