మాదాపూర్: మాదాపూర్ సున్నం చెరువులో హైడ్రా కూల్చివేతలతో రెండు నెలలుగా కరెంట్ లేక స్థానిక బాధితులు తీవ్ర ఇబ్బందులకు గురువుతున్నారు. బాధితులు చిన్న పిల్లలతో రాత్రివేళల్లో బిక్కుబిక్కుమంటూ జీవనం సాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో సోమవారం ‘నమస్తే’లో అక్కడి పరిస్థితులను వివరిస్తూ.. ‘బతుకంతా చీకటైంది’ పేరిట కథనం రాగా, ట్రాన్స్ కో అధికారులు స్పందించారు. ఏడీఈ మల్లేషం, ఏఈ సత్యనారాయణ సిబ్బందితో కలిసి సున్నం చెరువును సందర్శించి.. కరెంట్ స్తంభాలను పరిశీలించిన అనంతరం బాధితులతో మాట్లాడారు.
హైడ్రా కూల్చివేతల అనంతరం సున్నం చెరువుకు రెండు నెలల నుంచి కరెంట్ లేకపోవడంతో బాధితులు కోర్టును ఆశ్రయించగా, న్యాయస్థానం నుంచి వచ్చిన ఆర్టర్ కాపీని తమకు అందించమని ఏడీఈ మల్లేషం బాధితులను కోరారు. పై స్థాయి అధికారులకు సున్నం చెరువు పరిస్థితులపై నివేదిక పంపి సమస్యలను పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటామని ఏడీఈ మల్లేషం బాధితులతో చెప్పారు. బాధితులు వారి వద్ద ఉన్న పత్రాలను ఏడీఈ మల్లేషంకు చూపించగా, ‘విద్యుత్ సమస్యను త్వరలోనే పరిష్కరించేందుకు మా వంతు ప్రయత్నం చేస్తాం’ అని చెప్పినప్పటికీ కరెంట్ విషయంలో భరోసాను ఇవ్వకపోవడంతో బాధితులు అసహనం వ్యక్తం చేశారు.