‘ముందస్తు సమాచారం ఇవ్వలే.. బుల్డోజర్లతో బలం చూపిండ్రు.. గుడిసెలను గుల్లగుల్ల చేసిండ్రు..సామాన్లన్నీ ఆగమాగం అయినయ్..నిల్వనీడలేక..రోడ్డు మీద పడ్డం..నిద్ర లేదు.. నీళ్లు లేవు.. ఎంతటి కష్టం వచ్చినా.. ఇక్కడే ఉంటాం.. మాకు వేరే దారి లేదు.. ఎక్కడికి వెళ్లినా..వేలల్లో అద్దెలు.. ఇంట్లో వారందరం కష్టపడితే వచ్చేది అంతంత మాత్రమే…మా స్వగ్రామానికి వెళ్దామంటే అక్కడ ఏ పని దొరకదు.. వంటలు వండుకుందామంటే సామాన్లు కూడా ధ్వంసమయ్యాయి…మా గుడిసెలు కూల్చి..రేవంత్ సర్కారు మా బతుకులను ఆగం చేసింది..
సున్నం చెరువు వద్ద హైడ్రా గుడిసెల కూల్చివేతలతో నిల్వనీడ కోల్పోయిన నిరుపేద కూలీల ఆవేదన ఇది. పొట్టకూటి కోసం వలసవచ్చి.. జీవనం సాగిస్తున్న వారి బతుకులు చెల్లాచెదురయ్యాయి. ఉండేందుకు నీడ లేకపోవడంతో దిక్కుతోచని స్థితిలో గుడిసెలు కూల్చిన చోటే.. ఉంటూ.. దుస్తులు అడ్డంగా పెట్టి.. వంటలు చేసుకుంటూ..పిల్లల ఆకలి తీర్చుతున్న దృశ్యాలు స్థానికుల హృదయాలను పిండేస్తున్నది. గుడిసెవాసుల్లో సీఎం సొంత నియోజకవర్గమైన కొండగల్ కూలీలే అధిక సంఖ్యలో ఉండగా, వారంతా ఇప్పుడు రేవంత్‌పై దుమ్మెత్తిపోస్తున్నారు. తమకు తలదాచుకునేందుకు సర్కారే దారి చూపాలని వేడుకుంటున్నారు.
– సిటీబ్యూరో/మాదాపూర్, సెప్టెంబర్ 11
మాదాపూర్‌లోని సున్నం చెరువులో హైడ్రా గుడిసెలను కూల్చివేసింది. ఉన్నపళంగా నీడ లేకుండా చేయడంతో వలస కూలీలంతా ఎటు వెళ్లాలో తోచక.. తమ పిల్లలతో కంటిమీద కునుకు లేకుండా అక్కడే ఉంటున్నారు. దుస్తులు అడ్డం కట్టుకొని వంటలు వండుకుంటున్నారు. పిల్లలను చూసుకుంటున్నారు. రాత్రంతా నిద్ర లేకపోవడంతో కొంతమంది చిన్నారులు అక్కడే ఏర్పాటు చేసుకున్న గణేశ్ మండపంలో నిద్రపోతూ కనిపించారు.
హైడ్రా అధికారులు కనీసం ముందస్తు సమాచారం ఇచ్చి నాలుగు రోజులైనా సమయం ఇచ్చి ఉంటే..ఎక్కడికైనా వెళ్లి తలదాచుకునేవాళ్లమని బాధితులు ఆవేదనకు గురవుతున్నారు. ‘ఇంటిని అద్దెకు అడిగితే ఒక్కొక్కటీ రూ. 10 నుంచి రూ. 15 వేల వరకు ఉన్నాయి. ఇంట్లో అందరూ కష్టపడితేనే మొత్తం వచ్చే సంపాదన అంతంత మాత్రమే. పిల్లలను చదివించుకుంటూ.. ఎలా బతికేదని’ అంటూ బరువెక్కిన గుండెతో విలపిస్తున్నారు. వారి దుస్థితిని చూసిన స్థానికులు తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు.
