మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్స్‌కు సంబంధించిన టెండర్లలో ఎలాంటి అవకతవకలు జరగలేదంటూ చెప్పుకుంటున్న హైడ్రా ఆ టెండర్లలో కొన్ని సడలింపులు ఇచ్చామంటూ ప్రకటించడంతోనే అందులో తప్పు జరిగినట్లుగా తేటతెల్లమవుతోంది. వర్షాకాలంలో మెట్ టీమ్స్‌ను అత్యవసరంగా ఏర్పాటు చేసే క్రమంలో రూ.65 కోట్లతో 62 టెండర్లను ఆహ్వానించిన హైడ్రా అందులో పాల్గొనే టెండర్‌దారులకు కొన్ని నిబంధనలు విధించింది. ఈమేరకు టెండర్‌దారులు అందులో పాల్గొంటామంటూ తమకు సంబంధించిన పత్రాలతో టెండర్లు దాఖలు చేశారు. విచిత్రమేంటంటే మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్స్ టెండర్లలో అవకతవకలు జరిగాయంటూ నమస్తే తెలంగాణలో కథనాలు వస్తున్న నేపథ్యంలో హైడ్రా భుజాలు తడుముకుంది.
– సిటీబ్యూరో, జూన్ 18 (నమస్తే తెలంగాణ)
తాము తప్పు చేయలేదని, టెండర్లలో ఎలాంటి అవకతవకలు జరగలేదని ప్రకటన విడుదల చేస్తూ అందులోనే టెండర్ నిబంధనలను కొంతమేరకు సడలించామంటూ పేర్కొంది.మెట్ వాహనాలను క్షేత్రస్థాయిలో వినియోగించేముందు పీసీబీ, ఫిట్నెస్, ఇన్సూరెన్స్ సర్టిఫికెట్లను తప్పనిసరిగా సమర్పించాలనే నిబంధన మేరకు టెండర్ ఖరారులోనే సడలింపు ఇచ్చామని, పాత అనుభవం, ఆర్థికస్థోమత, సొంత లేదా లీజువాహనం విషయంలో ఎలాంటి సడలింపు ఇవ్వలేదని గురువారం విడుదల చేసిన ప్రకటనలో హైడ్రా పేర్కొంది. మెట్ ఉపయోగించే వాహనాలకు సంబంధించి ఖచ్చితంగా ఉండాల్సిన ఫిట్నెస్, ఇన్సూరెన్స్, పీసీబీ సర్టిఫికెట్ల్ల విషయంలో తమకు అనుకూలమైన వారికోసమే టెండర్లు తెరిచే సమయంలోనే నిబంధనలను కొద్దిగా సడలించారంటూ వచ్చిన ఆరోపణలు హైడ్రా విడుదల చేసిన ప్రకటనతో నిజమేనని స్పష్టమయ్యాయి.
రాష్ట్ర ప్రభుత్వ సంస్థ తాను పిలిచిన టెండర్లకు అందునా వర్షాకాలపు ఎమర్జెన్సీ పనులకు వాడే వాహనాలకు ఫిట్నెస్, పీసీబీ, ఇన్సూరెన్స్ విషయంలో సడలింపులు ఇస్తారా అంటూ ప్రశ్నలు తలెత్తుతున్నాయి. నమస్తే తెలంగాణలో ఉదహరించిన ఆ మూడు టెండర్లకు సంబంధించి హైడ్రా తన ప్రెస్‌నోట్‌లో ఎలాంటి ప్రకటన చేయకపోగా వారికే ఎందుకు టెండర్లు కేటాయించారనే అంశంపై ప్రస్తుతం కాంట్రాక్టర్లలో చర్చ జరుగుతోంది. మెట్ టెండర్లకు వచ్చే వారికి సొంతం లేదా లీజు వాహనం ఉండాల్సిందేనంటూ తన ప్రకటనలో పేర్కొన్న హైడ్రా.. కొన్ని టెండర్లను రీకాల్చేస్తూ 14/2026-27 ద్వారా మొత్తం 8 పనులకు ఈనెల 16 నుంచి 19వ తేదీ సాయంత్రం 4గంటల వరకు ఆన్లైన్లో టెండర్లు ఆహ్వానించింది.
