Congress Govt | సిటీబ్యూరో: రేవంత్ సర్కార్ పాలన పరాకాష్టకు చేరింది. పొట్టకూటి కోసం కూరగాయలు, పండ్లు అమ్ముకునే వ్యాపారాలను సైతం వదలడం లేదు. వనస్థలిపురం రైతుబజార్లో చిరువ్యాపారుల తోపుడు బండ్లను జేసీబీలతో చెల్లాచెదురుచేసి తొక్కించారు. ఈ ఘటన బుధవారం జరగగా ఆ రోజు రాత్రి నుంచి బాధితులు అక్కడే ధర్నాకు దిగారు. వర్షంలో తడుస్తూ రాత్రంతా అక్కడే ఉండి నిరసన వ్యక్తం చేశారు. గురువారం కూడా వారి ధర్నా కొనసాగింది.
‘మా పొట్ట కొట్టిన సర్కార్ బాగుపడది’ అంటూ మండిపడ్డారు. కేసీఆర్ ప్రభుత్వం చిరువ్యాపారులకు తోపుడు బండ్ల గుర్తింపు కార్డులను ఇచ్చింది. ఆ గుర్తింపు కార్డులతో లోన్లు కూడా తెచ్చుకున్నారు. కూరగాయలు అమ్ముతూ కుటుంబానికి పెద్ద దిక్కయ్యారు. కానీ ఇప్పుడు కాంగ్రెస్ పాలనలో ఆ చిరువ్యాపారుల జీవనాధారం తోపుడు బండ్లను తొలిగించారు. సుమారు 150 తోపుడు బండ్లను తొలిగించారు.
‘ఇన్నేండ్లు తోపుడు బండితోనే మా కుటుంబం బతికింది. ఇప్పుడు తొలిగించారు. ఎలా బతకాలి.’ అంటూ రమ్య అనే మహిళా కన్నీటి పర్యంతమైంది. “ నా భర్తకు పక్షవాతం.ఇద్దరు పిల్లలు. మా బతుకుపై పొట్టకొట్టారు. మేం ఎక్కడికి వెళ్లి బతకాలి. తోపుడు బండియే మా ఆధారం. అది విరిగిపోయింది. పిల్లల చదువెట్ల? ” అని మరో మహిళా స్వప్న బోరున విలపించింది.