HYDRAA | సిటీబ్యూరో, జనవరి 2(నమస్తే తెలంగాణ): కూల్చివేతలతో పాటు చెరువుల పునరుజ్జీవనంపై హైడ్రా సీరియస్‌గా దృష్టి పెట్టిందని హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఇటీవల తెలిపారు. ఇందులో భాగంగా మొదట పన్నెండు చెరువులను అభివృద్ధి చేసేందుకు రూపొందించిన డీపీఆర్‌లను ప్రభుత్వానికి అందజేశామని చెప్పారు. అయితే నిధుల పరంగా కోట్ల రూపాయలు అవసమవుతుండటంతో హైడ్రా ప్రతిపాదనలకు ప్రభుత్వం నుంచి పెద్దగా స్పందన రాలేదని తెలుస్తోంది. తాము డీపీఆర్‌లు ఇచ్చి నెలరోజులైనా ఇప్పటివరకు చెరువుల పునరుజ్జీవన ప్రతిపాదనలపై రేవంత్ రెడ్డి సర్కార్ స్పందించకపోవడంతో ప్రత్యామ్నాయం వైపు హైడ్రా దృష్టి పెడుతున్నట్లు తెలుస్తోంది.
ఈ విషయంలో తమకు పై నుంచే ప్రత్యామ్నాయం వెతుక్కోవాలని, బడ్జెట్ అంటే కష్టమని చెప్పినట్లు హైడ్రా అధికారి ఒకరు తెలిపారు. పునరుజ్జీవనానికి ఎంపిక చేసుకున్న పన్నెండు చెరువుల్లో ఒక్కో చెరువు సుందరీకరణకు చెరువు విస్తీర్ణాన్ని బట్టి సుమారుగా ఐదుకోట్ల రూపాయలకు పైగానే బడ్జెట్ అవసరమవుతుందని హైడ్రా అంచనా వేసింది. ఆ దిశగా డీపీఆర్‌లు కూడా తయారుచేసి ప్రభుత్వానికి ఇచ్చింది. కూల్చివేతల తర్వాత హైడ్రా మార్క్ కేవలం కూల్చివేతలే కాదు.. చెరువుల పునరుజ్జీవనం తమ లక్ష్యం అని ప్రజలకు సమాచారమిచ్చేందుకు కమిషనర్ రంగనాథ్ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు.
అయితే, ఇప్పటివరకు ప్రతిచోటా కూల్చివేతలే తప్ప ఎక్కడా ఒక్క చెరువు కూడా పునరుజ్జీవనం వైపు అడుగుపడకపోవడంతో హైడ్రా పట్ల ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతున్నదని హైడ్రా బృందం ఇటీవల జరిగిన అంతర్గత సమావేశంలో చర్చించింది. ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవడంతో ఏజెన్సీలతో మాట్లాడేందుకు హైడ్రా అధికారులు ప్లాన్ చేసుకున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సీఎస్సార్ కింద పలు చెరువులను అభివృద్ధి చేశారు. మళ్లీ అదే తరహాలో చెరువుల అభివృద్ధిలో భాగస్వామ్యం కోరుతూ పలు సంస్థలను హైడ్రా సంప్రదిస్తున్నట్లు తెలుస్తోంది. రియల్ ఎస్టేట్ రంగం కాకుండా మిగతా రంగాలకు చెందిన సంస్థలను ఇందులో భాగస్వామ్యం చేయాలంటూ ప్రభుత్వ పెద్దలే కమిషనర్‌కు సూచించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో చెరువుల వద్దనున్న కొన్ని ఆక్రమణలు తొలగించి ప్రస్తుతం ఉన్న ఖాళీ స్థలాన్ని తమ స్వాధీనం చేసుకున్న హైడ్రా అక్కడ పనులు మొదలు పెట్టడానికి కావలసిన ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.
మొదట నాలుగు చెరువులే..!
హైడ్రా ఏర్పడిన తర్వాత జరిగిన కూల్చివేతల్లో సుమారుగా 210 ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని హైడ్రా స్వాధీనం చేసుకుంది. ఓఆర్ఆర్ లోపల చెరువుల ఆక్రమణలు తొలగించి అక్కడ సుందరీకరణకు చేపట్టవలసిన చర్యలపై కొన్నిరోజుల క్రితం రంగనాథ్ బెంగళూరుకు చెందిన ఆనంద్ మల్లిగవాడ్‌ను హైదరాబాద్ పిలిపించి ఆయనతో చర్చించారు. ఈ మేరకు పునరుజ్జీవనం దిశగా మొత్తం పన్నెండు చెరువులను ఎంపిక చేసుకున్న హైడ్రా ఆయా చెరువుల అభివృద్దిపై డిటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేసి సర్కార్‌కు ఇచ్చింది. ఈ విషయమై ప్రభుత్వ పెద్దలను సంప్రదించిన కమిషనర్ బృందానికి వారు చేసిన సూచనల మేరకు సీఎస్సార్ కింద నాలుగు చెరువులను తొలి దశలో డెవలప్ చేయబోతున్నారు. అంబర్‌పేట బతుకమ్మ కుంట, తార్నాకలోని ఎర్రకుంట, ఖాజాగూడ తౌతోని కుంట, మాదాపూర్‌లోని తమ్మిడి కుంటలను అభివృద్ధి చేయడానికి హైడ్రా సన్నాహాలు చేస్తున్నట్లు తెలిసింది. ఇప్పటికే అంబర్‌పేట బతుకమ్మకుంటలో స్వాధీనం చేసుకున్న స్థలంలో చెత్తనంతా తొలగించి చదును చేశారు. ఆ రకంగా మిగతా చెరువులపై కూడా ప్రణాళిక సిద్ధం చేశామని తెలిపారు.
ఈదుల కుంటలో హైడ్రా సర్వే
సిటీబ్యూరో, జనవరి 2(నమస్తే తెలంగాణ): శేరి లింగంపల్లి మండలం ఖానామెట్‌లో ఉన్న ఈదుల కుంటలో హైడ్రా బృందం గురువారం పర్యటించింది. సర్వే ఆఫ్ ఇండియా టోపో మ్యాప్ ప్రకారం, సర్వే చేయించి హద్దులను నిర్ధారించే పని మొదలుపెట్టారు. నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్‌కు చెందిన హై రిసొల్యూషన్ మ్యాప్‌లు, ఖానామెట్ – కూకట్పల్లి విలేజ్ మ్యాప్‌ల ఆధారంగా చెరువు ఆనవాళ్లను హైడ్రా ఇది వరకే గుర్తించినట్లు కమిషనర్ రంగనాథ్ తెలిపారు. ఈ సర్వే బృందంలో హైడ్రా, ఇరిగేషన్, జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ అధికారులు పాల్గొన్నారు.