ఈ రీకాల్ టెండర్ నోటిఫికేషన్లో కూడా కండిషన్ నంబర్ 8లో ఎంవోయూ/ లీజ్/ సొంతం అనే నిబంధనను స్పష్టంగా పేర్కొన్నారు. ఈ నిబంధనలను ఎంఈటీ టెండర్లకు కూడా అమలు చేసినప్పటికీ కొందరికి అనుకూలంగా చేయడం కోసమే కేవలం ఎంవోయూ ఉన్నదన్న సాకుతో కొందరు కాంట్రాక్టర్ల టెండర్లను తిరస్కరించిన హైడ్రా గత నిబంధనలనే మళ్లీ ఈ టెండర్లకు కూడా వర్తింపచేస్తూనే అదే రోజు తాను విడుదల చేసిన ప్రకటనలో సొంతంగా లేదా లీజుగా వాహనం ఉండాలంటూ చెప్పడం వెనక మర్మమేంటంటూ పలువురు కాంట్రాక్టర్లు ప్రశ్నిస్తున్నారు. ఆ నలుగురికోసమే టెండర్ల నిబంధనలు సడలించారంటూ వస్తున్న ఆరోపణలు, అందుకు సంబంధించి ఒక కాంట్రాక్టర్ మొత్తం రింగయి అధికారులతో కుమ్ముక్కై ఈ టెండర్లలో గోల్మాల్ చేశారంటూ వచ్చిన ఆరోపణలకు హైడ్రా ఇచ్చిన వివరణే సాక్ష్యంగా నిలుస్తోంది.
వర్షాకాలం నగర ప్రజలకు అసౌకర్యం కలగకుండా చేపట్టాల్సిన అత్యవసర పనుల నిమిత్తం తీసుకునే మెట్ ఎంపికలో ఎలాంటి అవకతకలు జరగలేదని హైడ్రా ఒక ప్రకటనలో తెలిపింది. జీహెచ్ఎంసీ, సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్లకు చెందిన 9మంది ఇంజనీర్ల కమిటీ ఎంపిక చేసిన వాటిని హైడ్రా అధికారులు పరిశీలించి మెట్ టెండర్లను ఖరారు చేసినట్లు హైడ్రా పేర్కొంది. మెట్ వాహనాలను క్షేత్రస్థాయిలో వినియోగించే ముందు పీసీబీ, ఫిట్నెస్, ఇన్సూరెన్స్ సర్టిఫికెట్లను తప్పనిసరిగా సమర్పించాలనే నిబంధన మేరకు టెండరు ఖరారులో కాస్త సడలింపు ఇచ్చామని అయితే పాత అనుభవం, ఆర్థిక స్థోమత, సొంతం లేదా లీజు వాహనం విషయంలో ఎలాంటి సడలింపు ఇవ్వలేదని చెప్పారు.
చిన్నచిన్న సాంకేతిక కారణాలను భూతద్దంలో చూపించి టెండర్లు దక్కనివారు పనికట్టుకుని దుష్ప్రచారం చేస్తున్నారని జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్నప్పుడు కొందరు ఇలాంటి బెదిరింపులకు, లేనిపోని ఆరోపణలు చేసి టెండర్లు దక్కించుకునే ప్రయత్నం చేసేవారని, గతేడాది హైడ్రాకు కూడా ఇలాంటి బెదిరింపులు వస్తే వాటిని పటాపంచలు చేస్తూ సమర్ధులకే మెట్ టెండర్లు అప్పగించామని తెలిపారు. ఈనెల 9,12 తేదీల్లో కురిసిన కుండపోత వర్షాలకు నగర జీవనం స్తంభించిపోయిందని, దీంతో వెంటనే మెట్ బృందాలను రంగంలోకి దించాలనే ఉద్దేశ్యంతో మూడు కమిషనరేట్లకు చెందిన ఇంజనీర్లతో పాటు హైడ్రా అధికారులతో కూడిన టెండరు ఎంపిక కమిటీ సెలవుదినాల్లో కూడా 24గంటలూ పనిచేసి ఈ ప్రక్రియను ముందుకు తీసుకెళ్లిందని హైడ్రా తెలిపింది. డీసిల్టింగ్, ఇన్స్టంట్ రిపెయిర్ టీమ్స్ పనులు చేపట్టేవారికి కూడా మెట్ టెండర్లలో పాల్గొనే అవకాశం కల్పించాలని కోరడంతో ఈనెల 10వ తేదీన సవరణ ప్రకటన కూడా జారీ చేశామని హైడ్రా తెలిపింది.

