పేదల పొట్ట కొట్టడమే లక్ష్యంగా రేవంత్ ప్రభుత్వం మరోసారి తన ఉగ్రరూపాన్ని ప్రదర్శించింది. ఫుట్‌పాత్ ఆక్రమణల తొలగింపు పేరుతో గడిచిన కొద్ది రోజులుగా బుల్డోజర్లను రోడ్లపైకి ఎక్కించి.. చిరు వ్యాపారుల బతుకులను ఛిన్నాభిన్నం చేస్తున్నది. ఎటువంటి ముందస్తు నోటీసులు లేకుండా, కనీసం సామాన్లు సర్దుకునే సమయం కూడా ఇవ్వకుండా.. కనికరం అన్న మాట మర్చిపోయి.. అధికారులు సాగిస్తున్న ఈ విధ్వంసకాండతో వేలాది కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. దివ్యాంగులు అని కూడా చూడకుండా వారి బతుకులను రోడ్డున పడేస్తున్నారు. తమకు జీవనాధారమైన బండ్లు, షెడ్లను కూల్చివేస్తుంటే, చేష్టలుడిగి చూస్తూ వ్యాపారులు కన్నీరు మున్నీరవుతున్నారు.
‘ఏండ్లుగా ఇక్కడే వ్యాపారం చేసుకుంటున్నాం..ఒక్క మాట చెప్పకుండా ఉన్నపళంగా వచ్చి సర్వం నాశనం చేస్తున్నారం’టూ మండిపడుతున్నారు. ఈ క్రమంలోనే శనివారం ఒక్క రోజే ఆరు జోన్లలో 653 చోట్ల కూల్చివేతలు జరిపి వారి జీవితాలను రోడ్డు పాలు చేశారు. గడిచిన కొద్ది రోజులుగా జరుపుతున్న స్పెషల్ డ్రైవ్‌లో దాదాపు 10వేల మందికి పైగా కుటుంబాలు తమ ఉపాధిని కోల్పోయి జీవితాలు అంధకారంలోకి పడ్డాయి. ‘కేసీఆర్ మమ్మల్నీ కన్నబిడ్డల్లా చూసుకున్నారు..ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మా బతుకులు బుల్డోజర్ల కింద నలిగిపోతున్నాయం’టూ బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆరుగాలం కష్టపడి పైసా పైసా కూడబెట్టుకుని కొనుక్కున్న తోపుడు బండ్లను తుక్కుతుక్కు చేశారని కన్నీరుమున్నీరవుతున్నారు.
– సిటీబ్యూరో, ఏప్రిల్ 18 (నమస్తే తెలంగాణ )

బడంగ్పేట్, ఏప్రిల్18: సర్కారు సామాన్యుడి పై పగ పట్టింది.పెద్దల పై ప్రేమ చూపుతున్నది. ఫుట్‌పాత్‌లపై చిరువ్యాపారాల తొలగింపులో అధికారుల పక్షపాత ధోరణిపై జనం మండిపడుతున్నారు. అధికారులతో చిరు వ్యాపారులు వాగ్వాదానికి దిగుతున్నారు. బడా బాబుల కార్పొరేట్ స్కూల్స్, వారి వాణిజ్య వ్యాపారాల దరి దాపుల్లోకి పోకుండా చిరు వ్యాపారుల బతుకు ఛిద్రం చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జీవనోపాధి లేకుండా చేస్తున్నారని శాపనార్థాలు పెట్టారు. రోడ్డు పక్కన చిన్న డబ్బా పెట్టుకుంటే బుల్డోజర్లతో విరుచుకుపడుతున్నారని.. ఎలాంటి అనుమతలు లేకుండా బహుళ అంతస్తులు కడుతుంటే ఏం చేస్తున్నారని అధికారులను ప్రశ్నించారు. బడంగ్పేట్ సర్కిల్ పరిధిలోని 10 కిలో మీటర్ల మేర అధికారులు స్పెషల్ డ్రైవ్ పేరుతో పుట్‌పాత్‌లను తొలగించారు.