రేవంత్ నియోజకవర్గం కొడంగల్‌కు చెందిన కూలీలే అధిక సంఖ్యలో ఉండగా, ‘మా బతుకులు మారుతాయనుకొని రేవంత్‌ను గెలిపించాం.. ఇలా చేస్తాడని అనుకోలే’దంటూ..తమ బాధను వ్యక్తపరుస్తున్నారు. కేసీఆర్ ప్రభుత్వంలో పేదలకు డబుల్ బెడ్రూంలు అయినా ఇచ్చారు. కానీ రేవంత్ సర్కార్ మాత్రం ఉన్న గుడిసెలు కూల్చి.. మమ్మల్నీ రోడ్డున పడేశారని కన్నీరుపెట్టుకున్నారు. తలదాచుకోవడానికి ప్రభుత్వమే ముందుకు వచ్చి తమకు ఏదైనా దారి చూపించాలంటున్నారు. తమకు వచ్చిన కష్టం పగ వారికి కూడా రాకూడదని కోరుకుంటున్నారు.
ప్రజాపాలన పేరిట కాంగ్రెస్ ప్రభుత్వం పేదల నడ్డివిరుస్తోంది. ఆక్రమణల పేరిట బుల్డోజర్లతో వలస కూలీల జీవితాలను ఆగం చేస్తోంది. సున్నం చెరువు కూల్చివేతల అంశంలో హైడ్రా తీరు కంటే.. పేదల విషయంలో కాంగ్రెస్ వ్యవహరించిన విధానం ఆవేదనకు గురిచేస్తున్నది. అడ్డా కూలీలు, పేదలను సడిసప్పుడు లేకుండా తెల్లవారుజామున కూల్చివేతలతో భయభ్రాంతులకు గురి చేసింది. ఉన్నోళ్లకు నోటీసులు ఇచ్చి.. పేదోళ్లకేమో కనీస సమయం ఇవ్వకుండా.. గుడిసెలను నేలమట్టం చేసి.. నిరుపేదల బతుకులను ఆగం చేసిందంటూ..నగరవాసులు కాంగ్రెస్ సర్కార్‌పై మండిపడుతున్నారు.
‘కేసీఆర్ ప్రభుత్వంలో కూలీలకు చేతి నిండా పని ఉండేది. పిల్లలను చదివించుకుంటూ కూలీ పనులు చేసేవాళ్లం. ఇప్పుడున్న పరిస్థితుల్లో పిల్లలను కూడా చదువులు మాన్పించే పరిస్థితి వచ్చింది. సీఎం రేవంత్ మా నియోజకవర్గమే అవ్వడంతో మా బతుకులు మారుతాయని ఓట్లు వేసి గెలిపించాం. కానీ రేవంత్ సర్కార్‌తో పోల్చితే కేసీఆర్ హయాంలోనే పేద ప్రజలు సంతోషంగా ఉన్నారు’ అని రేవంత్ సొంత నియోజకవర్గానికి చెందిన కూలీలు నిట్టూర్చారు.
ఏ ఉద్యోగం లేకపోవడంతో మా ఇల్లు పక్కనే ఉన్న వ్యక్తి పదిరోజుల కిందట అతడి భార్య వద్ద పుస్తెల తాడు కుదవబెట్టి వాటర్ ప్లాంట్ పెట్టుకున్నాడు. అతడికి చాలా అప్పులు ఉన్నాయి. ఉద్యోగం వస్తుందని నమ్మకం లేక.. ఏదైనా వ్యాపారం చేయాలనే ఉద్దేశంతో వాటర్ ప్లాంట్ పెట్టుకున్నాడు. నేను వాచ్‌మెన్‌గా ఉన్న బిల్డింగ్‌కు కూడా నోటీసులు ఇచ్చారు.. వారం రోజుల్లో ఖాళీ చేయాలని.. ప్రస్తుతానికి అందులో ఉన్న నాలుగు కుటుంబాలకు చెందిన యజమానులు తాళాలు వేసి వెళ్లారు.
– గానయ్య, కూలీ
సర్కార్ చేసిన నిర్వాకంతో వంట సామాన్లు మొత్తం ధ్వంసమయ్యాయి. వంట వండుకోవడానికి సామాన్లు లేకపోవడంతో పిల్లలకు కనీసం వంట వండి పెట్టలేని పరిస్థితి. రాత్రంతా ఏడుస్తూనే ఆకలితో పడుకున్నారు. పక్కన వారు వంట వండితే అందులో నుంచి పిల్లలను చూసి కాస్త అన్నం పెట్టగా చాలీచాలినంత దానితో సరిపెట్టుకొన్నాం. రాత్రి సరిగా నిద్రలేక వర్షం పడితే ఏడపడుకోవాలో అర్థం కాక ఎప్పుడు వర్షం వస్తుందో అనే భయంతో ఏమి చేయాలో తోచక కంటిమీద కునుకు లేకుండా అలాగే ఉండిపోయాం.
– లక్ష్మి, కూలీ