హైడ్రా తన ప్రకటనలో పేర్కొన్న పట్నం శ్రీశైలం వ్యవహారంలో తాను చేసిన తప్పులను తనకు తానుగా బయటపెట్టింది. ఆయన గత సంవత్సరం సరిగా టెండర్ నిబంధనలు పాటించలేదని, ఈసారి కూడా అదే తరహాలో చేయాలని చూస్తే అనర్హుడిగా ప్రకటించామంటూ చెప్పడంతో ఆ కాంట్రాక్టర్ ఒక ప్రెస్‌నోట్ విడుదల చేశారు. అయితే 2025లో మెట్ టెండర్లలో శ్రీశైలానికి 150రోజులు పనిచేసినందుకుగాను రూ.51.48లక్షలు చెల్లిస్తూ పని మొత్తం పూర్తి చేశారంటూ ఎక్స్పీరియన్స్ సర్టిఫికెట్ కూడా ఇచ్చింది. అయితే పట్నం శ్రీశైలం గత సంవత్సరం మెట్ టెండర్లు దక్కించుకుని వారం రోజుల్లో సొంత వాహనాలు సమకూర్చుతామని హామీ ఇచ్చి వర్షాకాలం పూర్తయ్యే వరకూ ఏరోజుకారోజు అద్దెకు తీసుకువచ్చిన వాహనాలతో నెట్టుకొచ్చారని, ఈ ఏడాది కూడా అదే వ్యక్తి 302 టెండర్లకు దరఖాస్తు చేయడంతో పాటు గతంలో మాదిరే సొంతవాహనాలు కానీ, లీజుకు తీసుకున్నట్లు కానీ ఎలాంటి పత్రాలు సమర్పించకపోవడంతో టెండర్ల ఎంపిక కమిటీ ఆయనను అనర్హుడిగా ప్రకటించిందని ఆ ప్రకటనలో పేర్కొంది. ఒకవేళ గత సంవత్సరం ఆయన సరిగా పనిచేయకపోతే హైడ్రా అతనికి మొత్తం ఎందుకు డబ్బులు చెల్లించిందనే ప్రశ్న తలెత్తుతోంది.
మరోవైపు హైడ్రా ప్రకటనపై పట్నం శ్రీశైలం కూడా ఒక ప్రకటన విడుదల చేశారు. మెట్ టెండర్ల ప్రక్రియకు సంబంధించి తనపై వచ్చిన ఆరోపణలను ఖండిస్తున్నానని టెండర్ నిబంధనలలోని కండిషన్ నెంబర్ 6 ప్రకారం వాహనాలకు సంబంధించి ఎంఓయూ, లీజు, ఓనర్స్ అనే మూడు ఆప్షన్లను స్పష్టంగా పేర్కొన్నారు. ఈ నిబంధనల ప్రకారమే తాను టాటాషోరూమ్ నుంచి ఎంఓయూ పత్రాలను టెండర్లో అప్లోడ్ చేశానని చెప్పారు. తాను గత ఏడాది టెండర్ నిబంధనలు పాటించకపోతే తనపై అప్పుడే ఎందుకు చర్యలు తీసుకోలేదంటూ ఆయన ప్రశ్నించారు. ఒకే ఏజెన్సీకి లబ్ధి చేకూర్చేలా నిబంధనలను ఉల్లంఘించి అత్యధిక శాతం పనులను రియాన్షిక ఏజెన్సీకి కట్టబెట్టడానికి కొందరు అధికారులు ప్రయత్నిస్తున్నారని శ్రీశైలం ఆరోపించారు. సదరు ఏజెన్సీకి 2025-26 ఆర్థిక సంవత్సరానికిగాను రూ.6కోట్ల రూపాయల టర్నోవర్ ఉన్నట్లు చూపించారని, టెండర్ నిబంధనల ప్రకారం అత్యధిక టర్నోవర్ అయిన రూ.1.30కోట్లకు విలువకు ఎన్ని పనులు వస్తాయో, అన్ని పనులకే కేటాయించాలి తప్ప ఏ లెక్కన అత్యధిక పనులు కేటాయించారంటూ ప్రశ్నించా రు.