బాలాపూర్ చౌరస్తా నుంచి ఆదిబట్ల హెచ్ఎండబ్ల్యూ వాటర్ ట్యాంక్ వరకు ఫుట్‌పాత్ కూల్చివేతలను చేపట్టారు. 313 చిరు వ్యాపారాలను తొలగించినట్లు అధికారులు పేర్కొంటున్నారు. 101 పర్మినెంట్ స్ట్రక్చర్స్ తొలగించామని తెలిపారు. రోడ్డు పక్కన తోపుడు బండ్లు, చిన్న చిన్న డబ్బాలు పెట్టుకొని జీవించే వారిపై అధికారులు కఠినంగా వ్యవహరించారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. సామాగ్రి తీసుకునే సమయం కూడా ఇవ్వలేదని బాధితులు వాపోయారు. చిన్న డబ్బాలను ధ్వంసం చేశారని తెలిపారు. పుట్‌పాత్‌పై ఇందిరా మహిళా క్యాంటీన్ ఎలా ఏర్పాటు చేశారో అధికారులు సమాధానం చెప్పాలన్నారు. రోడ్డు మధ్యలో ఉన్న సులభ్ కాంప్లెక్స్‌ను ఎందుకు తొలగించలేదన్నారు. బాలాపూర్ చౌరస్తా నుంచి ఆదిబట్ల వరకు అక్రమ నిర్మాణాలు ఉన్నాయన్నారు. అధికారులు చూపిస్తున్న పక్షపాత ధోరణి మంచిది కాదని గట్టు శ్రీనివాస్ అధికారులతో వాగ్వాదానికి దిగారు.
దివ్యాంగుడినీ.. కనికరించలేదు
కార్వాన్: జీహెచ్ఎంసీ అధికారులు రోడ్లపై చిన్నా చితక వ్యాపారం చేసుకునే వారిపై దౌర్జన్యకాండను కొనసాగించారు. రోడ్డుకు ఎలాంటి ఇబ్బంది లేని చోట, దుకాణాల పై ఏర్పాటు చేసిన బోర్డులను సైతం కొనసాగించారు.ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా భారీ పోలీస్ బలగాలు, సిబ్బందితో చేరుకొని కూల్చివేతలు చేపట్టారు. మెహిదీపట్నం నుంచి అంబ థియేటర్, గుడిమల్కాపూర్, శివ్‌బాగ్ చౌరస్తా, గుడిమల్కాపూర్ కూరగాయల మార్కెట్, ఇంద్రారెడ్డి పూల మార్కెట్, పీవీఎన్ఆర్ ఎక్స్‌ప్రెస్ వే పిల్లర్ నెంబర్ 44 నుంచి 112 వరకు రోడ్డుకిరువైపులా కూల్చివేతలు చేపట్టారు.
జోనల్ కమిషనర్ ముకుందారెడ్డి ఆదేశాలతో సిటీ ప్లానర్ సాంబయ్య, ఏసీపీ బాలానంద స్వామి, స్వామి నాయక్, సెక్షన్ ఆఫీసర్లు సునీతా, ప్రకాశ్, మహేందర్ ఆధ్వర్యంలో సిబ్బంది జేసీబీ సహాయంతో నేలమట్టం చేశారు. చిన్న చిన్న డబ్బాలను తొలగించడం ఏమిటని అధికారులపై మండిపడ్డారు. శివ్‌బాగ్ చౌరస్తాలో లోపలి రోడ్డు వైపు ఫుట్‌పాత్ పై దాసరి వెంకటేశ్ రెండు కాళ్లు లేని దివ్యాంగుడు. ప్రభుత్వం స్వయం ఉపాధి కోసం పబ్లిక్ ఫోన్‌కు కేటాయించడంతో 26 ఏండ్లుగా ఫోన్ డబ్బాను నడుపుతుండగా అధికారులు డబ్బాను తొలగించారు. దీంతో పలువురు కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. గుడిమల్కాపూర్ కూరగాయల మార్కెట్ గోడకు ఆనుకొని ఉన్న గాజుల దుకాణాలు, పండ్ల దుకాణాలు, హోటల్‌ను, చేపల మార్కెట్‌ను పూర్తిగా తొలగించడంతో పాటు ఇంద్రారెడ్డి పూల మార్కెట్ గేటు బయట ఉన్న పూల దుకాణాలను, పూజా సామాగ్రి దుకాణాలను తొలగించారు.

చిన్న వ్యాపారులపై ప్రతాపం ..
