ఉరుము లేని పిడుగులా బడుగు జీవుల బతుకులను అధికారులు బజారుకీడ్చారు. అక్రమార్కులను వదిలేసి పొట్టనింపుకోవడానికి అరుగాలం కష్టపడే కష్టజీవులపై కొరడా ఝళిపించారు. రోడ్లపై చిరు వ్యాపారం చేసుకుంటూ.. కుటుంబాలను పోషించుకునే వేలాది మందిపై కక్ష సాధించే విధంగా పొద్దుపొద్దునే బుల్డోజర్లు, జేసీబీలతో.. విరుచుకుపడ్డారు. రోడ్లను ఆక్రమించారనే నెపంతో.. మానవత్వం మరిచి కర్కశంగా వ్యవహరించారు. చిరు వ్యాపారుల జీవితాలను ఆగమాగం చేశారు.
ప్రజాపాలన అంటూ.. చెప్పుకొనే కాంగ్రెస్..మరోసారి తన బుల్డోజర్ మార్క్‌ను చూపించింది. పేదల జీవనోపాధిపై గర్జించింది. కాళ్లావేళ్లా పడ్డా కనికరించలేదు.. తమ జీవనాధారాన్ని ‘నేలమట్టం’ చేయొద్దని వేడుకున్నా.. ‘కష్టం చేసుకొని బతికెటోళ్లం.. మాపైనే మీ ప్రతాపమా.. ఇప్పుడు మేమెలా జీవించేది’.. అంటూ.. బాధితులు కన్నీటిపర్యంతమైనా.. మనసు కరగలేదు. శనివారం నగరంలో ఏకకాలంలో 798 చిరు వ్యాపారుల దుకాణాలను ఫుట్‌పాత్ ఆక్రమణల పేరుతో బల్దియా అధికారులు దమనకాండ సాగించారు. పేదలను రోడ్డు పాలు చేశారు. స్పెషల్ డ్రైవ్ పేరిట వందల సంఖ్యలో చిరు దుకాణాలను కూల్చివేశారు. కష్టపడి పనిచేసుకుంటూ.. జీవిస్తున్న వారిపై దయ చూపాలని బాధితులు దండం పెట్టినా..వినలేదు.. బుల్డోజర్ మోత ఆగలేదు.
నగరంలో మరోసారి రేవంత్‌రెడ్డి బుల్డోజర్లు నిరుపేదల ఉపాధి గూడులపై విరుచుకుపడ్డాయి. జీవనోపాధి కోసం ఫుట్‌పాత్‌లపై చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ.. కుటుంబాలను పోషిస్తున్న పేదలపై శనివారం అధికారులు ప్రతాపం చూపెట్టారు. ఎలాంటి ముందస్తు హెచ్చరిక లేకుండా వారి కష్టానికి ప్రతీకగా నిలిచిన షాపులను జేసీబీ యంత్రాలతో నిర్ధాక్షిణ్యంగా నేలమట్టం చేశారు. బండ్లగూడ, చార్మినార్, కేపీహెచ్‌బీ, సికింద్రాబాద్ తదితర ఫుట్‌పాత్‌లపై ఏండ్ల తరబడి అక్కడ ఉపాధి పొందుతున్న వారి చిరు దుకాణాలు క్షణాల్లో నేలమట్టమయ్యాయి. ‘మా దెతుకుదెరువును నాశనం చేయొద్దు’ అంటూ కన్నీటి పర్యంతమైనా కూల్చివేతలు ఆపలేదు. ఆగ్రహించిన వ్యాపారులంతా తమపై నుంచి బుల్డోజర్లు ఎక్కించండంటూ రగిలిపోయారు.కానీ పోలీసుల రంగ ప్రవేశంతో గ్రేటర్లో 798 చిరు వ్యాపారాలను తొలగించి..వందల కుటుంబాలను రోడ్డునపడేశారు.
