హైదరాబాద్: హైదరాబాద్లో మరోసారి బుల్డోజర్లకు హైడ్రా (HYDRA) పనిచెప్పింది. ఘట్కేసర్లో ప్రభుత్వ భూమిని కబ్జాచేసి నిర్మించిన గోడను అధికారులు కూల్చివేశారు. పోచారం మున్సిపాలిటీ పరిధిలోని నారపల్లి దివ్యానగర్లో శనివారం ఉదయం హైడ్రా కూల్చివేతలు చేపట్టింది. లేఅవుట్లలో రహదారికి అడ్డంగా నిర్మించిన నాలుగు కిలోమీటర్ల పొడవైన ప్రహరీ గోడను సిబ్బంది కూల్చివేస్తున్నారు. ఈ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా భారీగా పోలీసులను మోహరించారు.
స్థానికుల ఫిర్యాదు మేరకు ఈ నెల 12న హైడ్రా కమిషనర్ రంగనాథ్.. దివ్యానగర్ లేఅవుట్స్ను పరిశీలించారు. అక్రమ కట్టడాల నిర్మాణంపై ఆరా తీశారు. అధికారులు సర్వే చేసి ప్రభుత్వ స్థలంలో ప్రహరీ నిర్మించారని గుర్తించారు. ఈ నేపథ్యంలో కూల్చివేతలు చేపట్టారు. కాగా, దివ్యా లేఅవుట్ మొత్తం 200 ఎకరాల వరకు విస్తరించి ఉంది. ఇందులో మొత్తం 2218 ప్లాట్లు వేశారు. వీటిలో 30 శాతం నల్లమల్లారెడ్డివేనని ఆరోపణలు ఉన్నాయి.
లేఅవుట్ చూట్టు ఉన్న ప్రహరీని కూల్చివేయడంతో ఏకశిలా లేఅవుట్, వెంకటాద్రి టౌన్షిప్, సుప్రభాత్ వెంచర్-1, 2,3,4, మహేశ్వరి కాలనీ, కచ్చవాణి సింగారం, ఏకశిలా-పీర్జాదిగూడ రోడ్డు, బాలాజీ నగర్, వీజీహెచ్ కాలనీ, ప్రతాప సింగారం రోడ్డు, మేడిపల్లి, పర్వతపురం, చెన్నారెడ్డి కాలనీ, హిల్స్ వ్యూ క్యాలనీ, ముత్తెల్లిగూడ కు మార్గం సుగమమయింది.