మైలార్‌దేవ్‌పల్లి: అత్తాపూర్ సర్కిల్ జీహెచ్ఎంసీ అధికారులు కొరడా ఝుళిపించారు. అత్తాపూర్ పీవీఎన్ఆర్ ఎక్స్‌ప్రెస్ వే పిల్లర్ నెంబర్ 116 నుంచి ఆరాంఘర్ చౌరస్తా వరకు ఉన్న షెడ్లను నేలమట్టం చేశారు. అత్తాపూర్ సర్కిల్ జీహెచ్ఎంసీ ఉప క మిషనర్ మల్లయ్య, టౌన్‌ప్లానింగ్ ఏసీపీ సుధాకర్ ఆధ్వర్యంలో కూల్చివేతలు చేపట్టారు. చిన్న చిన్న వ్యాపారులపై ప్రతాపం చూపడం కాదు బహుళ అంతస్తులను అక్రమంగా నిర్మిస్తున్న వారిపై, ప్రభుత్వ స్థలాలను కబ్జాలు చేసిన వారిపై చర్యలు తీ సుకోవాలని వ్యాపారులు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కూల్చివేతల సమయంలో అధికారులకు, వ్యాపారులకు మధ్య వాగ్వాదం జరిగింది. పోలీసులు వారిని నివారించి కూ ల్చివేతలను కొనసాగించారు.
జీవనోపాధిని దెబ్బతీశారు..
బన్సీలాల్‌పేట్: కవాడిగూడ సర్కిల్ పరిధిలోని పద్మారావునగర్, గాంధీ దవాఖాన పరిసరాల్లో రోడ్డు పక్కన జీవనోపాధి కోసం చిరు వ్యాపారాలు చేసుకుంటున్న వారి దుకాణాలను తొలగించారు. తమను రోడ్డు పాలు చేయవద్దని అధికారులను ప్రాధేయపడినా వారు కనికరించలేదు. హైకోర్టు ఆదేశాల మేరకే తాము తొలగింపు చేపట్టామని సికింద్రాబాద్ జోన్ సిటీ ప్లానర్ సత్యభామ తెలిపారు.
రూపాయి..రూపాయి కూడబెట్టుకొని..
రామచంద్రాపురం: కాంగ్రెస్ ప్రభుత్వ పాలన సామాన్యులకు గుదిబండగా మారుతుంది. ఫుట్‌పాత్‌లపైన, రోడ్డుకిరువైపులా చిన్నపాటి డబ్బాలు, షెడ్లు, తడ్కలతో ఏర్పాటు చేసుకొని వ్యాపారం చేసుకుంటు బతుకీడుస్తున్న వారిని కూల్చివేతలతో బతుకులేకుండా చేస్తున్నారు. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో ఆడవాళ్లు దుమ్మెత్తిపోస్తున్నారు. తమ బతుకులతో ప్రభుత్వం ఆడుకుంటుంది..సీఎం రేవంత్‌రెడ్డి పేదల పై మూర్కంగా వ్యవహరిస్తున్నారని చిరువ్యాపారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పేదల దుకాణాలు కూల్చి పెద్దలకు సంబంధించిన దుకాణాలు, పెద్దపెద్ద షెడ్లు ఫుడ్‌కోర్ట్‌లు ఎందుకు కూల్చడం లేదంటు ప్రశ్నిస్తున్నారు. తెల్లాపూర్ బల్దియా కార్యాలయం పక్క నుంచి బోన్సాయి అపార్ట్మెంట్స్ వరకు ఫుట్‌పాత్‌లపైన ఏర్పాటు చేసుకున్న దుకాణాలను పోలీసు బందోబస్తు పెట్టి బల్దియా టౌన్‌ప్లానింగ్ అధికారులు కూల్చి వేశారు. అడ్డుకున్న చిరువ్యాపారులను పోలీసులు పక్కకు జరిపారు. రూపాయి రూపాయి కూడబెట్టుకొని ఏర్పాటు చేసుకున్న డబ్బాలను కూల్చి వేయడంతో వ్యాపారులు కన్నీరుమున్నీరయ్యారు.
కూల్చివేతలు ఆపండి

బడంగ్పేట్, ఏప్రిల్18: పుట్‌పాత్‌లపై చిరువ్యాపారాల కూల్చివేతలు ఆపాలంటూ..ఎమ్మెల్యే సబితాఇంద్రారెడ్డి అధికారులపై మండిపడ్డారు. బడంగ్పేట్ సర్కిల్ పరిధిలో బల్దియా అధికారులు చేపట్టిన ఫుట్‌పాత్‌లపై చిరువ్యాపారాల కూల్చివేతల నేపథ్యంలో ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. చిరు వ్యాపారుల నోట్లో మట్టికొట్టదన్నారు. బడంగ్పేట్ సర్కిల్లో ఉన్న సమస్యలను పరిష్కరించడం పక్కన పెట్టి..కూల్చివేతలకు ప్రాధాన్యత ఇవ్వడం ఏమిటని మండి పడ్డారు. దోమల సమస్యతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారన్నారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక పేరుతో కాలయాపన తప్ప.. చేసింది శూన్యమన్నారు. ప్రజలను ఇబ్బంది పెట్టే విధంగా వ్యవహరిస్తే ఊరుకునేది లేదన్నారు. బడంగ్పేట్ సర్కిల్ డీసీకి పోన్ చేసి కూల్చివేతలు ఆపాలని ఆదేశించారు.