-సిటీబ్యూరో
అబిడ్స్, ఏప్రిల్ 4: జీహెచ్ఎంసీ 30వ సర్కిల్ కార్యాలయం పరిధిలోని పలు ప్రాంతాల్లో అధికారులు శనివారం బృందాలుగా ఏర్పడి ఫుట్‌పాత్‌లపై చిరువ్యాపారాలను తొలగించారు. జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ పర్యవేక్షణలో గోల్కొండ జోన్ జోనల్ కమిషనర్ ముకుందరెడ్డి నేతృత్వంలో జీహెచ్ఎంసీ 30వ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ ఉమా ప్రకాశ్, టౌన్ ప్లానింగ్ ఏసీపీ బాలానందస్వామి, సెక్షన్ అధికారి మహేందర్, డీఈ రూపలతో పాటు వివిధ సర్కిళ్ల డిప్యూటీ కమిషనర్లు ఈ తొలగింపులో పాల్గొన్నారు. పోలీస్ బందోబస్తు మధ్య ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు జీహెచ్ఎంసీ సిబ్బంది జేసీబీల ద్వారా పక్కా, తాత్కాలిక నిర్మాణాలను తొలగించారు. జీహెచ్ఎంసీ 30వ సర్కిల్ కార్యాలయం పరిధిలోని పలు ప్రాంతాలను ఐదుగా విభజించి ఆయా ప్రాంతాలకు బృందాలను నియమించి పోలీస్ బలగాల ద్వారా కూల్చివేతలు చేపట్టారు.

జాంబాగ్ హనుమాన్ ఆలయం, ఎంజే మార్కెట్ చౌరస్తా కుడి వైపు తదితర ప్రాంతాలకు జీహెచ్ఎంసీ 30వ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ ఉమా ప్రకాశ్ నేతృత్వం వహించగా టౌన్‌ప్లానింగ్ సెక్షన్ అధికారి మహేందర్‌లతో పాటు సిబ్బంది పాల్గొన్నారు. జాంబాగ్ హనుమాన్ దేవాలయం ఎంజే మార్కెట్ ఎడమ వైపు భాగానికి జీహెచ్ఎంసీ 31వ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ అహ్మద్ షఫియుల్లా, ఎంజే మార్కెట్ చౌరస్తా నుంచి సిద్దంబర్ బజార్ మసీదు ఎడమ వైపు ప్రాంతానికి జీహెచ్ఎంసీ 32వ గోల్కొండ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ జగన్, సిద్దంబర్ బజార్ మసీదు నుంచి ఉస్మానియా దవాఖాన, బర్తన్ బజార్, అఫ్జల్‌గంజ్ పోలీస్ స్టేషన్, బస్‌స్టాపుల మీదుగా నిర్వహించిన కూల్చివేతలకు జీహెచ్ఎంసీ 33వ మెహిదీపట్నం సర్కిల్ డిప్యూటీ కమిషనర్ దశరథ్, ఉస్మానియా దవాఖాన ప్రాంతం నుంచి ఎంజే మార్కెట్ ఎక్స్‌రోడ్ ఎడమ వైపు ప్రాంతానికి జీహెచ్ఎంసీ 34వ మాసాబ్ ట్యాంక్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ శోభా శంకర్ నేతృత్వం వహించి కూల్చివేతలను పక్కాగా చేపట్టారు.
చార్మినార్: చార్మినార్ జీహెచ్ఎంసీ సర్కిల్ పరిధిలోని ముర్గీచౌక్, మదీనా, హై కోర్టు ప్రధాన రోడ్డు మార్గంలో రోడ్లకు ఇరువైపులా కొనసాగుతున్న చిరు వ్యాపారులపై అధికారులు తమ ప్రతాపాన్ని ప్రదర్శించారు. రోడ్లను ఆక్రమించారనే కారణంతో ఎలాంటి ముందస్తు నోటీసులు జారీ చేయకుండానే కూల్చివేతలకు పాల్పడ్డారు. కాగా, ముర్గీచౌక్, మదీనా పటేల్ మార్కెట్ రోడ్డు మార్గంలో కూల్చివేతలకు పాల్పడుతున్న సమయంలో అధికారుల చర్యలపై స్థానిక వ్యాపారులు నిరసన వ్యక్తంచేశారు.

