పటాన్చెరు, ఆగస్టు 31: పటాన్ చెరు పట్టణ నడి బొడ్డున ఉన్న సాకి చెరువులోని ఆక్రమణలను హైడ్రా కమిషనర్ రంగనాథ్ పరిశీలించారు. పటాన్ చెరు డివిజన్లోని సాకి చెరువును ఆయన శనివారం పరిశీలించి ఇరిగేషన్, రెవెన్యూ శాఖ అధికారుల నుంచి వివరాలు తీసుకున్నారు. చెరువులోంచి వేసిన రోడ్డు గుండా శాంతినగర్ కాలనీ ఎంట్రెన్స్‌లో ఆగి అక్కడున్న ఇండ్లను పరిశీలించి వాటి వివరాలు అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఆ నిర్మాణాల్లో అధిక శాతం సాకి చెరువు ఎఫ్టీఎల్లో ఉన్నాయని అధికారులు తెలిపారు. కొందరు కోర్టులో కేసులు వేశారని వివరించారు.
కోర్టు కేసుల వివరాలు తనకు తెలుపాలని సూచించారు. ఇప్పటికే 18 అక్రమ కట్టడాలు ఉన్నట్టుగా అధికారులు పేర్కొన్నారు. చాలా కాలం క్రితమే ఇండ్ల నిర్మాణం జరిగినట్టుగా ఉందని రంగనాథ్ అన్నారు. పూర్తి వివరాలు తీసుకుని చర్యలకు దిగుతామని ఆయన అన్నారు. సాకి చెరువు తూములు మూసివేసి ప్రముఖ నిర్మాణ సంస్థ అపార్టుమెంట్లు కడుతున్నదని పలువురు ఆయన దృష్టికి తీసుకుని వచ్చారు. స్పందించిన రంగనాథ్ చెరువుకు సంబంధించి ఎలాంటి ఆక్రమణలున్నా పరిశీలించి, విచారణ చేసి చర్యలు తీసుకుంటామన్నారు. పూర్తి వివరాలు అధికారులు సేకరిస్తారన్నారు. ఆరోపణలు వచ్చిన నిర్మాణానికి అనుమతులున్నాయని అధికారులు కమిషనర్‌కు తెలియజేశారు.
నక్క వాగు బఫర్ జోన్లో భారీ అపార్ట్మెంట్లను నిర్మిస్తున్నారని, నక్క వాగుకు వచ్చే కాలువలు గల్లంతయ్యాయని పలువురు విలేకరులు హైడ్రా కమిషనర్ దృష్టికి తీసుకు వచ్చారు. దీనిపై కమిషనర్ తక్షణమే ఇరిగేషన్ శాఖ అధికారుల వివరణ తీసుకున్నారు. అక్కడ పర్మిషన్లు తీసుకుని నిర్మాణం చేస్తున్నారా? అని ప్రశ్నించారు. అధికారులు పర్మిషన్లతో కొన్ని నిర్మాణాలున్నాయని సందేహాస్పదంగా వివరణ ఇవ్వడంతో ఆయన నక్కవాగుకు సంబంధించిన పూర్తి డిటైల్స్‌తో కూడిన నివేదిక ఇవ్వాలని కోరారు. అనంతరం, అధికారుల వద్ద ఉన్న సాకి చెరువు నక్షాను పరిశీలించి వాటిలోని ఆక్రమణలను తెలుసుకున్నారు.