మా బతుకు ఆగమయ్యింది
గుడిమల్కాపూర్ కూరాయల మార్కెట్ గోడకు ఆనుకొని చిన్నపాటి దుకాణం ఏర్పాటు చేసుకొని నా కుటుంబాన్ని పోషించుకుంటున్నా. ఇపుడు అధికారులు ఇలా అకస్మాత్తుగా వచ్చి నా దుకాణాన్ని తొలగించడంతో నా బతుకు ఆగమయ్యింది. నేను నా కుటుంబం జీవనోపాధిని కోల్పోయాం. ప్రభుత్వమే మాకు దారి చూపాలి.
-దుర్గా ప్రసాద్, బట్టల వ్యాపారి
నా కుటుంబం రోడ్డున పడ్డది
మార్కెట్ ప్రధాన రోడ్డులో తోపుడు బండి మీద గాజులు అమ్ముతూ నా కుటుంబాన్ని పోషించుకుంటున్న. మా ర్కెట్‌కు ప్రతి రోజు పెద్ద సంఖ్యలో ప్రజలు వస్తుంటారు. కాబట్టి గాజుల బే రాన్ని స్వయం ఉపాధిగా చేసుకొని బతుకుతున్న. నా వ్యాపారం ఇప్పుడు జీహెచ్ఎంసీ అధికారులు పూర్తిగా తొలగించడంతో నేను నా కుటుంబం రోడ్డున పడింది.
– షేక్ ఇమ్రాన్, గాజుల వ్యాపారి
ఇది మానవత్వం లేని ప్రభుత్వం
గుడిమల్కాపూర్ కూరగాయల మార్కెట్ గోడకు అనుకొని చిన్నపాటి దుకాణం ఏర్పాటు చేసుకొని బట్టల దుకాణం నిర్వహిస్తూ జీవనోపాధి పొందుతున్నా. మురికి నాలా పై డబ్బాలాగా ఏర్పాటు చేసుకొని దుకాణం నడుపుతూ వచ్చిన ఆదాయంతో నా కుటుంబాన్ని పోషించుకుంటున్నా. ప్రభుత్వం ఏ మాత్రం మానవత్వం లేకుండా ఇలా పేదల జీవనోపాధిని లేకుండా చేస్తుందని అనుకోలేదు. మా లాంటి పేదలకు ప్రభత్వుమే దారి చూపాలి.
-కిశోర్, వ్యాపారి
మా ఆవేదన ఎవరికి చెప్పాలి
టిఫిన్ సెంటర్ నిర్వహణ ద్వారా 18 మంది కుటుంబాలకు జీవనోపాధిగా ఉన్నది. ఉన్నట్టుండి జీహెచ్ఎంసీ అధికారులు బుల్డోజర్లతో వచ్చి దుకాణంతో పాటు వంట సామాగ్రి కూడా పనికి రాకుండా చేశారు. మా లాంటి చిరు వ్యాపారులపై ఈ సర్కారు కనికరం చూపాలి. ఇప్పుడు మేము రోడ్డున పడ్డాం. మా ఆవేదన ఎవరికి చెప్పాలి.
– గోకుల్,టిఫిన్ సెంటర్ నిర్వాహకుడు
అధికారులు పక్షపాత ధోరణి వీడాలి
కూల్చివేతల్లో సమన్యాయం పాటించడం లేదు. చిరు వ్యాపారులవి తొలగించి బడా వ్యాపారులవి ఎందుకు కూల్చలేదో సమాధానం చెప్పాలి. చిరు వ్యాపారులు డబ్బాలు తీసుకున్నదాక ఆగలేదు. ఇదంతా డైవర్షన్ పాలసీ కోసం చేస్తున్నట్లు కన్పిస్తుంది. బడంగ్పేట్ సర్కిల్లో జరిగిన అవినీతి అక్రమాల నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికి అధికారులు కొత్త నాటకానికి తెరలేపారు. అధికారులు పక్షపాత ధోరణి వీడాలి
-రాంరెడ్డి, బీఆర్ఎస్ అధ్యక్షుడు, బడంగ్పేట్ సర్కిల్