పోలీస్ బలగాలతో అప్పటికే పూర్తి సన్నద్ధంగా ఉన్న జీహెచ్ఎంసీ అధికారులు, సిబ్బంది చిరువ్యాపారుల సముదాయాలపై బల ప్రయోగం చేశారు. దీంతో కుటుంబాలను పోషించుకోవడానికి అప్పటి వరకు తోడుగా నిలిచిన వ్యాపార సముదాయాలు నేలమట్టం కావడంతో కొందరు వ్యాపారులు కన్నీటి పర్యంతమవుతూ అధికారుల తీరుపై మండిపడ్డారు.
మదీనా, ముర్గీచౌక్ ప్రాంతాల్లో జీహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ అధికారులు కొనసాగించిన కూల్చివేతలను ఎంఐఎం ఎమ్మెల్సీ రెహ్మాత్ బేగ్, పత్తర్‌గట్టి కార్పొరేటర్ సోహెల్ ఖాద్రీలు అడ్డుకున్నారు. ఓవైపు అక్రమార్కులకు కొమ్ముకాస్తున్న అధికారులు చిన్నా చితకా పనులు చేసుకుంటూ కుటుంబాలను పోషించుకుంటున్న చిరు వ్యాపారులపై జులుం ప్రదర్శించడం సమంజసం కాదన్నారు. దీంతో కొద్దిసేపు మదీనా, ముర్గీచౌక్ ప్రాంతాల్లో స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. కూల్చివేతలకు ఉపయోగించే బుల్డోజర్, జేసీబీ వాహనాలపైకి చేరుకున్న నేతలు అధికారుల చర్యలను నిలదీస్తూ ఇప్పటి వరకు జారీ చేసిన నోటీసులు ఎక్కడంటూ ప్రశ్నించారు. దీంతో అధికారులు వెనక్కు తగ్గి కూల్చి వేతలను తాత్కాలికంగా నిలుపుదల చేస్తున్నామని ప్రకటించారు.
సికింద్రాబాద్: సికింద్రాబాద్‌లో ఫుట్‌పాత్‌లపై చిరువ్యాపారాల తొలగింపు ఉద్రిక్తతలకు దారితీసింది. అల్ఫా హోటల్ వద్ద ఉన్న చిరువ్యాపారులు పోలీసులను, జీహెచ్ఎంసీ అధికారులను అడ్డుకున్నారు. తమ షాపులను తొలగించవద్దని ఎదురు తిరిగారు. ఉద్రిక్తత నెలకొనడంతో అధికారులు కూల్చివేతలను నిలిపివేశారు. మల్కాజిగిరి ట్రాఫిక్ ఏసీపీ చంద్రశేఖర్‌రెడ్డి పర్యవేక్షణలో జీహెచ్ఎంసీ మెట్టుగూడ సర్కిల్ టౌన్ ప్లానింగ్ ఏసీపీ ఇతర సిబ్బంది, చిలకలగూడ, మోండా గోపాలపురం, మోండా మార్కెట్ పోలీసులు ఫుట్‌పాత్‌లపై చిరువ్యాపారాలను తొలగించడం ప్రారంభించారు.

చిలకలగూడ చౌరస్తా రేతిఫైల్ బస్టాపు నుంచి అల్ఫా హోటల్ వరకు ఇరువైపులా ఉన్న వాటిని తొలగించారు. అల్ఫా హోటల్ వెనకాల మూడు గంటల వ్యవధిలో 20 దుకాణాలను పూర్తిగా తొలగించారు. అల్ఫాహోటల్ నుంచి మోండా మార్కెట్ వెళ్లే మార్గంలో రోడ్డుకు ఇరువైపులా ఉన్న చిరువ్యాపారాలను తొలగించే క్రమంలో ఉద్రిక్తత నెలకొంది. కొందరు స్థానిక ఫుట్‌పాత్ వ్యాపారులు ఫుట్‌పాత్ అసోసియేషన్ సభ్యులకు సమాచారం అందించడంతో వారు వచ్చి అడ్డుకున్నారు. దశాబ్దాల కాలంగా వ్యాపారాలు జరుపుకొంటున్నాం.. ఇప్పుడు వచ్చి ఎలా తొలగిస్తారని అధికారులను నిలదీశారు. ఫుట్‌పాత్‌పై వందల కుటుంబాలు జీవిస్తున్నాయని, వారినంతా రోడ్డున పడమంటారా అంటూ పోలీసులతో వాగ్వాదానికి దిగారు.

కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాకే ఫుట్‌పాత్ వ్యాపారులను ఇబ్బంది పెడుతున్నారని, తమ జీవితాలు రోడ్డున పడేస్తున్నారని వ్యాపారులు రోడ్డుపై పడుకొని నిరసన వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌ను గెలిపిస్తే మా పొట్టకొడుతున్నారని ఆందోళనకు దిగారు. పరిస్థితి చేయిదాటి పోతుందని భావించిన అధికారులు జేసీబీలను తీసుకొని అక్కడి నుంచి వెళ్లిపోయారు.
కేపీహెచ్‌బీకాలనీ, ఏప్రిల్ 4 : కూకట్పల్లి సర్కిల్ టౌన్ ప్లానింగ్, కేపీహెచ్‌బీ కాలనీ ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్వంలో అధికారులు కేపీహెచ్‌బీ కాలనీలో ఫుట్‌పాత్‌లపై ఏర్పాటు చేసుకున్న వ్యాపారాలను తొలగించారు. రోడ్డు పక్కన పూలు, పండ్లు అమ్ముకుని జీవించే చిరువ్యాపారులు వేడుకున్నా వారు కనికరించలేదు. 20 ఏండ్లుగా పూలు, పండ్లు అమ్ముకుని జీవిస్తున్నామని, మాకు వేరే జీవనాధారం లేదని వేడుకున్నా.. వినలేదు. తోపుడు బండ్లను, కర్రల పందిళ్లను కూల్చివేశారు. ‘మా కుటుంబం బతుకడానికి ఆ తోపుడు బండ్లే ఆధారమని, వాటిని తొలగిస్తే మేము ఎటా ్లబతికేదని కాళ్లుపట్టుకొని వేడుకొన్నా వినలేదు.

జూబ్లీహిల్స్,ఏప్రిల్4: యూసుఫ్‌గూడ 38 వ సర్కిల్ పరిధిలోని శ్రీనగర్ కాలనీలో రోడ్లపై ఉన్న దుకాణాల తొలగింపునకు జీహెచ్ఎంసీ అధికారులు శనివారం స్పెషల్ డ్రైవ్ చేపట్టారు. టౌన్ ప్లానింగ్ అధికారులు సిబ్బందితో కలిసి జేసీబీలతో ఫుట్‌పాత్‌లపై డబ్బాలు, షెడ్లు తొలగించారు. డిప్యూటీ కమిషనర్ సురేశ్ కుమార్ ఆధ్వర్యంలో చేపట్టినతొలగింపు పనులను ఆయా విభాగాల అధికారులు.. పోలీసులతో కలిసి జడ్సీ ప్రియాంక పరిశీలించారు.
దుండిగల్: సూరారం మొయిన్‌రోడ్డులోని పుట్‌పాత్‌లపై చిరువ్యాపారాలను జీడిమెట్ల ట్రాఫిక్ పోలీసులు, గాజులరామారం సర్కిల్ టౌన్ ప్లానింగ్ అధికారులతో కలిసి తొలగించారు. సూరారంలోని సాయిబాబానగర్ చౌరస్తా నుంచి మల్లారెడ్డి వైద్యశాల సమీపంలోని తులీఫ్ హోటల్ వరకు నర్సాపూర్-బాలానగర్ ప్రధాన రహదారికి ఇరువైపులా ఏర్పాటు చేసుకున్న పలువాణిజ్య సముదాయాలను జేసీబీలతో తొలగించారు.